టూ వీలర్‌ సర్వీస్‌కివ్వాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇవ్వాళ్టికి కుదిరించుకున్నాను. ఏదైనా ప్లాన్‌ చేసుకుంటే కానీ కుదిరేలా లేదు.అందరిలాగే నేను నా కాలాన్ని యాభై వేలకు ఓ ఆఫీసు ఓనరుకు అమ్ముకున్నాను. ఉదయం తొమ్మిది గంటలకు వెళ్లి సాయంత్రం ఆరు గంటలకు రావాలి. సిటీలో చాలామంది మాదిరే నా జీవితంలో కూడా ఆఫీసు తప్ప మరేమీ లేకుండా పోయింది. వారానికి ఒక్క వీకాఫ్‌ వస్తే అది పెండింగ్‌ పనులకు సరిపోతుంది. ముందుగా ప్లాన్‌ చేసుకున్న పనులు తప్ప మిగతా పనులు ఏవైనా వచ్చి మీదపడితే మా చెడ్డ చిరాకు నాకు.మొన్నకు మొన్న ల్యాప్‌టాప్‌ చెడిపోయింది. చెమట్లు పట్టాయి. అప్పటికే పూర్తి చేయాల్సిన టార్గెట్లు చాలా ఉన్నాయి. ఆఫీసులో ఒక పూట పర్మిషన్‌ తీసుకుని సికింద్రాబాద్‌ వెళ్లి దాన్ని ఆగమేఘాల మీద సర్వీస్‌ సెంటర్‌లో చూపించాను.‘రెండు రోజులు పడుతుంది.. బిజీ’ అన్నాడు సర్వీసతను.‘ఎలాగైనా రేపు పొద్దునకు ఇచ్చేయాలి, అర్జంటు ప్రాజెక్టు ఉంది’ అని బతిమాలాను. నాలాంటి అర్జంట్లు అతను చాలా చూసి ఉంటాడు కదా లెక్కచేయలేదు. చివరికి నిరుత్సా హంగా మొహం పెట్టి ‘కనీసం రేపు సాయంత్రానికైనా ఇవ్వండి’ అన్నాను.అప్పటికే షాపు నిండా రిపేర్‌ కోసం ఉన్న ల్యాపు టాపులను చూపిస్తూ ‘ప్రయత్నిస్తానండి..’ అన్నాడతను.ఏదో ఒకటి చేయాల్సిందిగా మళ్లీ ప్రాధేయపడ్డాను. చివరికి అతను కొంచెం తగ్గి ‘సరే’ అన్నాడు.ఇక ఆ మాటే వేదంగా రశీదు తీసుకుని ఇంటికొచ్చేశాను. ఆ మరుసటి రోజు ఆఫీసులో ఏవో తిప్పలు పడి కాసేపు డెస్క్‌టాప్‌లో మరికాసేపు మా మేనేజర్‌ ల్యాప్‌టాప్‌లో పని చేసుకున్నాను. అలవాటు లేని డివైస్‌ల మీద పని చేయడం ఎంత కష్టమో అప్పుడు అర్థమైంది. ఆ క్షణం నాకు నా సొంత ల్యాప్‌టాప్‌ మీద ఎంతో ప్రేమ కలిగింది. సాయంత్రం వెళ్లి అపురూపంగా ల్యాప్‌టాప్‌ని రిసీవ్‌ చేసుకున్నాను. అందులో డాటా ఏమీ పోలేదు కదా అని చెక్‌ చేసుకుని తిరిగొచ్చాను. ఐదు వేలు బిల్లు వేశాడు అయినా బాధనిపించలేదు. పైగా సమయానికిచ్చినందుకు సంతోషం కలిగింది.

                                   *********************************************************