‘‘కుక్కలకు పందులంటే అలుసు, ఆహారం. మాదిగలకు కుక్కలంటే అలుసు, తరుముతారు. ఊరి దొరలకు మాదిగలంటే చులకన, తిడతారు, కొడతారు. దేవుడికి ఊరి దొరలంటే చిన్న చూపు. తొందరగా స్వర్గానికో నరకానికో తీసుకుపోతాడు’’ అని తనదైన తాత్వికపోలికను నవలా ఇతివృత్తానికి అనుకూలంగా ముందే చెప్పేస్తారు ఇనాక్‌. ఊరికి, మాదిగపల్లెకు మధ్య జరిగే గొడవే ‘రంధి’. కుల వ్యవస్థలోని అధికారానికి, అణచివేతకు మధ్య జరిగే పోరే ‘రంధి’. విశ్లేషించే కొద్దీ, ఆలోచనలకు పదును పెట్టే కొద్దీ భిన్నత్వాలు, వైరుధ్యాలు, సంక్లిష్ట సంలీనతలల్లోని పరిణామగతులతో ఎన్ని కోణాల్లోంచి అయినా ఈ నవలకు భాష్యాలు చెప్పుకోవచ్చు.

 
గ్రామాలు బ్రాహ్మణీయ ఆధిపత్యం నుంచి భూస్వా ముల అధికారంలోకి వస్తున్న కాలంలో మాదిగ పల్లెలపై జరిగిన దౌర్జన్యాలు, దోపిడీలు, అకృత్యాలకు అక్షరరూపం ఇచ్చిన రచనలు తెలుగులో తక్కువే. గ్రామాల్లో మాదిగలు, భూస్వాములుగా ఎదిగిన శూద్రుల మధ్య ఉండే ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వైరుధ్యాన్ని, హిపోక్రసీని, వికృ తాన్ని, మాదిగ సంఘటిత శక్తిని, స్త్రీఅస్తిత్వ చైతన్యాన్ని కూలం కషంగా చర్చకు పెట్టిన నవల కొలకలూరి ఇనాక్‌ ‘రంధి’. 
 
సాహిత్య ప్రక్రియలన్నింటిలో తనదైన రచనా మార్గాన్ని అనుసరించిన కొలకలూరి ఇనాక్‌ ‘రంధి’ నవలా ఇతివృత్తాన్ని గుంటూరుజిల్లా, వేజెండ్ల గ్రామ నేపథ్యంలోంచి ఎన్నుకున్నారు. నవల ప్రారంభంలోనే మాదిగపల్లె, ఊరి మధ్య ఉన్న తాటి తోపు, అక్కడ తిరిగే పందులు, వాటి ఆహారం గురించి ‘‘అప్పుడెప్పుడో పురాణకాలంలో శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో భూమిని కాపాడాడు అనుకోవటం కంటే, వినుకో వటం, ప్రత్యక్షంగా కనుగోవటం ఇవాళ వాస్తమయింది’’ అంటారు. కుక్కలకు, పందులకు ఉన్న సంబంధాన్ని ఊరికి, మాదిగపల్లె కున్న సంబంధంలాంటిదని చెప్తూ ‘‘కుక్కలకు పందులంటే అలుసు, ఆహారం. మాదిగలకు కుక్కలంటే అలుసు, తరుము తారు. ఊరి దొరలకు మాదిగలంటే చులకన, తిడతారు, కొడతారు. దేవుడికి ఊరి దొరలంటే చిన్న చూపు. తొందరగా స్వర్గానికో నరకానికో తీసుకుపోతాడు’’ అని తనదైన తాత్విక పోలికను నవలా ఇతివృత్తానికి అనుకూలంగా ముందే చెప్పే స్తారు ఇనాక్‌. నవలలో మొదటే వేజెండ్ల గ్రామ భౌగోళిక, సాంఘిక, సాంస్కృతిక ఛాయాచిత్రాన్ని గీస్తారు. రైలు పట్టాలు, రైలు ప్రయాణంతో ముడిపడిన గ్రామ ప్రజల జీవనవిధానం వర్ణించి పాఠకుడిని కథాలోకంలోకి వేలుపట్టి లాక్కెళ్తారు. 
 
