‘‘దాస్‌ సాబ్‌ మిల్నా చాహతా హై.. ఆప్‌ మీటింగ్‌ హోనేకే బాద్‌ ఇధరీ రహియే!’’ అంటున్న కుర్రాడి వైపు తిరిగాడు.‘‘ముజుసే..?’’ జగన్నాథరాజు మళ్లీ అడిగాడు.అవునని మరోమారు చెప్పి అతను వెళ్లిపోయాడు. అయినా అనుమానం వదలలేదు. ఒకమారు పుట్టపర్తిలో ఇలాగే జరిగింది. బాబాగారి కబురు పదిమందిలో. తనకేమోనని వెర్రాడిలా అక్కడే ఉండిపోయాడు. ఓ కోటుమనిషిని తరవాత లోపలికి తీసుకువెళ్లారు.

ఇప్పుడీ కబురు ఎవరికి.. చుట్టూ చూశాడు.. అందరూ హిందీ వాళ్లు.. కోట్లు వేసుకుని కొందరు.. కాజువల్స్‌లో కొందరు.. అంతా ఫ్రొఫెసర్లు.. స్టూడెంట్లు..వేదిక మీద కార్యక్రమం కొంతసేపటి క్రితమే ఆరంభమయింది. ఆరోజు ప్రసంగం చేసేది హరి.సి.దాస్‌. అనే ప్రసిద్ధ ఇండో - ఆంగ్లన్‌ రచయితట. ‘జీవికకీ జీవితానికీ తేడా’ అన్నది అంశం.ఆ సభాంగణం నిండిపోయింది. కొందరు విద్యార్థులు కుర్చీలు ఖాళీలేక నేలమీదనే కూర్చున్నారు. 20 డిగ్రీలకి కట్టడి చేసిన ఉష్ణోగ్రత శరీరానికి సుఖంగా ఉంది. చీమ చిటుక్కుమంటే పట్టుకోగలిగిన శ్రవణ సాంకేతికత చెవులకి కమనీయంగా ఉంది.తాను హాజరైన కమ్యూనిస్టు సభలు రాజుకి గుర్తువచ్చాయి. ఇంత శ్రద్ధగా నిశ్శబ్దాన్ని పాటిస్తూ చెప్పబోయేది వినటానికి ఆ శ్రోతలు తయారుగా ఉండేవారా? ఏమో గుర్తు రాటంలేదు. 30 ఏళ్ల క్రితం కథలవి.సాయిబాబా గారు మాట్లాడుతుంటే ఇంతకన్నా నిశ్శబ్దం. శ్రద్ధ. అంతెందుకు గుడిలో ప్రవచనాలు చెప్పేటపుడూ ఇలాగే ఉండేది. విజ్ఞాన సంస్థలలో విద్యార్థులు ఆచార్యులూ వీళ్లు. వీళ్ల శ్రద్ధ ఏ కోవకి చెందినది.రాజు ఆలోచనలు అక్కడికి చేరేసరికి వేదికమీదకి పిలుపులు ఆరంభం.

దాస్‌ వచ్చి సభకి నమస్కరించాడు. మూడు నమస్కారాలతో సభ అంతటినీ కలయజూశాడు. తెల్లగా పండులా ఉన్నాడు. తనకన్న కాస్త చిన్నాడేమో..వేదికమీదకి ఆహ్వానించినవారు దాస్‌ జీవిత విజయాలను ఏకరువు పెడుతున్నారు. ఆయన నవలలను పెంగ్వీన్‌ వారు వేశారట. తాత్విక, ఆధ్యాత్మిక గ్రంఽథాలు వచ్చాయట. ఏదో పెద్ద కంపెనీ ఉద్యోగం వదులుకుని సాహిత్య, సమాజ సేవకి అంకితమయ్యారట. సరిగ్గా అది వింటున్న సమయంలో రాజుకి ఈ కబురు అందింది. బహుశా ఆయనకి బొకే అందించిన కుర్రాడు అయ్యుంటాడు అనుకున్నాడు రాజు.