నీకు చెబితే అర్థం కాదు కానీ

మన మధ్య దూరం, కొన్ని వేల దాహాలు
అందుకే నువ్వెళ్లిపోతానంటే ఆపలేదు
అంత మాటంటానని నువ్వనుకోలేదు కదూ
 
సాయంత్రపు గాలికి రాలిపడి, గాయపడి
ఆకాశపు ముక్కల కింద నలిగే నాతో
నీకేం పని, పిల్లా?
నువ్వు ఎక్కి పోయిన ఆకాశపు నిచ్చెన
 ఇంకా పరిమళిస్తూనే ఉంది
మళ్లీ వెనక్కి రాకు. ఇక్కడేం లేదు గతం తప్ప
 
అర్ధరాత్రి సముద్రానికి చీకటి తాగిస్తూ
పాదముద్రలు పడకుండా నడుస్తాను నేను
కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడినా ఏ రోజూ
నా ఆత్మలో ఇసుమంతైనా అలలకు ఇవ్వలేదు
గుమ్మడి పాదు మీద గొంగళి పురుగును
ప్రాణాలతో నేను వదిలేస్తే
నాది జాలి గుండె అనుకున్నావు కదూ
ఇంతకు ముందెప్పుడూ పెస్సిమిస్టును చూడలేదా?
 
కలలు కవితలై కాలుతున్నా, చలి ఇంకా తగ్గలేదు
వెచ్చదనం, ఉష్ణం అన్నీ నీతోనే పోయాయి మరి
కొద్దిగా పగిలిన కిటికీ అద్దంలోంచి
ఒంటరితనపు చలి అలలు, నిద్రపోనిస్తేగా
గుండె లోపలి మంచు పలకలు
ఇంకా బిగుసుకుపోతున్నాయి
 
భూమికి స్నానం చేయించి ఆకాశం శుభ్రపడ్డట్టు
మనల్ని విడదీసి మన కథ రక్తి కట్టింది
ఇప్పుడు మనం లవ్‌ ఫెయిల్యూర్‌ హీరో హీరొయిన్లమ్‌
What a Story! అయినా
పెన్సిల్‌ అరిగిపోయేదాకా ఆకాశంలో మబ్బులు గీసి
కురిశాక వాన మీద అలిగాను చూడు
ఏమనాలి నన్ను?
నీక్కూడా తెలీదన్నావు కదూ. మర్చిపోయా
 
చెబితే నువ్వు నమ్మవు కానీ, నువ్వెళ్ళిపోయాక
ఉదయపు పిచ్చుకల పాటలన్నీ కంఠతా వచ్చాయి తెలుసా?
పిచ్చుకనైపోదామనుకొని పాటనయ్యాను చివరికి
అయినా శూన్యంలో పడిపోతున్నవాడికి
రెక్కలతో ఏం పని పిల్లా?
నా గురించి ఏం ఆలోచించకు
 
ఏమడిగినా అంతరిక్షంతో మొదలెడతావ్‌ అని
నన్ను విసుక్కునేదానివి
ఇప్పుడు నిద్ర పట్టక కిటికీ లోంచి చూస్తే
నాతో పాటు తోడుగా మండేవి నక్షత్రాలే మరి
 
నది ఒడ్డున జమ్మి చెట్లు నా కథ విన్నాయి
వర్షపు తడిలో సాయంత్రం ఇంకిపోయాక
రాత్రి, చలి, దాహం, ఆయాసం
దూరంగా కాలపు నది అవతల ఏదో దీపం
ఇదివరకు దహించిపోయిన మన ఆత్మలు అవి
కన్నీళ్లు ఇంకిపోయాక
కళ్ళు రెండూ రాజేసుకొని చలి కాచుకునే యజ్ఞంలో
ఈ రాత్రి ఎప్పుడు గడుస్తుందో
 
స్వరూప్‌. టి