సువ్వి, రాముడు రైల్లో గుంటూరు వెళ్లి చదువుకుంటూ ఉంటారు. సువ్విది టీచర్‌ కావాలనే కోరిక. ఆమె సౌందర్యాన్ని ఇష్టపడ్డ రాముడు, కుల అహంకారంతో లొంగదీసుకోవాలను కుంటాడు. సువ్వితో, ఆమె స్నేహితుడు చందిరితో అవమానిం చబడతాడు. సువ్విని చెరుస్తానని శపథం చేస్తాడు. సువ్వి తల్లి, తండ్రి భయపడి స్కూలు మాన్పించి చందిరితో పెళ్లి చేయాలనుకుంటారు. సువ్వి పొద్దున్నే చెంబుపట్టుకొని బహి ర్భూమికి వెళ్లినప్పుడు రాముడు మానభంగం చేస్తాడు. సువ్వి తన శీలం పోలేదని చెప్తుంది. తల్లి, అవ్వ కూడా పరీక్షచేసి సువ్వి కన్యగానే ఉందని చెప్తారు. పల్లెవాళ్లు, ఊరివాళ్లు నమ్మరు. మాదిగపల్లె పెద్దలు రాముడు సువ్విని చెరిచాడు కాబట్టి ఊరికరణం, మున్సబు, ప్రెసిడెంట్‌తో కొంత రొక్కం సువ్వికి కట్టాలని తీర్పు చెప్పి స్తారు. కానీ సువ్వి ఆ డబ్బు తీసుకోదు. ఇచ్చే టప్పుడు సువ్వి చేతులు వెనక్కు లాక్కోవ డంతో డబ్బు రాముడి ముఖాన పడతుంది. దాంతో సువ్విని చంపుతానని శపథం చేస్తాడు రాముడు. చందిరి, సువ్వి తండ్రి కోటి, గ్రామ పెద్దలు అంతా కలిసి రాముడి తండ్రి నాంచరయ్యకు ఎంత చెప్పినా అతను ఒప్పుకోడు. కొడుకుకే సపోర్ట్‌ చేస్తాడు.
 
చందిరి మూగవాడైనా బలవంతుడు. అతడికి ఆ ఊరి చెట్టుకింద ఉండే బైరాగితో మానసికమైన స్నేహం ఉంటుంది. అతడు సూచించినట్లు రాముడిని బంధించి, బట్టలు విప్పి, నూనెరాసి, అతడికి మగతనం లేదన్న నిజాన్ని తెలుసుకుం టాడు. దాంతో భయపడ్డ రాముడు సువ్విని మానభంగం చేయలేదని, తనకాశక్తిలేదని ఒప్పుకుంటాడు. ఆ అవమానాన్ని భరించలేక రైలుకిందపడి చనిపోతాడు. దాంతో నాంచరయ్య తన తప్పు తెలుసుకుంటాడు. మాదిగవాళ్లను ప్రత్యేకంగా ఆహ్వానించి ఇంట్లో భోజనాలు పెడతాడు. మాదిగపల్లెకు వెళ్లి తన కొడుకు రాముడు సువ్విని మనస్ఫూర్తిగా ప్రేమించాడు, కులం అడ్డురాకుంటే నా కొడుకే సువ్విని పెళ్లి చేసుకునే వాడు, అందుకే సువ్వి నా కోడలు, చందిరి నా కొడుకని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అప్పటివరకు ఆగిన వాళ్ల శోభనాన్ని జరిపి స్తాడు. చివరకు చందిరితోడు లేకుండానే సువ్వి ధైర్యంగా రైలెక్కి గుంటూరులో చదువుకోవడానికి, టీచర్‌ అవ్వాలన్న తన కోరికను నెరవేర్చుకోవడానికి వెళ్తుంది. క్లుప్తంగా నవలా ఇతివృత్తం ఇదే అయినా, ఇనాక్‌ ఎన్నో విషయాలను జోడించారు. కథాకథన శిల్పంతో నవలను ఉత్తేజంగా, ఉత్కంఠతో నడిపారు.
 
