19న ఆర్‌.నారాయణమూర్తికి, అక్కినేని జీవన సాఫల్య పురస్కారం

హైదరాబాద్, నల్లకుంట: మహానటుడు డాక్టర్‌ అక్కినేని నాగేశ్వరరావు 93వ జయంతి సందర్భంగా యువకళావాహిని ఆధ్వర్యంలో అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత్ 22వ ఉభయ తెలుగు రాష్ట్రస్థాయి నాటిక పోటీలు-2016 ఈ నెల 18, 19 తేదీల్లో రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్టు సంస్థ అధ్యక్షుడు వై.కె.నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం హైదర్‌గూడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 18న మాతృక, యాది, ఈ లెక్క ఇంతే, బైపాస్‌ నాటికల ప్రదర్శన, 19న పితృదేవోభవ, అమ్మసొత్తు, ఎవరిని ఎవరు క్షమించాలి, నాటిక ప్రదర్శనలు జరుగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా 18న ప్రముఖ రంగస్థల నటులు ఎం.వి.ఎస్‌.హరనాథరావు, ఎన్‌.రవీంద్రరెడ్డి, ఎ.కోటేశ్వరరావు, టి.రామచంద్రరావులకు పురస్కార ప్రదానం జరుగుతుంది. 19న ప్రముఖ సినీ దర్శక, నిర్మాత, నటుడు ఆర్‌.నారాయణమూర్తికి డాక్టర్‌ అక్కినేని జీవన సాఫల్య పురస్కార ప్రదానం జరుగుతుందని తెలిపారు. తమిళనాడు గవర్నర్‌ డాక్టర్‌ కొణిజేటి రోశయ్య, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రామలింగేశ్వరరావు, తదితరులు హాజరవుతారని ఆయన వివరించారు.