తెలుగు అధ్యయన శాఖ, బెంగుళూరు విశ్వవిద్యాలయం, సాహిత్య అకాడెమిల సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్‌ 8న ‘‘తెలుగు - కన్నడ కథా సాహిత్యం: ప్రపంచీకరణ నేపథ్యం’’ అంశంపై ఒక సాహిత్య సదస్సు జరిగింది. ఇందులో తెలుగు, కన్నడ సాహిత్యాల తరఫున ఆయా భాషల రచయితలు పాల్గొన్నారు. తనను తాను ‘గే’గా ప్రకటించుకున్న కన్నడ రచయిత వసుధేంద్ర ఈ సదస్సులో పాల్గొని ‘‘కన్నడ సాహిత్యంలో ‘గే’లు’’ అనే పత్రాన్ని సమర్పించారు. LGBT (Lesbian, Gay, Bi-Sexual, Transgender) ఇటీవల బాగా చర్చలోకి వస్తున్న అంశం. ఇద్దరు స్త్రీలు శారీరక సంబంధాన్ని కలిగివుంటే ‘లెస్బియన్‌’ అనీ, ఇద్దరు పురుషుల మధ్య సంబంధం ఉంటే ‘గే’ అనీ, స్త్రీ పురుషులిద్దరితోనూ సంబంధం కలిగి ఉంటే ‘బై సెక్సువల్‌’ అనీ, లింగమార్పిడి చేసుకుంటే ‘ట్రాన్స్‌జెండర్‌’ అనీ అంటున్నారు. ఈ సమూహాలు తమ స్వరాన్నీ, ఆలోచననీ వినిపించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా వసుధేంద్ర సమర్పించిన పత్రం ఆలోచనను, అవగాహనను కలిగించేదిగా ఉంది. ఆయన పత్రానికి నేను చేసిన అనువాదంలో కొంత భాగం ఇది.

కె. ఆశాజ్యోతి
94496 72394

 
‘గే’ బతుకులోని వ్యథలను చిత్రిస్తూ ఇటీవల నేను రాసిన కథా సంపుటి ‘‘మోహనస్వామి’’ని ఒక సాహితీ మిత్రుడికి ఇస్తే, ‘‘ఈ ‘గే’ వైరస్‌ అనే మహమ్మారి మనోళ్ళు ఇంగ్లండ్‌, అమెరికా దేశాలకు వెళ్ళిన ప్పుడు అటాక్‌ చేసిందా?’’ అని అమాయకంగా అడిగాడు. ఎటువంటి వ్యంగ్యం లేకుండా వచ్చిన ఆ ప్రశ్నకు తబ్బిబ్బ య్యాను. తరువాత ఏకాంతంలో ఆలోచిస్తే ఆ ప్రశ్న అడగడంలో తప్పులేదనిపించింది. సహజంగా కన్నడ సాహిత్యాన్ని మాత్రమే చదువుకున్న అతనికి ‘గే’ ప్రపంచ జ్ఞానమే లేదన్నది అత్యంత సహజమైన విషయం. సమాజంలో ఆ విషయం మాట్లాడడంపై నిషేధం వున్నప్పుడు ఇక ఏ వైపు నుండి అటువంటివారికి ‘గే’ ప్రపంచపు ఆలోచనలు అందుబాటులోకి వస్తాయి?
 
