తడిసిన భూమిలాంటి కవిత్వం 

సుమారు రెండు దశాబ్దాల అనంతరం అరణ్యకృష్ణ మళ్ళీ గొంతు విప్పాడు. ‘ఈ భూమి గర్భంలో/ మతాలకన్నా మనుషుల ఆనవాళ్ళే ఎక్కువ’ అంటూ ‘నెత్తురోడుతున్న పదచిత్రం’ను ఆవిష్కరించిన ఇరవై రెండేళ్ళ తర్వాత ‘కవిత్వంతో ఉన్నంతసేపూ...’ ‘వర్షంలో తడుస్తున్న భూమిలా/ నేనూ అమలినంగా ఉంటాను’ అని ప్రకటిస్తున్నాడు. ‘మనసుల మధ్య కూడా సరిహద్దుల నిర్ణయం/ అది రెండు దేశాల సరిహద్దు కన్నా పెద్దదే’ అంటూ ఆమె నిరాకరించినప్పుడు నో అంటే నో అని బల్లగుద్దినట్టు చెబుతాడు. ‘గాయపడి నెత్తురోడడానికి పాపైనా బాబైనా ఒక్కటే’ అని ప్రస్తుతం సమాజంలో నెలకొంటున్న అసహజాతాన్ని ఈసడించుకుంటాడు. అర్థం కాని నిగూఢత గాని, అంతులేని పదచిత్రాల ప్రదర్శన గాని ఈ కవిత్వంలో ఎక్కడా మచ్చుకైనా కనిపించవు. చెప్పాలనుకున్న దాన్ని సూటిగానే చెబుతాడు. అందుకే ‘ఈ వ్యవస్థే కాదు/ మనుషులందరూ కూడా హఠాత్తుగా చచ్చిపోయి/ కొత్త మనుషులు పుట్టుకొస్తే బాగుండు’ అంటూ ఒక మంచి కల కంటున్నాడు. ఆ కల నెరవేరాలని కోరుకుందాం. 
- దేరా 

కవిత్వంలో ఉన్నంతసేపూ , అరణ్యకృష్ణ 
పేజీలు : 127 వెల : రూ. 80 
ప్రతులకు : 89787 20164