హృదయనాదాలు 

ప్రక్రియ కోసం కవిత్వం కాదు. కవిత్వం కోసమే ప్రక్రియ అని నమ్మి, కాలం కార్చిన కన్నీటి అలల మీద సమాజ ప్రతిబింబాన్ని తళుక్కుమనిపించిన కవితా సంపుటం ఎలనాగ ‘అంతర్నాదం’.. ఆయన ప్రతి వాక్యంలో మానవతా నినాదమే నాదమై, వేదమై, రాగమై ధ్వనిస్తుంది. శాస్త్రీయ సంగీత రాగాల పేర్లతో తన మదిలో ధ్వనించిన సంవేదనను సరాగాల గనిగా ఆయన పలికించిన తీరు ఈ సంకలనానికి ఓ మచ్చుతునక! రచనాకారుడికి కావాల్సిన వాచక శుద్ధిని ప్రస్తావిస్తూ రాసిన రచనా వివేచన మరో ప్రయోగం. ‘ఆర్కెమీ’ రహస్యాన్ని మంత్ర భాషలో జపిస్తూ, అక్షరాన్ని ఆయుధం చేసుకున్న ఎలనాగ పదునైన కలం మెత్తటి గుండెలపై చేసిన కవిత్వ సంతకం.

 

కవితా మార్గంలో తన ప్రయాణాన్ని ప్రవాసాన్ని అక్షరీకరిస్తూ కాలం కత్తుల మీద వాలిన మెత్తని పక్షి రెక్కలా కవిత్వాన్ని కురిపించారు. తన ‘‘అంతరంగ గాంధారం’’ కవితా సంపుటిలో అందమైన నందనవనాల వెనుక రహస్యంగా ఎక్కిరించే స్పందన లేని ఎడారి బహుమతుల రహస్యాన్ని తన సౌమ్యతా శాపంలో వివరించిన తీరు అమోఘం. అంతరిక్షపుటంచులు సృశించే గాఢకాంక్షలా ఈ కవితా సంకలనంలోని ప్రతి కవితా పలకరిస్తుంది. అది చదివి మది పులకరిస్తుంది. వాదాలు- వివాదాలు- నాదాలు- విధానాలు- రాగాలు- సరాగాలు.. సమస్త మానవీయ స్పందనల వెనుక దాగిన ఇష్టకామనలను పట్టుకొని జీవన విధ్వంస చిత్రాన్ని ఎలనాగ ఆవిష్కరించారు.

నిశ్శబ్దంలో కల్లోల దృశ్యానికి ఆయన ఓ కవితలో ఇచ్చిన దృశ్యరూపం అద్భుతం.. తెలుగు కవితా ప్రస్థానంలో చెయి తిరిగిన కవిగా ఎలనాగ అందించిన ఈ రెండు కవితా సంపుటాలు మానవీయ స్పందనా పరిమళానికి ప్రతిరూపాలు.

- రాఘవ
అంతర్నాదం పేజీలు : 73, వెల : రూ. 70
అంతరంగ గాంధారం పేజీలు : 70, వెల : రూ. 70, ప్రతులకు : 88855 63042