తెలుగు చిత్రపరిశ్రమలో ‘హీరోకృష్ణ’ అని పిలిపించుకునేది సూపర్‌స్టార్‌ కృష్ణ ఒక్కరే! ఎనభైరెండేళ్ల తెలుగు చిత్రపరిశ్రమ ప్రస్థానంలో యాభైఏళ్ల చరిత్రను నమోదుచేసుకున్న నటశేఖరుడు ఆయన. 365 చిత్రాల్లో నటించి ఎన్నో రికార్డులు సృష్టించి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన వ్యక్తి.
 
కృష్ణ నట జీవితం రికార్డులమయం. సంచలనాలు, సాహసోపేత నిర్ణయాలే జీవితంగా ముందుకు సాగిపోయారు. అందుకే డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ హీరో, ఆంధ్రాజేమ్స్‌ బాండ్‌గా తెలుగువారి హృదయాల్లో చిరస్థానం పొందారు. మంచితనానికి తలవంచే మానవత్వం మూర్తీభవించిన వ్యక్తిగా పరిశ్రమలో పేరుపొందారు. అందుకే ఆయన్ను ‘దేవుడులాంటి మనిషి’ అంటారు. అంతటి గొప్ప నటుడి సినీ జీవిత చరిత్రను నభూతో నభవిష్యత్ అన్న చందంగా అక్షరబద్ధం చేశారు ప్రముఖ ఫిలిమ్‌ జర్నలిస్టు యు.వినాయకరావు. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా పర్యటించి శ్రమదమాదులకోర్చి మూడు సంవత్సరాల అవిరళ కృషితో ఈ పుస్తకాన్ని రూపొందించారు వినాయకరావు. భారతదేశంలోనే మొదటిసారిగా టాబ్లాయిడ్‌ సైజులో 562 పేజీలతో దశాబ్దాలక్రితంనాటి అపురూపమైన వేలాది ఫొటోల సమాహారంగా సూపర్‌ స్టార్‌ కృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టు ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దారు.
 
హీరోగా రికార్డుల సృష్టికర్త, సాహసచిత్రాల నిర్మాత, దర్శకుడు, అపార జ్ఞాపకశక్తి, సినిమా నాలెడ్జ్‌, ఏకాగ్రతలున్న బహుముఖీనమైన కృష్ణ వ్యక్తిత్వం, సినీజీవితాన్ని సమగ్ర సమాచారంతో జనరంజకంగా ఆవిష్కరించిన పుస్తకమిది. 
ఎన్టీఆర్‌ స్ఫూర్తితో 19 ఏళ్ళ వయసులో చిత్రరంగ ప్రవేశం చేశారు కృష్ణ. ‘పదండి ముందుకు’ చిత్రంతో సినీరంగజీవితం ఆరం భించి, గూఢచారి 116, మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామ రాజు చిత్రాలతో కొత్తట్రెండ్‌ సృష్టించి పరిశ్రమలో వేళ్లూనుకున్నారు. ఒక్కఏడాది లోనే 12 చిత్రాల్లో నటించి వాటిల్లో 8 హిట్లుకొట్టిన ఘనత ఆయనదే! తొలి సినిమాస్కోప్‌ టెక్నోవిజన్‌ టెక్నాలజీ, 70 ఎంఎం స్టీరియోఫోనిక్‌సౌండ్‌తోపాటు దక్షిణాదిన తొలిసారి ఆర్వో కలర్‌, ఈస్ట్‌మన్‌ కలర్‌ చిత్రా లను ప్రవేశపెట్టింది ఆయనే. స్వీయదర్శకత్వంలో మూడున్నరకోట్లతో ఆయన నిర్మిం చిన సింహాసనం చిత్రం చరిత్ర సృష్టించింది. ఒక హిందీ చిత్రానికి దర్శకత్వం వహించిన తొలి తెలుగు చిత్రకథానాయకుడు ఆయనే! సరికొత్త ఆలోచనలకు ఆయన ప్రతిరూపం.
 
విద్యార్థిగా ఉన్నప్పటినుంచీ ఎన్టీఆరే కృష్ణకు స్ఫూర్తి. ‘స్పర్థయా వర్థతే విద్య’ అన్నచందంగా సినీదిగ్గజం ఎన్టీఆర్‌తో అన్నిటా పోటీపడి ఎదిగారు కృష్ణ. ఆయనతో కలిసి ఎన్నో చిత్రాల్లో నటించడమే కాదు, రాజీవ్‌గాంధీ ఆదేశాలతో ఎన్టీఆర్‌పై రాజకీయ వ్యంగ్యచిత్రం నిర్మించారు.
 
ఎంతోమంది సినీ ప్రముఖులు కృష్ణ గుణగణాలను కీర్తించారు. అవన్నీ వినాయకరావు ఇందులో నిక్షిప్తం చేశారు. నిజానికి కృష్ణ చిత్ర పరిశ్రమకు గొప్ప మార్గదర్శి. ఇంత గొప్ప వ్యక్తి జీవితాన్ని గ్రంథస్థం చేసిన వినాయకరావు బాలీవుడ్‌, మాలీవుడ్‌, కోలీవుడ్‌ సహా ఇతర ఫిలిమ్‌ జర్నలిస్టులకందరికీ మార్గదర్శిగా నిలిచారు.
 
అదేవిధంగా సినిమా జర్నలిస్టుల ఉనికి, వారి పరిణామక్రమానికి సంబంధించిన లోతైన వివరాలను పాఠకులకు తెలియ జేసే ఎ.ఎన్‌. జగన్నాథశర్మగారి ముందుమాట ఈ పుస్తకానికి మరో హైలైట్‌. 
 
 
దేవుడులాంటి మనిషి 
రచన: యు.వినాయకరావు, ధర: 1200 రూపాయలు 
పేజీలు: 562, ప్రతులకు: జయా పబ్లికేషన్స్‌, 
ఫ్లాట్‌ నెం.102, శ్రీశ్రీ శ్రీనివాస నిలయం, 7-1-303/డి/2, 
బాలయ్యనగర్‌, సంజీవరెడ్డి నగర్‌, హైదరాబాద్‌-38 

సెల్‌: 9885179428


-లలితా త్రిపుర సుందరి