నవ్వుకునేవారికి నవ్వుకునేంత! 

‘ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయ’నేది ‘మాయాబజార్‌’లో పింగళి మాట. పుట్టించడం తప్పుకాదు కాని వాటిని దొంగిలించడం మాత్రం తప్పంటారు శంకరనారాయణ. ఇంగ్లీషువారు తెలుగు భాషలోని అనేక పదాలను కొట్టేసి తమ భాషలో కలిపేసు కున్నారనేది ఆయన అభియోగం. ‘వరి’ని ఆంగ్ల నెలల్లోనూ, ‘అబ్బాయ్‌’ని ‘బాయ్‌’గా, ‘మనిషి’ని ‘మ్యాన్‌’, ‘షి’గా విడదీసి, ‘త్రాడు’ని ‘త్రెడ్‌’గా .. ఇలా పలు ఉదాహరణలు జోడించి హాస్య విమర్శలు గుప్పించారు. ఆడవాళ్ల మాటలకు కాదు, తెలుగువాళ్ల మాటలకు అర్థాలే వేరులే అంటారు. ఈ వరసలో నిత్యం వాడే పదాల గుట్టు రట్టు చేశారు. బెదిరించడంలో ‘నీ భాగోతం బయట పెడతా’మనడం, లంచం అనే మాట వాడకంలో ‘ముడుపులు చెల్లించడం’ వంటివి ఉదహరించారు. ఎవరికే ఆపదొచ్చినా ‘అయ్యో పాపం’ అనేది నాలుక చివరుండే మాట. కాబట్టి తెలుగువాడికి ‘పాపభీతి’ మెండని వెటకరిస్తారు. 

- గొరుసు 


ఇంగ్లీషుకు తల్లి తెలుగు?! 
హస్యబ్రహ్మ శంకరనారాయణ 
పేజీలు : 186, వెల : రూ. 144 
ప్రతులకు: 94919 62759