‘రంధి’లో భావికథార్థ సూచనగా వస్తుధ్వనిని వాడారు ఇనాక్‌. నవల మొదట పందులు రైలు కిందపడి చనిపోవడాన్ని చెప్పి, దానిని పంతం నెగ్గించుకోలేక, చందిరితో అవమానానికి గురై రైలు కిందపడి రాముడు చనిపోయిన సంఘటనను సూచించారు. ఆ గ్రామ ప్రజల జీవితాన్నే కాకుండా, భౌతిక ప్రాపంచిక జీవనానికీ రైలు ప్రయాణానికీ ఉన్న తాత్విక లింకును నవల ప్రారంభంలో విడమర్చి ‘‘మనిషి శక్తికి తిరుగే లేదని, సంపన్నుడో, అభిజాత్య సముత్పన్నుడో అనుకుంటే ఎక్కడయినా చెల్లుతుంది కాని, రైలుకట్టకాడ చెల్లదని మనిషికి పరిమితిని నిర్దేశించింది. రైలుకింద పడితే దొరయినా సస్తాడు. మాదిగయినా మరణిస్తాడు. అనే ఒక అద్భుత వేదాంత జీవన సత్యసూత్రం రైలుకట్ట నోరెత్తకుండా బోధించినట్లయింది.’’ అంటారు రచయిత. దీనికి లింక్‌ గానే రైల్లో మాదిగ సువ్వికి, భూస్వామి నాంచారయ్య కొడుకు రాముడికి మధ్య గొడవ మొదలవు తుంది. దాని వెనుక రాముడి కుల అహంకారం, ఆర్థికస్థాయి, వారసత్వ అభిజాత్యం ఉంటాయి. చివరకు రైలే వేదాంతిలా రాముడి మరణానికి తీర్పు చెప్పి మరణ శిక్ష వేస్తుంది.
 
రచయిత సందర్భానుసారంగా వర్ణనలు, విశ్లేషణలు, పోలిక లలో పురాణ పాత్రలు, సన్నివేశాలను చొప్పించారు. రాముడు.. నాంచరయ్యకు చందిరి గురించి చెప్తూ ‘‘ఆడు మంచోడే! ఏమీ కలుగజేసుకోడు! కానీ సువ్విని యావన్నా అన్నామా ఇక జూసుకో, ఆడు హిరణ్ణకసిపుడవుతాడు’’ అంటారు. పురాణాల్లో దుష్టపాత్రగా చెప్పిన హిరణ్యకసిపుడిని సువ్విని రక్షించిన చందిరితో పోల్చి ద్రవిడ సంస్కృతి ప్రకారం హిరణ్యకసిపుడిని నాయకుడిగా చూడాలన్న విషయాన్ని అన్యాపదేశంగా చెప్పారు ఇనాక్‌. రైలు పట్టాల మధ్య రాముడు చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ‘‘రైలింజను పట్టాల మధ్య మనిషిని చూచింది. రావణదాడిగా కూతలేసింది’’ అని రాశారు. రాముడు తప్పు చేసి, అవమానంతో చనిపోతున్నప్పుడు అతడి ప్రాణాలు తీసే రైలును రావణదాడితో పోల్చడంలో ఇనాక్‌ అంతరంగం, పౌరాణికాంశాలను చూసే దృక్కోణం బోధపడుతుంది. చందిరి.. కర్ణుడి తల్లి కుంతిని పెళ్లి చేసుకున్న వాడికన్నా గొప్పోడని మాదిగ తాతతో పలికించారు. కుంతి పెళ్లికాక ముందే తల్లైన విషయం పాండురాజుకు తెలియదు. కానీ నవలలో సువ్విని రాముడు మానభంగం చేశాడని తెలిసి కూడా చందిరి పెళ్లి చేసుకుంటున్నాడని, అందుకే పాండురాజు కన్నా గొప్పోడని తేల్చారు రచయిత.
 
ఇనాక్‌ ‘రంధి’ నవలలో మాదిగ స్త్రీ పట్టుదల, అస్తిత్వ చైతన్యం, లక్ష్యసాధన, సంకల్పబలాన్ని సూటిగా, స్పష్టంగా మానసిక చలన సూత్రాలతో చెప్పారు. మాదిగ పల్లెలో పుట్టినా టీచర్‌ కావాలన్న లక్ష్యంతో రైల్లో గుంటూరుకు వెళ్లి చదువు కుంటుంది సువ్వి. రాముడు ‘‘నల్లతుమ్మ మొద్దువు. నాకు కనపడకు నేను ఎక్కిన పెట్టెలో ఎక్కకు’’ అన్నప్పుడు ఏడుస్తుంది. మరో పెట్టెలో ఎక్కుతుంది. కానీ రాముడు తనపై చెయ్యి వేసినప్పుడు ప్రతిఘటించి రక్తం కారేలా ముక్కు మీద గుద్దుతుంది. చందిరిని పెళ్లిచేసుకుంటానని తనే స్వయంగా చెప్పి, పెళ్లి విషయంలో స్వేచ్ఛ తీసుకుం టుంది. స్నేహితుడు, తన మనసు అర్థం చేసుకున్నవాడు, రాముడి నుంచి కాపాడే శక్తికలవాడు.. ఇలా అన్ని విధాలా ఆలో చించగల మేధావితనం నుంచే భర్తను ఎంచుకుంది సువ్వి. శోభనం, పిల్లలు కనడంలో చందిరితో కలిసి తన అభీష్టానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుంది. పెద్దమనుషులు తన శీలానికి లెక్కకడితే, ఆ తీర్పును లెక్కచేయకుండా తన ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకుంటుంది. అత్యాధునిక స్త్రీ ఆలో చనా దృక్పథానికి ఏమాత్రం తీసిపోని క్యారెక్టర్‌ సువ్వి. 
 
