కవి, సీనియర్‌ పాత్రికేయులు శ్రీరామమూర్తి. ఒకనాటి ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ దినపత్రికలకు సంపాదకులు, ప్రస్తుతం కూడా మరో దిన పత్రికలో సంపాదక బాధ్యతల్లో వ్యవహరిస్తున్నారు. నాలుగు దశాబ్దాల విరామం తర్వాత వెలువడిన శ్రీరామమూర్తి మూడవ కవితా సంకలనమిది. ఇందులోని 141 కవితలు శ్రీరామమూర్తి స్కూల్‌ ఆఫ్‌ థాట్‌కు నిలువెత్తు నిదర్శనం. సమాజంలోని అణచివేత, హెచ్చుతగ్గులు, వివక్ష, హిందూ ఆధిపత్య వ్యవస్థ, సమకాలీన పరిణామాలు, వర్తమాన రాజకీయ దుర్మార్గంపై విభిన్నమైన వస్తువులతో ‘నిజం’ కలం పేరిట శ్రీరామమూర్తి సందించిన అక్షరశరాలివి.

మచ్చుకు చూస్తే, టైటిల్‌ కవిత ‘నివురు’ అర్థానికి తగ్గట్టే ఉంటుంది.  ‘ఎగరనీయనప్పుడు/అతుక్కుపోయి/అవని అంతా పాకి/రెక్కలు చాచే పర్వతమై...’ ఆవిర్భవిస్తుందనీ, రగలకుండా అడ్డుకుంటే ‘నివురు’గప్పిన నిప్పులా నిలువెల్లా దహించుకుపోయి విప్లవమవుతుందనీ, రణమవుతుందని చేసిన ఒక సున్నితమైన హెచ్చరిక. డెబ్భైపదులు దాటిన వయసులో కూడా ‘నిజం’ కలం నిప్పులు కక్కుతూ కొంతమంది కుర్రాళ్ళు ముందుతరం దూతలుగా తయారయ్యేందుకు స్ఫూర్తినిస్తున్నారు శ్రీరామమూర్తి. ఈనాటి యువతీయువకులు చదవాల్సిన పుస్తకమిది.  


నివురు
గార శ్రీరామమూర్తి 
ధర 125 రూపాయలు
పేజీలు 222
ప్రతులకు  నిజం ప్రచురణలు, ఎ–26, జర్నలిస్ట్‌ కాలనీ, జూబిలీహిల్స్‌, హైదరాబాద్‌ –33 
సెల్‌ 94403 100 13 మరియు అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు