మా గాంధితాత
అడుగువెట్టిన చాలు అవనీంద్ర రత్న రం
జిత కిరీటములు హారతు లొసంగు!
బయలుదేరినచాలు జయజయ ధ్వనులతో
గ్రామాలు గ్రామాలు కదలివచ్చు!
కొంగుబట్టిన చాలు కోటానుకోట్ల హ
స్తములు బంగారు వర్షములు గురియు!
పెదవి యొకింత విప్పినచాలు లక్షల
కొలది తలల్‌ వచ్చి కొలువుతీర్చు!
నవ్వినంజాలు పతిత మానవ సమాజ
మానసమ్ములు దేదీప్యమానములగు!
పట్టుపట్టిన చాలు సమ్రాట్టులైన
తలలు వంతురు మా గాంధితాత ముందు!!!
 
కరుణశ్రీ
 
బలశాలి గాంధీ
కత్తులులేవు, శూలమును, గాండివమున్‌ మొదలే హుళక్కి, నో
రెత్తి ప్రచండ వాక్పటిమనేనియు జాటడు, వైరి మీద దం
డెత్తగ సేనలేదు. బలహీనము కాయము, కోపతాపముల్‌
బొత్తిగసున్న, యట్టి వరమూర్తి, మహాబలశాలి గాంధి ఁజే
యెత్తి నమస్కరించి, స్మరియించుదమెప్డు స్వరాజ్య సిద్ధికై
 
దామరాజు పుండరీకాక్షుడు
 
బాపూజీ
భరతవర్షంబీను వజ్రాల ధనరాశి 
తూకంబునకు పెచ్చుదూగువాడు
మూడుమూర్తుల దయాభూతి ప్రత్యంగాన
తాండవించెడు పవిత్రస్వరూపి
పదివేలయేండ్ల లోపల ధరాదేవత,
కనియెఱుంగని జగన్మునివరుండు
అనుగు దమ్ములు కోరుకొను స్వరాజ్యార్థమై
పస్తుండి శుష్కించు పండుముసలి
గోచిపాత గట్టుకొని జాతి మానంబు
నిలిపినట్టి ఖదరు నేతగాడు
విశ్వసామరస్య విజ్ఞాన సంధాత
కామిత ప్రదాత, గాంధితాత!
విమత భూపతుల దోపిడి గుందు జాతిలో
దీపంబు బెట్టిన దినకరుండు
మానవత్వమును భూమండలంబున నెల్ల
చాటిన యాచార్య చక్రవర్తి
సత్యాగ్రహంబను శస్త్రచాలన విద్య
భువికి దెచ్చిన మహాపురుషమౌళి
నిమ్న జాతుల కంటి నీరంబు దుడిచి యా
శ్వాసించు నిఱు పేద బాంధవుండు
పండ్లు నూరుచున్న బహుమతంబులలోన
సహనవిద్య నేర్పు సాధకుండు
భార్య బిడ్డ లున్న ప్రత్యక్ష దైవంబు
కామిత ప్రదాత, గాంధి తాత
       ... ... ... 
తిండి లేక భారత సతీసుతు లెల్లరు దక్షిణాఫ్రికా
ఖండముజేరి సీమ సరకారుల వేడికటాక్ష వీక్షణో
ద్దండ నిదాఘ తప్తులయి దాస్యము సేసెడువేళ నండగా
నుండి యెదిర్చె శ్వేత పదనోగ్ర పిశాచుల వర్ణదౌష్ట్యమున్‌.
అతిథికి పరిచర్య లాచరించుటగాక
పాయఖానా శుభ్రపరచినాడు
నిష్కారణముగ తన్నిన తెల్లదొర గుండె
నలిగిపో జిరునవ్వు నవ్వినాడు
అంతరాత్మకు భిన్నమైన పాపపు లేశ
మేని ప్రాణాల బోనీయలేదు
తగవు దప్పినవాడు భగవంతుడేకాని
యురమిచ్చి యెదిరించ కుండలేదు
తెలుపు నలుపు వన్నె కులబేధ పరమైన
సీమ పెద్దపులికి చెలిమి గరిపి
భరత సుప్రతిష్ఠ బహుదేశములమీద
చల్లినాడు మాట చెల్లితీర.
సత్యాగ్రహ స్వర్ణశంఖంబు పూరించి
స్వాతంత్య్ర సమర బీజములు నాటి
సీమబట్టలు ధరించెడు పుట్టుభోగికి
చేనేతి మగ్గాలు చేతికిచ్చి
దొరల చేజిక్కిన భరత సామ్రాజ్యంబు
నుపవాసములచేత నూచి యూచి
స్వీయదేశీయ సిపాయి ఖైదీయౌట
గౌరవంబను సుద్దు గట్టిజేసి
పొదలు మంచుకొండ మొదలు సేతువుదాక
భారతంబు వెంట బరుగులెత్త
జడుపుగిడుపు లేని శాంతిపటాలంబు
సిద్ధపరచె ధర్మ బద్ధుడగుచు
ముద్ద తరుగయ్యె పాపము
ఖద్దరుచే సీమ నేతగాండ్రకు, గుండెల్‌
దద్దరిలె రాచవారికి
ఖద్దరు ముని మ్రింగరాని కబళంబనుచున్‌
ముసలమ్మ మొదలుగా పసిపాప వరకు ఖ
ద్దరుబట్ట నెమ్మేన దాల్చినారు
పాలకుడాదిగా బంట్రౌతువరకు గాం
ధీటోపి ధరియించి తిరిగినారు
ధనికుండు కోలె, ముద్దకులేని పేదయు
కడగి సన్నని నూలు వడికినారు
ఆస్తికుండును వీరనాస్తి కుండును గూడ
బాపూజి కంజలి బట్టినారు
గాంధి నామకంబు గాంధి సందేశంబు
మారుమూలలందు మారుమ్రోగె
ఖండపంచకమును గౌగిలించినవాని
సీమశక్తు లేమి సేయగలవు?
 
