గూళ్లలోంచి పక్షులు కిలకిలమని అరుచుకుంటూ గుంపులు గుంపులుగా మేతకెళుతున్నాయి. వాటి అరుపులకి గాడుబాయికి మెలకువొచ్చింది. తూర్పు దిక్కు చూసింది. మబ్బుల్ని చీల్చుకుంటూ మెలమెల్లగా సూర్యుడు బయటకు వస్తున్నాడు. చూస్తుండగానే సూర్యుడు నడినెత్తికెక్కినాడు. గాడుబాయికి ఒకటే ఆరాటంగా ఉంది. ఈ రోజైనా రాకపోతారా అనుకుంది.. అలా అనుకోవడం ఏ వందోసారో.. ఇక ఉండబట్టలేక ‘‘చెల్లీ.. ఇటువైపు ఎవరైనా వస్తున్నారా’’ అని గడ్డ మీదున్న కానుగచెట్టును అడిగింది.

కొమ్మల్ని కదిలించి, ఆకులు తిప్పి అటుయిటు చూసింది కానుగచెట్టు.ఎవరి జాడా కనపడలా..‘‘ఏమైందక్కా నీకు? రెండు మూడు రోజుల నుంచి చూస్తున్నా.. ఎవరైనా వస్తున్నారా అని అడుగుతావు. నేనేమో రాలేదంటా. ఎందుకంటే ఏం లేదంటావు.. నీలో నీవే కుమిలిపోతున్నావు. ఏమైందక్కా.. నాకు చెప్పకూడదా’’ అనునయింపుగా అడిగింది కానుగచెట్టు.కానుగచెట్టు ఊరడింపు మాటలకు గాడుబాయి గుండెలో గూడుకట్టుకొని ఉన్న బాధ కన్నీరై బయటకొచ్చేసింది. పొగిలి పొగిలి ఏడ్చింది. తన గుండెలోని బాధంతా బయటకు వొచ్చేంత వరకు ఏడ్చి తెప్పరిల్లింది.

దుఃఖాన్ని దిగమింగుకున్న గాడుబాయి మెల్లగా మనసు విప్పింది.‘‘ఎప్పుడూ ఈపాటికి వచ్చేవోళ్లు. వాళ్లు వస్తానే నా వొళ్లంతా చక్కలిగింతలు పెట్టినట్లుగా ఉండేది. ఈసారి ఇంకా రాలా. నా అనుకున్నోళ్లు రాకపోతే బాధగా ఉండదా. అందుకే ఏడుపు అపుకోలేకపోయినా’’ బాధగా అంది గాడుబాయి.‘‘నిజమేలే.. మనవాళ్లు రాకపోతే బాధ ఉంటుంది. ఇంతకూ నువ్వు వస్తారనుకున్న వాళ్లు ఎవరక్కా’’ అడిగింది కానుగచెట్టు.చాలా కాలం ముందు జరిగిన సంగతులు, తన సమక్షంలో వాళ్లూ వీళ్లూ మాట్లాడుకున్న మాటల్ని నెమరేసుకుంటూ చెప్పసాగింది గాడుబాయి ‘‘ప్రతి సంవత్సరం ఈ సమయానికి ఇక్కడ చాలా సందడిగా ఉండేది. నిండుగా ఉన్న నా చుట్టూ పచ్చదనం కళకళలాడేది. ఎండాకాలం వస్తే చాలు.. ఈత కోసం పిల్లోల్లందరూ వచ్చేవాళ్లు. ఈ పల్లెలో తాతల నుంచి మనవళ్ల వరకు అందరూ నాలో ఈతలాడినోళ్లే. వాళ్లతో మూడు తరాల బంధం నాది. అయితే ఈసారి ఇంకా ఎవరూ రాలేదు. కనీసం చూడ్డానికన్నా రాలా. అందుకే అంతగా ఏడిసినా’’ అంది.