రాత్రి ఎనిమిది గంటలవుతోంది. అసలే వేసవి కాలం. పైగా ఉక్కపోత. ఆపై కరెంట్‌ కోత.. గాలి ఆడటం లేదు. గొల్ల వీధిలోని ఇళ్లల్లో సగం జనం రోడ్ల మీదనే ఉన్నారు. మంచాల మీదా, అరుగుల మీదా ..సాలల్లోన చతికిలబడి పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నారు. నలభైయేళ్ళ మంగయ్యకు మంటగా వుంది. ఒంట్లోనే కాదు మనసులో కూడా. కంచంలో అన్నంతో పాటు తనకెంతో ఇష్టమైన వంకాయ కూర ఉంది. కలుపుకొని తినాలని వుంది. కానీ తినలేడు. పెళ్లాంతో జగడం పెట్టుకోవాలని వుంది. కారణం కనపడటం లేదు. ‘‘ఔనే.. పొద్దుట వొండిన ఆ ఉలవకట్టు వుంది గావాల.. కొంచిం ఎయ్యిమీ..’’ చివరాఖరికి నోరు విప్పాడు మంగయ్య. ‘‘ఏదీ.. ఎక్కడుంది.. రెండు కారేజీల్లో సర్దీసి నీ కళ్ళ ముందే తపేలా కాలేసి పడీలేదా .. మర్సిపోయావేటి ..’’ అంది జయమ్మ. ‘‘అవున్నే .. వొకేల అడుగున కసింతైనా దాసావేటని .. అడుగుతన్నాను..’’ నసిగాడు. ‘‘ఆఁ .. దాసాను.. ఇదా.. ఇందలోన ..’’ ఖాళీ తపేళాను ముందు పడేసి అందామె. ఆమె ఇచ్చిన సమాధానం కన్నా చేసిన పనికి మంటెక్కింది. అయినా తమాయించుకున్నాడు.‘‘ఔనౌను... నానంటే ఒక్కడికే కూరొట్టుకెళ్లాల.. నువ్వైతే ఇద్దరికీ... నీకూ ఆ రాజుగాడికి సరిపోవాల గదేటి.. ఇంకెక్కడ మిగుల్తాది ..’’ అన్నాడు.అతని మాటల్లో వెటకారం కంటే, వేసిన నిందకు అవమానం లావాలా జివ్వున ఎగజిమ్మింది.దిగ్గున లేచింది. జుత్తు ముడేసుకొని, అతని ముందుకొచ్చి చేతులు జోడించింది. ‘‘నాయన.. నీకో దండం.. మొదలుబెట్టీసేవా.. నాను బతికున్నంతదాక నీకీ జబ్బు పోదు గావాల.. ఏ దిప్పరగొట్టోడు నీ సెవిలో ఈ సంగతి వూదీశాడో గానీ ఆడికో దండం..ఆడి నోరు పడిపోవాల.. నాసినమైపోవాల.. నువ్వు అనుమానం కట్టిందానికి .. ఆడు సెప్పిందానికి.. సరిగ్గా సరిపోయింది.. అమ్మా.. ఇప్పల పోలమ్మ తల్లీ... ఈ అనుమానం మొగుడితో ఎన్నాళ్ళమ్మా నాకీ పర్రాకులు..’’ ఆమె గొంతులో దుఃఖం, కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి.‘‘కుమ్మరోడితో సాల్లేక కుండలు బద్దలు కొట్టీసిందాయట ఎనకటికి నీలాటిదాయొకటి.. మజ్జిలోన ఆ సీనుగాడేటి సేశాడు.. ఉన్నిదే గదా సెప్పేడు.. ఎవులు సెప్తే యేటి .. అది నిజమా, కాదా .. కాదని సెప్పు.. నువ్వు సెప్పిందానికి ఒప్పుకుంతాను..’’ గొంతు పెంచి ఆవేశంగా అన్నాడు.

                                             ********************************************