నేనూ ఉమర్‌ వొకే వయసు. కానీ, అందరిలానే వాణ్ని నాకూ ‘‘ఉమర్‌ భాయ్‌!’’ అనే పిలవడం అలవాటయింది. నేనే కాదు, మా ఆవిడ రజియా కూడా వాణ్ని అట్లానే పిలుస్తుంది. మొదట్లో మా వాడు - సాజిద్‌, ఇంటర్‌ చదువుతున్నవాడు కూడా - వాణ్ని ‘‘ఉమర్‌ భాయ్‌’’ అనే పిలుస్తూంటే, ‘‘మరీ బాలేదురా, నువ్వు ఉమర్‌ చాచా అని పిలువు!’’ అని వాణ్ని కట్టడి చేసేశాం.‘‘రంజాన్‌ ఉపవాసాలు కూడా మొదలయ్యాయ్‌. 

ఉమర్‌ భాయ్‌ ఈసారి కనిపించనేలేదు. కొంచెం కనుక్కోండి!’’ ఆ సాయంత్రం రజియా చాయ్‌ ఇస్తూ అడిగింది.ఈ కరోనా లాక్‌డౌన్‌ వల్ల నా ప్రపంచమంతా కొంచెం మారిపోయింది. ఆన్‌లైన్‌ క్లాసులతో మామూలుగా కంటే పనిభారం ఎక్కువ అనిపిస్తోంది. టెక్నాలజీ నాలో యేదో అస్తిమితత్వానికి కారణమవుతోంది. ఆన్‌లైన్‌ పాఠం అయిన ప్రతిసారీ అనిపిస్తుంది, నేరుగా క్లాస్‌లో అయితేనే నాకు నచ్చేట్టుగా చెప్పగలనేమో.ఈ కొత్త హడావుడిలో రంజాన్‌ చంద్రుడు కనిపించడమూ, ఉపవాసాలు మొదలు కావడమూ గమనించుకోలేదు. ఇంకో విధంగా చెప్పాలంటే, వాటిని గమనించుకోగలిగే ముస్లింతనానికి తను కొంచెంగా దూరమవుతూ వస్తున్నాడు కొంతకాలంగా -‘‘ఈసారి రోజాలైనా వుంటారా?!’’ అని రజియా ఆ సాయంత్రం గట్టిగానే అడిగింది. కాస్త నిరాసక్తంగా తల వూపడమో యేదో చేశాను కానీ, కచ్చితంగా యేమీ చెప్పలేకపోయాను. సాయంత్రం చాయ్‌ సమయానికి ముగ్గురం ఎక్కడున్నా ముందు గదిలో కనీసం అరగంట కలిసి చాయ్‌ బిస్కట్లు షేర్‌ చేసుకుంటాం.

కబుర్లకి కూడా అదే మంచి సమయం. మామూలుగా అయితే, ఉమర్‌ యేదో వొక సమయంలో వచ్చి పలకరించే వెళ్తాడు.‘‘ఉమర్‌ భాయ్‌కి ఫోన్‌ చేయండి! లాక్‌డౌన్‌ తరవాత అసలు రానేలేదు!’’‘‘అవును, బాబా! కనీసం ఫోన్‌ చేద్దాం!’’నాకు ఈ పరిస్థితి మరీ అన్యాయంగా అనిపించింది. సాధారణంగా వాళ్ళెవరూ గుర్తు చేయకుండానే ఉమర్‌ని నేనే ఒకటికి పదిసార్లు పలకరిస్తూ వుంటాను. లాక్‌డౌన్‌కి ముందు వాడే వచ్చి వెళ్ళాడు కూడా!ఇంకో ఆలోచన చేసే లోపే సాజిద్‌ టేబుల్‌ మీద వున్న మొబైల్‌ పట్టుకొచ్చి, నా చేతుల్లో పెట్టాడు. ఉమర్‌ నంబర్‌ నొక్కి, వాడి జవాబు కోసం ఎదురుచూస్తున్నా.