తెలుగు కవిత్వాన్ని ఆధునిక మార్గం పట్టించిన తొలితరం కవుల్లో శిష్‌ట్లా ప్రముఖుడు. ఐతే ఇటువంటి రచయిత గురించి పాఠకలోకానికి తెలిసిన వివరాలు చాలా తక్కువ. ఆ లోటు తీరుస్తూ అర్ధశతాబ్దం పాటు పాఠకులకు అందుబాటులో లేకుండా పోయిన శిష్‌ట్లా వచన సాహిత్యాన్ని ఒక్కచోట చేర్చింది నవచేతన సంస్థ. 
 
రెండో ప్రపంచ యుద్ధ ప్రభావం తెలుగు ప్రజల జీవితాన్ని విశేషంగానే ప్రభావితం చేసినా సాహిత్యకారులను కదిలించిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో చెప్పుకోదగ్గ సాహిత్యం లేకపోవడమే అందుకు రుజువు. ఇందుకు మినహాయింపుగా శిష్‌ట్లా మాత్రం ‘సిపాయి కథలు’ పేరుతో ఉత్తమశ్రేణి కథలు రాశారు. ఆనాటి ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం తదితర కారణాల వల్ల బతుకు తెరువు కోసం బ్రిటిష్‌ సైన్యంలో చేరిన నాటి తెలుగు వారి జీవితాల్ని శిష్‌ట్లా కథల ద్వారా కళ్ళకు కట్టారు. భీకర యుద్ధ వాతావరణంలోనూ సైనికుల దినచర్యలో చోటుచేసుకునే ఘటనల్ని హాస్యపూరితంగా చిత్రించారు. ‘పడిపోయిన సిపాయి’ అనే కథలో ఎక్కడో పరదేశంలోని ఓ గ్రామం తన సొంత ఊరులాగే కనిపిస్తుంది. ప్రాంతమేదైనా మనుషుల జీవితాలన్నీ ఒకటే అనే సందేశమిస్తారు రచయిత. వీటిలో ఒక్క ‘లెఫ్టినెంట్‌ తులసి’ కథ తప్ప మిగతావన్నీ గుంటూరు మాండలికంలో సాగుతాయి. కథలన్నిటిలో ఆ ప్రాంతానికి చెందిన అరుదైన నుడికారాలు, సామెతలు విరివిగా కనిపిస్తాయి. 
 
సిపాయి కథలతో పాటు శిష్‌ట్లా రచించిన ఆకాశవాణి కథలు, గొబ్బి జాతక కథలు, బాలవినోద కథలు, నాటికలు, గేయాలు కూడా ఈ సంకలనంలో ఉన్నాయి. ఆనాటి పత్రికల తీరును, వాటిల్లో వచ్చే ఇంటర్వ్యూలను, కథనాలను రచయిత వ్యాసాల్లో వ్యంగ్యంగా, ఒకింత ఘాటుగానే విమర్శించారు. ఆ కాలంలో మహిళల దుస్థితి, వితంతు వివాహాల వెనుక రాజకీయాలు, అసలు నిజాలు... ప్రధాన ఇతివృత్తాలుగా శిష్‌ట్లా రచించిన నాటకాలు సాగుతాయి. 
- చందు 
 
శిష్‌ట్లా ఉమామహేశ్వరరావు రచనలు 
పేజీలు : 316, 
వెల : రూ.220 
ప్రతులకు : నవచేతన, ప్రజాశక్తి పుస్తక కేంద్రాలు