కన్నడ సాహిత్యంలో అక్కడ కొంచం, ఇక్కడ కొంచం ‘గే’లను చిత్రించిన తీరు చదివినప్పుడు, అంత ఆరోగ్యకర వాతావరణం కనపడ లేదు. ఏ ప్రపంచం పట్ల మనకు అజ్ఞానం ఉంటుందో, దాని పట్ల మనం విపరీతమైన భయాన్నో లేదా విపరీతమైన భక్తినో పెంపొందించుకుంటాం. అల్ప సంఖ్యాకమైన ‘గే’ సమూహపు దైహిక వాంఛను అర్థం చేసుకుని, జీర్ణం చేసుకోవడం బహుసంఖ్యాక సమూహలకు సాధ్యం కాకపోవడం వల్ల, కన్నడ సాహిత్యంలో ‘గే’ల జీవితాన్ని వికృతంగానో, భయంకరంగానో చూపించారు. ఆ రకమైన శృంగారాన్ని పాపకార్యంగానో, పరిస్థితుల కారణంగా జరిగినదిగానో, ఇంకా మాట్లాడితే అది అసలు మనిషి చెయ్య వలసిన పని కాదనేసేంత వరకూ ఈ అంశాన్ని చిత్రించారు.
 
జ్ఞానపీఠ పురస్కార గ్రహీత దివంగత శివరామ కారంత్‌ ‘‘మూకజ్జియ కనసుగళు’’ (మూగవ్వ కలలు) నవల నుండి ఈ చర్చను ప్రారంభించవచ్చు. ముసలి అవ్వకున్న అద్భుత శక్తి ద్వారా శిలా యుగం నుండి ఇప్పటిదాకా మానవ నాగరికత అభివృద్ధిని తెలిపే ఈ నవల- చివరలో మానవ నాగరికత పతనానికి నిదర్శనంగా ‘గే’ సంబంధ చిత్రణతో ముగుస్తుంది. సృష్టిలోని స్త్రీ-పురుష సంబంధం పరమ పూజ్యమైనదని చెప్పిన ముసలి అవ్వ, అదే సృష్టిలోని ఇద్దరు పురుషుల మధ్య ఉన్న శారీరక సంబంధాన్ని నీచంగా చూస్తుంది. ‘‘నీ ప్రవర్తన ముందు మార్చుకున్న తర్వాత మిగిలిన విషయాలు మాటాడు...’’ అంటూ తిరస్కార భావంతో అసహ్యించుకుంటుంది. మూగవ్వ అసహ్యించుకునేలా బాలుడితో ఒక వ్యక్తి దేహ సంబంధాన్ని కలిగి ఉండడం అన్నది కూడా ఇక్కడ సమస్య కాదని గ్రహించాలి. ‘‘స్త్రీతో ఆడ వలసిన ఆటను మగవాడితో ఆడే వాళ్ళకు అంత అధిక ప్రసంగం ఎందుకు?’’ అన్న ప్రశ్నతో ‘గే’ వ్యక్తి జీవితంలోని హక్కులను మూలాలతో సహా లాక్కునేస్తుంది. శిలాయుగం నుండి మనిషి స్వభావం గొప్పదనే మూగవ్వ, ఈ ‘గే’ జనం ఈ రోజు కొత్తగా గలీజుగా పుట్టారని మాట్లాడడం తమాషాగా అనిపిస్తుంది.
 
కామరూపి రాసిన ‘‘కుదురె మొట్టె’’ (గుర్రపుగుడ్డు)లోనూ ఇంతకంటే ప్రత్యేకంగా ఏమీ రాయబడలేదు. ఈ నవలలో అత్యంత హీనమైన మనిషిగా పిలవబడే ఒక పాత్ర వికృతత్వాన్ని మరింత పెంచే ఉద్దేశంతో ఆ పాత్ర ‘గే’ అంటూ, అతడు చిన్న పిల్లవాడితో తన కోరిక తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని నవల తెలుపుతుంది. అన్ని సముహాలలో ఉన్నట్టే ‘గే’ సమూహంలో కూడా మంచివాళ్ళూ, చెడ్డవాళ్ళూ ఉంటారు. అయితే అడపాదడపా సాహిత్యంలో చిత్రింపబడే ‘గే’ పాత్రకు బలవంతంగా ‘వికృతి’ లేపనం పూసే నవలా రచయితల ఉద్దేశం మనసుకు బాధ కలిగిస్తుంది. ఇలాంటి రచయితలు ‘హోమోఫోబియా’తో సతమతమవుతున్నారని అర్థమవుతుంది.