రచన మధ్యలో రచయిత ప్రవేశించొచ్చా, ప్రవేశించకూడదా అనే వాదనను పక్కనపెడితే ఇనాక్‌ చాలా చోట్ల స్వేచ్ఛ తీసుకుని పాత్రల దృష్ట్యానే కాకుండా, సందర్భ, సన్నివేశాలను బట్టి అనేక విషయాలు చర్చకు పెట్టారు. పాత్రల మనసుల్లో ప్రవేశించి, వాటి అంతర్గత స్వభావాలను, ఆలోచనలను విశ్లే షించారు. అవి నవలావస్తువును మరింత విస్తృతంగా, పరిధికి మించకుండా తా త్విక, చారిత్రక, రాజకీయ నేపథ్యా లను అనావృతం చేశాయి. సువ్విని రాముడు మాన భంగం చేశాడని తెలిసి, పోలీసులు వచ్చినప్పుడు ‘‘గాంధీ చెడు అనకు, వినకు, కనకు అన్నాడు. కానీ అన్నంత మాత్రాన చెడు లేకుండా పోతుందా? పోదు! కానీ అనిపించదు, వినిపించదు. కనిపించదు. మాట్లాడకపోతే, రాయకపోతే, చదవకపోతే భాష అంతరిస్తుందని, అట్లా చాలా భాషలు అంతరించాయని నాగరికలోకానికి తెలిసిన సత్యమే కదా! చెడయినా అంతే!... ఒక సత్యం ప్రచారం కాకపోతే ఆలస్యమవుతుంది. ఒక అసత్యం సత్యంగా ప్రచారం చేస్తే, అద్భుత సత్యమయి అవతరిస్తుంది. అది దైవం అవుతుంది’’ అని రాస్తారు. ఇలాంటి వివరణలు, విశ్లేషణలు నవలలో విస్తృతంగా కనిపిస్తాయి. 
 
నవలలో ప్రధానమైన సంఘటనలు రెండు. ఇవే నవలను మలుపు తిప్పుతాయి. వాటికి అనుషంగికమైన సన్నివేశాలు, సంఘటనలు ఎన్ని ఉన్నా. ఒకటి- రాముడు సువ్విని మాన భంగం చేయడం. రెండు- రాముడికి మానభంగం చేసే సామర్థ్యం లేదని తెలియడం. నవల రైలు వర్ణనతో ప్రారంభం అయినా, పెళ్లిలో సువ్వి కనిపించకుండా పోవడంతో పాఠకుల్లో ఉత్సుకత, ఉత్కంఠ రేకెత్తుతుంది. తీరా సువ్వి ‘‘తలరేగి, బుగ్గలు కమిలి, బట్టలూడి, వళ్ళంతా గాయాలై, కాళ్లూ చేతులు పుళ్ళై నేలమీద బురదలో, రొచ్చులో పడి పందులు కాపా డుతూ’’ కనిపిస్తుంది. మానభంగం జరిగిందని అంతా అను కుంటారు. ఇక రెండో సంఘటన దానిని నివృత్తి చేసేది. మానభంగం చేయలేదని రాముడితో చందిరి చెప్పించే సంఘటన. ‘‘నేను సువ్విని చెరచలేదు. చెరిచే శక్తి నాకు లేదు. గిల్లాను, గిచ్చాను, రక్కాను, కొరికాను, కొట్టాను, కానీ మానభంగం చేయలేదు’’ అని నిజం చెప్తాడు. ఈ విషయాన్నే రచయిత నర్మగర్భితంగా రాముడు చిన్నతనంలో అమ్మాయిగా పెరుగుతున్న విధానాన్ని వర్ణించి క్లూ ఇస్తాడు. నవలలో ప్రతి సన్నివేశం, ప్రతి వర్ణన తర్వాత చెప్పే కథకు ఏదో ఒక విధంగా లింక్‌ ఉండాలన్న నిర్మాణపద్ధతికి ఉదాహరణ ఈ భావికథార్థ సూచన. 
 
