ఆరులైన్ల రోడ్డు విస్తరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కానీ ఒకచోటకు వచ్చేసరికి మాత్రం పని ముందుకు సాగడం లేదు. విస్తరణకు అడ్డుగా ఉన్న ఆ రెండు సమాధులను బుల్‌ డోజర్లతో తొలగించేద్దామనుకున్న ప్రతిసారీ ఏదో ఒక ఆటంకం వస్తోంది! వర్కర్లు సెంటిమెంట్‌ ఫీలవుతున్నారు. అక్కడేదో శక్తి ఉంది. ముందుకు కదలనీయడంలేదంటున్నారు వర్కర్లు. దాంతో ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ రంగంలోకి దిగాడు. అప్పుడు ఏం జరిగిందంటే...........

************************

రాత్రి తొమ్మిది గంటలు సమయం.వెన్నెల స్వచ్ఛంగా ఉంది. చెట్లఆకులుపై పడుతున్న వెన్నెలకాంతి పరావర్తనం చెందుతూ, అక్కడక్కడ మెరుస్తోంది. గాలి చల్లగా వీస్తూ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది.నగరంలో వాహనాల రద్దీని తగ్గించటం కోసం, పట్టణశివార్లలో పొలాల మధ్య నుండి వేస్తున్న బైపాస్‌ రోడ్‌ పనులు జరుగుతున్నాయి. ఆరువరుసల రహదారి నిర్మాణపనులు రాత్రనక పగలనక చురుకుగా సాగుతున్నాయి.ఆ ప్రాజెక్టుకి చీఫ్‌ ఇంజినీర్‌ రఘురామ్‌. నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రాంతంలో కారు ఆపి ఆక్కడ దిగాడు. చల్లగా వీస్తున్న గాలి అతడి శరీరాన్ని స్పృశిస్తూ ఆహ్లాదపరిచింది. నిర్మాణంలోవున్న రోడ్డుపక్కన పొదల్లో వేటి కోసమో అతనికళ్ళు వెతుకుతున్నాయి. రెండు అడుగులు ముందుకువేసి అటువైపు పరికించి చూడసాగాడు.దట్టంగాపెరిగిన గుబురులమధ్య, వెన్నెల వెలుగులో రెండు సమాధులు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. చేతిలో టార్చ్‌ ఆన్‌చేసి అటువైపు ఫోకస్‌ చేశాడు. గోరీలుచుట్టూ బ్రహ్మజెముడు మొక్కలు అలుముకున్నాయి.

ఎన్నోఏళ్లుగా ఎండకిఎండి, వానకుతడుస్తూ, బాగా నాచుపట్టి ఉన్నాయి సమాధిగోడలు. వాటికి కాస్త దగ్గరగా నడచి టార్చ్‌ని ఫోకస్‌చేస్తూ అటూ ఇటూ తిప్పుతూ పరిశీలించసాగాడు రఘురామ్‌.సమాధిలో ఆత్మలుంటాయా? వాటికి శక్తులుంటాయా?డామిట్‌...! ఈ కాలంలో అలాంటి మూఢనమ్మకాలు ఏమిటి? ఎవరైన వింటే నవ్విపోతారు. అతడిలో ఉద్భవించిన ప్రశ్నలను అతడే ఖండించుకున్నాడు.రెండు సమాధులు ఐదు అడుగులు దూరంలో పక్కపక్కనే ఉన్నాయి. రోడ్డు విస్తరణలో భాగంగా వాటిని తీసివేయవలసి వచ్చింది. రోడ్డు కొలతల పరిధిలోకి ఒకటిమాత్రమే వచ్చింది. రెండవ దానిని తొలగించనవసరం లేదు. ఒకటి తీస్తే సరిపోతుంది. అదేమంత కష్టమైనపని కాదు.కానీ తన సిబ్బంది వాటిగురించి ఏవేవో కథలూ, కబుర్లు, చెబుతూ తనను ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. అందుకే తనే స్వయంగా రంగంలోకి దిగవలసి వచ్చింది.