‘‘మీ ఎద సౌందర్యం యినుమడించడానికి నేడే వాడండి ప్లంజ్‌ బ్రా. మూడోవంతు మాత్రమే ఆచ్ఛాదన. మిగతాదంతా ఆస్వాదన. మర్చిపోకండి ప్లంజ్‌ బ్రా. టిన్‌ టిన్‌ టిన్‌’’ నవ్వుతూ ఫోన్‌ పెట్టేసింది వర్ష.వర్ష మాటల్లో చెప్పాలంటే తనూ నేనూ ఫ్రెండ్స్‌. వర్ష మాటల్లో అని నొక్కి పలుకు తున్నానంటే, నా వుద్దేశం వేరుగా వుందని కాదు. వర్ష అంటే నాకు చాలా యిష్టం. కానీ నాకు గుర్తున్నంతవరకూ, తన విషయంలో నేనెప్పుడూ ఫ్రెండ్‌ అనే పదాన్ని ఉపయోగించ లేదు. ఒకదానికొకటి పొంతన లేని మాటలతో కన్ఫ్యూజ్‌ చేయడానికి ప్రయత్నం చేస్తున్నానని మీరు నన్ను తిట్టుకోవచ్చు. కానీ ప్లంజ్‌ బ్రా వుదంతం మొత్తం తెలిస్తే కొంతవరకూ నా బాధ మీకు అర్థమయ్యే అవకాశం వుంది.‘‘వాట్సప్‌లో రెండు పిక్‌లు పంపాను. ఒక లుక్కేసి రెండిట్లో ఏది బావుందో చెప్పు’’ వర్ష యిలా అడగడం మామూలే.‘‘చూసి కాల్‌ చేస్తా, పెట్టెయ్యి’’ అన్నాను.‘‘ఇంతోటి దానికి మళ్లీ కాల్‌ బ్యాక్‌, కాల్‌ ఫ్రంట్‌ ఎందుకు? లైన్లో వుంటా, చూసి చెప్పవోయ్‌’’ అంది. 

 

తీరా చూద్దును గదా, అక్కడ వుంది వొకటే ఫోటో. దాన్నే రెండుసార్లు సెండ్‌ చేసింది. అదే విషయం చెప్పాను.‘‘అనుకున్నా. ముందే అనుకున్నా నువ్విలా అంటావని. కాస్త బుర్ర పెట్టి చూడు. రెండు పిక్స్‌లో వొకటే బ్యాగ్రౌండ్‌ వుందా?’’ విసుగు నటించింది. నిజమే, అవి రెండూ వేర్వేరు ఫోటోలే. కానీ రెండిట్లో వొకటే డ్రస్‌, వొకటే హెయిర్‌ స్టయిల్‌. అదే మాట అనబోయి, ఎందుకైనా మంచిదని పట్టిపట్టి చూశాను. ఏం తేడా కనిపించలేదు.‘‘బ్యాగ్రౌండ్‌ పక్కన పెడితే వొకేలాగా వున్నాయిగా?’’ అడిగాను.‘‘ఒరే మొద్దూ, జాగ్రత్తగా చూడు. ఒకదాంట్లో ప్లంజ్‌ బ్రా వేసుకున్నా, ఒకదాంట్లో పుష్‌ అప్‌ బ్రా వేసుకున్నా. షేప్‌లో డిఫరెన్స్‌ తెలీట్లేదా?’’ ఈసారి నిజంగానే విసుక్కుంది. కళ్లు కాస్త కిందకి దించి తీక్షణంగా చూశాను. నిజం చెప్పాలంటే నాకు యిప్పటికీ అర్థం కావట్లేదు.ఏదో అర్థమైనవాడిలా, ‘‘రెండోదే బావుంది’’ చెప్పాను.‘‘కదా. నాకూ అదే అనిపించింది. ఏమైనా ప్లంజ్‌ బ్రాలో వుండే అట్రాక్షన్‌ వేరు. నువ్వు ట్యూబ్‌లైట్‌ వే లే కానీ, కాస్త యీస్థటిక్‌ సెన్స్‌ వున్న ట్యూబ్‌లైట్‌ వి. ఇంతకీ అకేషన్‌ ఏంటని అడగవేఁ?’’