మిత్రులిద్దరూ హోటల్లో కూర్చొని భోం చేస్తున్నారు. వాళ్ల భోజనం ముగింపు కొచ్చింది. పక్కన కిటికీలోంచి చూస్తే బయట బోలేవార్డు కిక్కిరిసిన జనంతో కనిపిస్తున్నది. వేసవికాలం సాయంత్రాలు ప్యారిస్‌ నగరాన్ని సుతారంగా జోకొడుతూ వీచే పిల్లగాలుల స్పర్శ వారి వొంటిని తాకుతూ ఆహ్లాదపరుస్తున్నది. ఆ గాలితో పాటు, మనమేదో కొత్త ప్రదేశానికి ఎగిరిపోతున్న అనుభూతి కలిగిస్తున్నది. 

నీకు తెలియకుండా నిన్ను మిణుగురు కాంతుల్లో, వెన్నెల ప్రవాహాల స్వప్నాల్లో విహరింపజేస్తున్నది.ఇద్దరు మిత్రుల్లో ఒకరైన హెన్రీ సైమన్‌ దీర్ఘంగా నిట్టూర్చుతూ విచారంగా అన్నాడు: ‘‘ఏమిటో పియరీ! రోజురోజుకూ నేను త్వరగా ముసలాడినై పోతున్నాను. అట్లా అవుతున్నందుకు నాకు విచారంగా ఉన్నది. గతంలోనైతే ఇలాంటి అందమైన సాయం సమయాల్లో నాలోకి కొత్త జీవం వొచ్చినట్టు ఉండేది. ఇప్పుడా అనుభూతిని కోల్పోయినందుకు చింతించడం తప్ప ఏమీ చేయలేను. ఎందుకంటే జీవితం చిన్నది కదా!’’సైమన్‌కు బహుశా నలభై అయిదేళ్లు ఉంటాయి. కానీ అంతకన్నా ఎక్కువ వయసున్నవాడిలా కనిపిస్తాడు. అతని జుట్టు చాలావరకు రాలిపోయి బట్టతల వొచ్చేసింది. అలాగే ఒక పద్ధతి లేకుండా పెరిగిపోయిన కొవ్వుతో స్థూలకాయం కూడా ఏర్పడుతోంది.

పక్కనే వున్న రెండోవ్యక్తి పియరీ కార్నియర్‌ వయసులో మరింత పెద్దవాడు. కానీ సైమన్‌ కంటే సన్నగా, చురుగ్గా ఉత్సాహంగా కనిపిస్తున్నాడు.‘‘చూడు సోదరా! నేను నీకంటే చాలా పెద్దవాణ్ని. పైగా వృద్ధున్ని కూడా. కానీ నా వయసు ఎప్పుడు కరిగిపోయిందో, ముసలి తనం నన్నెప్పుడు కావలించుకున్నదో కనీస మాత్రమైనా గ్రహింపు లేదు. ఎందుకంటే నేనెప్పుడూ చీకూచింతా లేకుండా హుషారుగా, ఆరోగ్యంగా ఉంటాను’’ పియరీ కార్నియర్‌ చెపుతూ పోయాడు.‘‘బ్రదర్‌.. ప్రతి రోజూ అదేపనిగా అద్దంలోకి తొంగిచూసుకునే వాడికి వయసు ఎట్లా మీదపడుతున్నదీ, మనిషి మీద కాలం ఏవిధంగా ప్రభావం చూపుతున్నదనే విషయంలో సరైన అవగాహన ఉండదు. నిజానికి కాల ప్రభావం నెమ్మదిగా ఉంటుంది. అందువల్ల దాని గమనం స్పష్టమైన ఉనికి లేకుండా, మనమీది నుంచి నడిచి వెళ్లిపోతుంది. మార్పులు మనకు అందవు. ఈ ఒక్క కారణంతోనే రెండు మూడేళ్ళ ఉద్విగ్నత, ఉద్వేగాల అనంతరం కూడా మనం ఆవేదనతోనూ, విషాదంతోనూ మరణించం...