వీనుల విందు చేసే ‘రాగమాలిక’
సంగీత క్షీరజలాల్ని వేరుచేసే జగమెరిగిన మరాళి వి.ఎ.కె. రంగారావు. ఆయన అప్పుడెప్పుడో ఆంధ్రప్రభ, విజయచిత్రల్లో రాసిన పాతిక రసాత్మక వ్యాస గుళికలను పేర్చి రాగమాలికగా ఇప్పుడు మన మెడ నలంకరించారు. ఇందులోని వసంత/హాస్య గీతాలు, గంధర్వగోత్రాన పుట్టిన తెర వేలుపులు, వినవేడుక, లబ్ధ ప్రతిష్టులైన గాయకులు.. పరిచయాలన్నీ ఆసక్తిదాయకం, అపురూపం. వారి సంగీత ప్రజ్ఞాపాటవం కొత్తగా చెప్పనేల! కాని, ఆయన్ని అతి దగ్గరగా పరిశీలించి వినిపించిన రావి కొండలరావు ‘చిన్నమాట’ మాత్రం శ్రద్ధగా ఆలకించండి! వి.ఎ.కె.లో సంగీత ప్రియత్వంతో పాటు పిల్లచేష్టలు ఏ స్థాయిలో ఉండేవో తనదైన శైలిలో పన్నీరులా చిలకరించి పులకరింపచేశారు. అందుకే కాబోలు పిల్లలెప్పుడూ నిత్య నూత్నంగా భాసిల్లుతారు. మరో ముందుమాటలో వి.ఎ.కె. తన గురించి తానే ఇంటర్వ్యూ చేసుకుని తనలోపలి వి.ఎ.కెని సరికొత్తగా ఆవిష్కరించుకున్నారు. వ్యాసాల్లో అక్కడక్కడా - ‘గ్రామసింహం గ్రామఫోనులు’, ‘పెగ్గు జిన్నులో చెంచాడు నిమ్మరసం’ వంటి పద విన్యాసాలతో కవ్వించి కైపెక్కించారు. ఇంత అందమైన చందమామకు మచ్చ లేకపోతే ఎలా అని కాబోలు, ఒక దగ్గర ఎన్‌.టి.ఆర్‌, జమునల స్టిల్‌ వేసి ఇది ‘భూకైలాస్‌’ కాదు, ‘గులేబకావళి కథ’ అని దిష్టిచుక్క దిద్దారు. అన్నట్టు అట్టమీద గిరిధర్‌ గౌడ్‌ ఒలికించిన వి.ఎ.కె. వర్ణ రూపం కడు రమ్యం, బహుసుందరం. 
- గొరుసు
 
రాగమాలిక (సంగీత వ్యాసావళి)
రచన: వి.ఎ.కె.రంగారావు, 
పేజీలు: 209, వెల: రూ. 300
ప్రతులకు: ప్రగతి ఆఫ్‌సెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 
                   040 - 2338 0000