ప్రముఖ రచయిత, పాత్రికేయుడు, పరిశోధకుడు గోపరాజు నారాయణరావు రాసిన  చారిత్రక నవల ‘ఆకుపచ్చ సూర్యోదయం’. ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక ఆదివారం అనుబంధం ‘ఫన్‌ డే’ లో ముప్ఫైవారాలు ధారావాహికగా పాఠకుల్ని అలరించింది. రుషి తుల్యుడు, యోగి, ఆధ్యాత్మికవేత్తగా ప్రజల్లో పేరొందిన అల్లూరి సీతారామరాజు చరిత్రే ఈ పుస్తకం. కె.రామచంద్రమూర్తిగారు చెప్పినట్టు, చరిత్రను శ్రద్ధాసక్తులతో పరిశోధించి సృజనాత్మకంగా రాసిన ప్రామాణిక గ్రంథమిది. మనకు తెలియని విషయాలెన్నో ఇందులో ఉన్నాయి. అల్లూరి బాల్యంనాటి ఫొటోసహా ఆయన కుటుంబీకుల చిత్రాలు, చారిత్రక చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌ స్థలంలో గుర్తుగా మిగిలిన స్తూపాలు, రామరాజు సమాధి, ఆయన స్వదస్తూరి లేఖ ఇందులో మనం చూడవచ్చు. 95 ఏళ్ళనాటి ఈ కథలో సీతారామరాజు అంతిమ ఘట్టాలను, ఆయన ఆలోచనలను కళ్ళకు కట్టినట్టు వర్ణించారు. మంప ఊరు శివార్లలో జొన్నచేలల్లో మంచెపై సీతారామరాజు చివరిరాత్రి బస, అతడిపై నిఘావేసి నులకమంచానికి కట్టి మోసుకుంటూ కొయ్యూరు తీసుకెళ్ళి చింతచెట్టుకు కట్టి, తలకు ముసుగుతొడిగి(1924 మే 7వతేదీ) కాల్చేయడం, పారిపోయే ప్రయత్నం చేసిన రామరాజును చంపాల్సివచ్చిందని గూడాల్‌ చెప్పిన కట్టుకథ విని రూదర్‌ఫర్డ్‌ ఆగ్రహించడం, అవమానపడటం...ఇలా తెలుగువారి సినిమా నాలెడ్జికి భిన్నంగా ఉంటుందీ పుస్తకం. అద్భుతమైన కథనంలో చకచకా చదివిస్తారు రచయిత. ఈ పుస్తకం చదవగానే మనలో కొత్త శక్తి పుడుతుంది. ఎదో తెలియని ఉద్వేగం, కర్తవ్య స్ఫూర్తి మనల్ని ఆవహిస్తాయి.

 

మన్యం వీరుడు అల్లూరి గాథ
డా. గోపరాజు నారాయణరావు
ధర 300 రూపాయలు
పేజీలు 296
ప్రతులకు రచయిత, జనప్రియ ఉటోపియా, 3వ బ్లాక్‌, ఫోర్త్‌ ఫ్లోర్‌, ఫ్లాట్‌ 34006, అత్తాపూర్‌, హైదరాబాద్‌. సెల్‌ 9849325634