జాషువా
 
గాంధీజీ
మరచిపోయిన సామ్రాజ్యాలకు
చిరిగిపోయిన జెండా చిహ్నం
మాయమైన మహాసముద్రాలను
మరుభూమిలోని అడుగుజాడ స్మరిస్తుంది
శిథిలమైన నగరాన్ని సూచిస్తుంది
శిలా శాసనం మౌనంగా
ఇంద్రధనుస్సు పీల్చే ఇవాళ్టి మన నేత్రం
సాంద్ర తమస్సు చీల్చే రేపటి మిణుగురు పురుగు
కర్పూర ధూమ దూపం లాంటి
కాలం కాలుతూనే వుంటుంది
ఎక్కడో ఎవ్వడో పాడిన పాట
ఎప్పుడో ఎందుకో నవ్వే పాప
బాంబుల వర్షాలు వెలిసిపోయాక
బాకుల నాట్యాలు అలిసిపోయాక
గడ్డిపువ్వులు హేళనగా నవ్వుతాయి.
గాలి జాలిగా నిశ్వసిస్తుంది
ఖడ్గాన్ని రద్దు చేస్తుంది ఖడ్గం
సైన్యాన్ని తినేస్తుంది సైన్యం
పొలంలో హలంతో రైతు
నిలుస్తా డివాళా రేపూ
ప్రపంచాన్ని పీడించిన పాడుకలని
ప్రభాత నీరజాతంలో వెదకకు
ఉత్పాతం వెనుకంజ వేసింది
ఉత్సాహం ఉత్సవం నేడు.
అవనీమాత పూర్ణగర్భంలా
ఆసియా ఖండం ఉప్పొంగింది
నవప్రపంచ యోనిద్వారం
భారతం మేలుకుంటోంది
నేస్తం మన దుఃఖాలకి 
      వాయిదా వేద్దాం
అసౌకర్యాలు మూటకట్టి 
      అవతల పారేద్దాం
ఇంకోమాటు వాగ్వాదం 
      ఇంకోనాడు కొట్లాట
ఇవాళ మాత్రం ఆహ్లాదం 
      ఇవాళ తురుఫాసు
 
శ్రీశ్రీ
 
మహాత్మా
పాల సముద్రమే నడచి వచ్చిన రీతి, హిమాచలాగ్ర శృం
గాలు, కరాలుసాచి మనకై యరుదెంచిన భాతి, శాంతి స
త్యాలు మనుష్యరూపమును దాలిచి నేలకు డిగ్గినట్లు, గాం
ధీ లలితాత్ముఁ డుజ్జ్వల మతిన్‌ భరతావనిపైన కాలిడెన్‌.
కత్తి లేక దురాత్ము కుత్తుకల్‌ నరికెడి
నీ నేర్పు లే వీరునికి లభించు?
ఉపవాస వహ్నిచే యపకారి గుండెల
బూది చేయుట లన్య పురుషు తరమె?
తీయని యొక మాటచే, యావ దవనిని
చేపట్టు టెవ్వని చేతనగును?
గుడిసెలో కూర్చుండి గుడిలోని దేవుని
మహిమల మించుటే మనిషి వశము.
దుర్బలుడవయ్యు నెంతటి దోర్బలమ్ము
పేదవై కూడ నెంతటి పెద్దతనము
ముదుసలివె యయ్యు నెంతటి కదన పటిమ
తాతవయ్యును మా కెల్ల నేతవోయి.
బుద్ధుడవో! సకల తప
స్సిద్ధుడవో! శంకరుడవొ! శ్రీవిష్ణువవో!
వృద్ధుడవో! యువకుడవో!
సిద్ధాంతింపగ నీకెచెల్లు, మహాత్మా! 
దాశరథి