వేదాలు, ఉపనిషత్తుల సారం భగవద్గీత. 
ఎందరో మహాత్ములు మనసావాచాకర్మణ భగవద్గీతను విశ్వసించి మహనీయులయ్యారు. మానవజాతికి మార్గదర్శకులయ్యారు. 
మహాత్మాగాంధీ దేహానికి ఊతకర్ర ఆసరాగా నిలిస్తే, భగవద్గీత ఆయన మనసుకు ఆసరాగా నిలిచింది. ‘‘భగవద్గీత నా తల్లిస్థానంలో ఉంటూ నన్ను కాపాడుతుంది’ అన్నారు గాంధీజీ. భగవద్గీత రెండో అధ్యాయంలోని ‘స్థితప్రజ్ఞత్వం’ జీవించే కళను మనకు నేర్పిస్తుందని గాంధీజీ విశ్వసించారు. భగవద్గీతను మించిన గ్రంథం మరొకటి లేదని సర్వేపల్లి రాధాకృష్ణన్‌, తిలక్‌, అరవిందుడు, వివేకానందుడు లాంటివారు చెప్పడం ఒక విశేషమైతే, దివంగత కమ్యూనిస్టు అగ్రనేత చండ్రరాజేశ్వరరావు సైతం, ‘‘మహాభారతజ్ఞానం, గీతాజ్ఞానం మనకు (కమ్యూనిస్టులకు) చాలా అవసరం’’ అనడం మరో విశేషం!
‘గీత’లోని లైఫ్‌ స్కిల్స్‌ను, వ్యక్తిత్వ వికాస అంశాల్ని ఎందరెందరో వ్యాఖ్యానించారుగానీ ఇప్పుడు భగవద్గీత శ్లోకార్థాలను సరికొత్త పంథాలో సచిత్రంగా కళ్ళకుకట్టి ‘భగవద్గీత భావచిత్రసుథ’ గ్రంథాన్ని మనకు అందించారు జంపన శ్రీనివాస సోమరాజుగారు. ఆ శ్లోకాల తాత్పర్యాలు, భావచిత్రరూపకల్పన, వ్యాఖ్యానాలతో అధ్యాయాలవారీగా అందించిన బృహత్తర గ్రంథమిది.
సోమరాజుగారితోపాటు ఆయన సోదరుడు గిరిధర్‌, ప్రముఖ చిత్రకారులు నీలి వేంకట రమణ త్రయం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సంవత్సరాల తరబడి ఒక తపస్సులా ఈ గ్రంథాన్ని తీర్చిదిద్దారు. గీతలోని 700 శ్లోకాల స్వరూప స్వభావాలను, నిగూఢమైన సారాంశాన్ని, విశాల భావార్థాలను ప్రామాణికమైన చిత్రాలుగా మలిచారు వేంకట రమణ. పండిత పామరులకు సైతం సులభగ్రాహ్యమయ్యేలా, జననం మొదలు, మరణం వరకు మన సాంఘిక, సాంసారిక, తాత్త్విక జీవన జ్ఞానాన్ని, కర్మయోగాన్ని ఈ భావచిత్రసుథలో ఆవిష్కరించారు రచయిత.

‘‘బృహదారణ్యకోపనిషత్తు, కఠోపనిషత్తు, కైవల్యోపనిషత్తుసహా, ఆధ్యాత్మ గ్రంథాలనుండి రచయిత పేర్కొన్న ఉదాహరణలు సందర్భోచితంగా శోభిస్తూ, ప్రబోధాత్మకంగా ప్రకాశిస్తున్నాయి’’ అని మేడసాని మోహన్‌ చెప్పిన ‘ముందుమాట’లోని వాక్యం ఒక్కటిచాలు ఈ పుస్తకం గొప్పతనం చెప్పడానికి. చిట్టిపొట్టి చిన్నారులు మొదలు వయోవృద్ధులు వరకు అన్ని వయసులవారితో ఇష్టంగా చదివించే గ్రంథమిది. యువతరానికి ఉత్తేజం కలిగించేలా, సమాజానికి ఉపకరించేలా పుస్తకాన్ని తీర్చిదిద్దారు రచయిత.

 

భగవద్గీత భావచిత్రసుథ
జంపన శ్రీనివాస సోమరాజు
ధర 540 రూపాయలు
పేజీలు 392
ప్రతులకు వి.జి.ఎస్‌. బుక్‌లింక్స్‌ , 5–6–59/3, సెకండ్‌ ఫ్లోర్‌, తమ్మిన కృష్ణ వీధి, సాయిరాం థియేటర్‌ వెనుక, విజయవాడ –01 ఫోన్‌ 0866–2510202