నిమ్మాండు నాయక్కర్‌ వయసు మళ్ళిన మనిషి. పేరక్క ఆయన భార్య. ఆ ఇద్దరి అంతిమ కాలం గురించిన కఽథ ఇది.నిమ్మాండు నాయక్కర్‌ పెద్ద సంసారి. ఎనబై ఎకరాల మాగాణి, నాలుగు జతల కాడి ఎడ్లు, కొట్టం నిండుగా పశు సంపద, సమృద్థిగా పాడి పంటలు. ప్రస్తుతం ఉంటున్న తాత ముత్తాతల నాటి ఇల్లు కాకుండా అదనంగా మిద్దె ఇళ్ళు మూడు.

నిమ్మాండు నాయక్కర్‌ పేరక్కలకు మొత్తం ఎనిమిది మంది సంతానం. నలుగురు కొడుకులు, నలుగురు కూతుళ్ళు. ఆడపిల్లలకు మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేశారు. కొడుకులకు పెద్దింటి అమ్మాయిలనే తీసుకు వచ్చారు.నిమ్మాండు నాయక్కర్‌కు, పేరక్కకు తమ పిల్లలంటే ఎంతో ప్రేమ. పెళ్ళై కాపురానికి వచ్చినప్పుడు పేరక్క నూరు తులాల బంగారంతో ఈ ఇంటికి వచ్చింది. ఆ కాలంలోనే నూరు తులాలు అంటే మాటలా! ఆడపిల్లలకు పెట్టిన తరువాత మిగిలిన దాన్ని మనవళ్ళకు, మనవరాళ్ళకి పంచి పెట్టేసింది.కాలక్రమాన ఆస్తి పంపకాలు జరిపించాలని చిన్నతరం వాళ్ళకి ఆలోచన పుట్టుకు వచ్చింది. కానీ ఆస్తిని పంచి ఇవ్వమని నేరుగా తండ్రిని అడగడానికి కొడుకులకు భయం. ఎలాగో ఈ విషయం పెద్దాయన చెవులకు చేరింది. ఒక రోజు పత్తి పొలం నుంచి తిరిగి వస్తున్నప్పుడు, అలసట తీర్చుకోవడానికి నిమ్మాండునాయక్కర్‌, పేరక్క ఒక చెట్టు క్రింద కూర్చున్నారు.పేరక్కను చూసి, ‘‘పేరక్కా! నువ్వేమంటావు? పోరగాళ్ళు ఆస్తి పంపకాలు జరగాలని ఆశపడుతున్నారట. నీ చెవి దాకా ఏమైనా వచ్చిందా?’’ అన్నారు నిమ్మాండు.‘‘ఇందులో ఏముంది? ఎప్పటికైనా వాళ్ళకి అప్పగించ వలసిన భారమే కదా. పంపకాలు జరిపించి ఇవ్వాల్సిందే కదా. మనకీ వయసు మీద పడుతూ ఉంది. కృష్ణా రామా అంటూ కూర్చుని తినాల్సిన కాలంలో ఎందుకు ఇలా ఆపసోపాలు పడుతూ తిరగడం?’’ అంది పేరక్క.పేరక్క చెప్పిన తరువాత ఇక అప్పీలు ఏముంది?మరునాడే నలుగురు కొడుకులనూ రమ్మన్నారు నిమ్మాండు నాయక్కర్‌. ఆస్తి పంపకాల గురించి వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు కూడా సరే అని తలూపారు.