పదునైన కథలు
తెలుగులోకి పలు భారతీయ భాషల నుండి అనువాద గ్రంథాలు వస్తూనే ఉంటాయి కాని ఎందుచేతో ఉర్దూ భాష నుంచి, అందులోనూ హైదరాబాద్‌లోని ఉర్దూ సాహిత్యం నుంచి ఎక్కువ అనువాదాలు రాలేదు. జీలాని బానూ వంటి ఉర్దూ రచయిత్రి రచనలన్నీ ఈపాటికి తెలుగులోకి రావాల్సింది. నాలుగు దశాబ్దాల నాడు దాశరథి రంగాచార్య చేసిన ‘కేదారం’ తర్వాత ఇన్నేళ్ళకు ఆమె రెండో అనువాద కథల సంకలనం ‘గుప్పిట జారే ఇసుక’ వచ్చింది.
జీలానీ బానూ భారతదేశంలోనే కాదు, దక్షిణాసియాలోనూ ప్రసిద్ధి చెందిన రచయిత్రి. ఛాందసత్వాన్ని సహించని తత్వం ఆమెది. రాజకీయంగా పదునున్న రచనలెన్నో చేశారు. ఇంత ముఖ్యమైన రచయిత్రి హైదరాబాదులోనే ఉన్నా అనువాద రచనలు లేకపోవడంతో తెలుగు పాఠకులకు కాస్త దూరమయ్యారనిపిస్తుంది.

‘గుప్పిట జారే ఇసుక’ కథలు చదివిన తర్వాత ఆమె దగ్గరకు వెళ్ళి నమస్కరించి ఆలింగనం చేసుకుని ముబారక్‌ చెప్పి రావాలని పాఠకులకు అనిపిస్తుందనీ, అలా చేస్తారని నా ఆశ. కోరిక. అందుకుగాను మెహక్‌ హైదరాబాదీ గారికి మనం మరీ మరీ ధన్యవాదాలు చెప్పాలి. నిజానికి ఆయన ఎంచుకుని అనువాదం చేసిన ఈ కథలు ఈనాటి అవసరం కూడా. ద్వేషం, భయం ఆక్రమించిన మనసులతో యాతన పడుతున్న ప్రజలకు ఈ కథలు ఊరట కలిగిస్తాయి. సున్నితంగా ఆలోచించటం, మానవత్వంతో ప్రవర్తించటం నేర్పుతాయి. ‘అబ్బాస్‌ ఆన’ ఇరాక్‌ యుద్ధం గురించిన కథ. జీలానీ బానూ ఎంత గొప్ప కథకురాలో ఈ కథ చదివితే అర్థం అవుతుంది. ‘గుప్పిట జారే ఇసుక’ దేశ విభజనలో తమ స్వంత ఊర్లను వదిలివెళ్ళిన వాళ్ళు తమ బంధువులను, స్నేహితులనూ కలవరిస్తూ ఒక్కసారైనా వారిని మళ్ళీ చూడాలనుకునే వారి గురించిన కథ. ఇలాంటి కథలు చాలా వచ్చి ఉండవచ్చు. కానీ జీలానీ బానూ ప్రత్యేకత ముగింపులో కనిపిస్తుంది. లైంగిక వేధింపుల గురించిన కథ వైవిధ్యంగా, ఆసక్తికరంగా, కుటుంబ హింసలో కొత్త కోణాన్ని చూపిస్తుంది.

కథలను ఎంచుకోవడంలో మెహక్‌ హైదరాబాదీ మంచి ఛాయిస్‌ తీసుకున్నారని ‘నర్సయ్య బావి’ కథ చదివినపుడు అనిపిస్తుంది. ఈ కథను శ్యామ్‌ బెనెగల్‌ హిందీలో సినిమా కూడా తీశారు. జీలానీ బానూ స్వరాన్ని పట్టుకోవటంలో కూడా ఆయన విజయం సాధించాడు. కొన్ని కథల్లో తెలంగాణ మాండలికాన్ని వాడారు. కొన్ని కథలు ఏ మాండలికమూ లేని సాదా భాషలో అనువదించారు. రెండు సందర్భాల్లోనూ భాష కథకు అడ్డం పడలేదు. సాఫీగా కథ నడిచిపోయింది. ‘గవాక్ష న్యాయం’, ‘గొంతెండిన కూజా’ కథలు జండర్‌ని, వర్గాన్ని కూడా అర్థం చేయిస్తాయి. చాలా సాధారణంగా కనిపించే అసాధారణ కథలు. ఇవాళ సమాజంలో పెరిగిన అసహనం, ద్వేషం ఇరు మతాల వారినీ ఎలా జబ్బుల పాలు చేస్తున్నాయో, ఎలా ఒకర్నొకరికి దూరం చేస్తున్నాయో, ఎలా దగ్గర కావాలో చెప్పే కథలు నాలుగైదున్నాయి.

ఉర్దూ భాష హైదరాబాద్‌ జీవనాడి. ఆ జీవనాడి తీరుని అర్థం చేసుకోవటంలో ఆలస్యం జరగకూడదు. మనం ఒకరికొకరం మరింత బాగా తెలియాలి. ఆ స్నేహానికి సాహిత్య భాషా వారధులను మెహక్‌ హైదరాబాదీ తన అనువాదాలతో మరిన్ని నిర్మించాలి.
  - ఓల్గా
గుప్పిట జారే ఇసుక, 
మూలం : జీలానీ బానూ, తెలుగు: మెహక్‌ హైదరాబాదీ
పేజీలు : 168, వెల : రూ.120
ప్రతులకు : నవచేతన, ప్రజాశక్తి, నవతెలంగాణ