రాముడికి సువ్వి మీద ఉన్న ప్రేమ, ఇష్టం.. కులం, ఆస్తి, అధికారంవల్ల కోపం, పగ, అణచివేతలుగా మారిందంటారు ఇనాక్‌. ‘‘అసలు తన ప్రేమ తన కోపం కావచ్చ’’ని రాముడే ఆలోచి స్తాడు. రాముడు తనలోని నపుంసకత గురించి చెప్పుకోలేక పోవడానికి కారణం అతడి భూస్వామ్య అధికారం, పురుష అహంకారం, ఆస్తి, కులం. ఇదే నవలా వస్తువు నడకకు కారణమైన అతిసున్నితాంశం, సూక్ష్మాశం. దీనిని ఎక్కడా వస్తుగతం చేయకపోవడమే ఇనాక్‌ రచనా శిల్ప రహస్యం. ఈ రహస్యమే రాముడి పాత్రను మనోవిశ్లేషణాత్మక దృష్టితో పరిశోధిం చాల్సిన అవసరాన్ని మన ముందుంచుతుంది.
 
చరిత్ర దాచేస్తే దాగదు. కులపురాణాల్లో కాల్పనికతతో ఆపాదించుకున్న ఛాయలే కాదు, విలువైన చారిత్రక సత్యాలూ దాగి ఉన్నాయి. వక్రీకరణకు చిక్కని నిజాలుండొచ్చు. మాదిగల జాంబపురాణాన్ని, దశవతారాలలో వరహా వతారాన్ని కలిపి ఇనాక్‌ కొన్ని ప్రతిపాదనలు చేశారు. ‘‘విశాల అఖండ జలరాశిలో తేలు తున్న భూమిని మునిగిపోకుండా ముట్టితో ఎత్తిపట్టిన అతిప్రాచీన వరాహమూర్తి. ... ఫలవృక్షం భూభాగ యజమాని జాంబవం తుడు. రాలిపడ్డ పళ్లన్నీ ‘నువ్వు, నీ సంతతి తినవచ్చునని’ వరమిచ్చాడు... ఆది జాంబ వంతుడి సంతానానికి, అనంతరం వచ్చి స్థిరపడ్డ జానానికి ఆత్మీయబంధం ఏర్పడింది. ....వాయువ్యం నుంచి వచ్చిన వాళ్లందరూ వీళ్ళ సంపదకోసం వచ్చారు. చరిత్ర పొడుగునా దండయాత్రలు చేసిన అన్ని జాతుల వాళ్ళు, దోపిడీదారులే! ఆకలయిన వాళ్లకు జిత్తులు పెరిగాయి. ప్రాచీనుల్ని బానిసల్ని చేశారు’’ అని రచయిత ఇచ్చిన చారిత్రక ఆలోచల్లోంచే గుంటూరు జిల్లా వేజెండ్ల మాదిగ పల్లెను అర్థం చేసుకోవడానికి దారులు పడతాయి. ఇప్పటివరకు మిణుకు మిణుకుమంటున్న సరికొత్త చారిత్రక, పౌరాణిక ఆలోచనలకు మార్గాన్ని చూపిస్తాయి. నవల ప్రారంభం, ముగింపుల శిల్ప రహస్యాన్ని చారిత్రక కోణంలో దర్శించమంటాయి. 
 
గుంటూరు మాండలికం నవలకు అలంకారం. మాదిగ కుల మాండలికం మరో భూషణం. ‘‘తుస్కారం’’, ‘‘ఉసిగొల్పు తాడు’’, ‘‘దెంగుదెంగులు’’, ‘‘దొబ్బుడాయి’’, ‘‘ఒకరు ఎడ్డెం అంటే మరొకరు తెడ్డెం’’, ‘‘కపెరకపెర తెల్లవారెటప్పుడు’’, ‘‘నైపోగు’’, ‘‘ఇక్కిలీసాయిలు’’, ‘‘గుబ్బట్లాడుకుంటూ’’... వంటివి మరుగున పడుతున్న మన పదజాలాన్ని నిక్షిప్తం చేయాల్సిన అవసరాన్ని గుర్తుకు తెస్తాయి. ఊరికి, మాదిగపల్లెకు మధ్య జరిగే గొడవే ‘రంధి’. కుల వ్యవస్థలోని అధికారానికి, అణచివేతకు మధ్య జరిగే పోరే ‘రంధి’. విశ్లేషించే కొద్దీ, ఆలోచనలకు పదును పెట్టే కొద్దీ భిన్నత్వాలు, వైరుధ్యాలు, సంక్లిష్ట సంలీనతలల్లోని పరిణామగతులతో ఎన్ని కోణాల్లోంచి అయినా ఈ నవలకు భాష్యాలు చెప్పుకోవచ్చు. 
 
ఎ. రవీంద్రబాబు 
80086 36981