గాలి మంద్రస్వరంలో పాటెత్తుకుంటే

 చిగురాకులు కదిలేలా

తాపీగా తలూపుతుంది చెట్టు
 
పాట పైస్థాయికి చేరుకుంటే
కొమ్మలన్నీ ఊగేలా
కాలు కదుపుతుంది
 
గాలి శృతిని బట్టి
చెట్టు లయ మారుతుంది
 
గాలి ఉద్రేకంగా పాడినపుడు
చెట్టు ఉన్మాదంగా ఊగిపోతుంది
చెట్టుకిది ఎలాంటి వ్యసనమంటే
గాలి పెదవి విప్పకపోతే
ఆకైనా కదల్చదు చెట్టు
 
ఇక
ఈ కళలో పండిపోయిన ఎండుటాకులైతే
గాలి పాటతో గలగలమని
గొంతు కూడా కలుపుతాయి
 
వెంకటేష్‌ పైడికొండల
81215 33112