నవయువకునిగా పార్లమెంటు వేదికపై జవహర్‌లాల్‌ నెహ్రూపై నిశిత విమర్శలు గుప్పించిన వాజ్‌పేయి 50వ దశకంనుండే రాజకీయాల్లో ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా సామాన్య ప్రజల గుర్తింపు పొందిన నాయకునిగా ఎదిగింది మాత్రం ఎమర్జెన్సీ తర్వాతే. రథయాత్ర, మందిర నిర్మాణంలో పార్టీపాత్రకు వ్యక్తిగతంగా ఆయన వ్యతిరేకం. కానీ జెండాఊపి రథయాత్ర ప్రారంభించింది ఆయనే. 

భిన్నాభ్రిపాయాల మధ్య సయోధ్యతో ఎలా పని చేయాలో తెలిసిన నాయకుడు వాజ్‌పేయి.ఇందిరాగాంధీ మరణానంతరం 1984 డిసెంబరులో జరిగిన ఎన్నికల గ్వాలియర్‌ నియోజకవర్గం నుండి వాజ్‌పేయి ఓటమి చెందటంతో దేశవ్యాప్తంగా మధ్యతరగతి విద్యావంతులు, మేథావులూ ఎంతో ఆవేదన చెందారు. ఆ సానుభూతి పవనాల్లో మహామహులెందరో కొట్టుకుపోవడంతో రాజీవ్‌గాంధీ చారిత్రక విజయం నమోదు చేసుకున్నారు. భారత చరిత్రలో 13 రోజులు అతి తక్కువ సమయం ప్రధానమంత్రి పదవిలో ప్రభుత్వానికి నాయకత్వం వహించిన దేశనేత వాజ్‌పేయి. మెజార్టీ సాధించలేమని ముందుగానే తెలిసినప్పటికీ ఆయన మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సవాలు స్వీకరించారు. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయమని నన్ను ఆహ్వానిస్తే, నేను సవాలు స్వీకరించకుండా ఉండాలా? పలాయనం చిత్తగించాలా? అని ప్రశ్నించిన వాజ్‌పేయి మెజార్టీ కూడగట్టేందుకు హార్స్‌ట్రేడింగ్‌ వంటి తప్పుడుపద్ధతులెప్పుడూ అనుసరించలేదు. తన మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ను కడవరకు ఆయన గౌరవించారు.  సంక్లిష్ట సమయాల్లో ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ పక్షమే వహించారు. సంఘ్‌కు ఇష్టంలేని పని ఆయన ఎప్పుడూ చేయలేదు. అందుకే 1998లో రాష్ట్రపతి భవన్‌కు చేరిన తర్వాత కూడా మంత్రివర్గ తుదిజాబితా నుండి రెండు పేర్లను ఆయన తొలగించారు. సంకీర్ణ ప్రభుత్వాల శకంలో ఎంతో దక్షతతో ప్రభుత్వాన్ని నడిపి ఐదేళ్ళత పూర్తికాలం పదవిలో ఉన్న తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రి వాజ్‌పేయి. ఆచరణలో గోప్యత, దాపరికాలకు తావులేదు. ఆయన పెళ్ళి చేసుకోలేదు. ‘నేను అవివాహితుణ్ణి, బ్రహ్మచారిని కాదు’ అని వాజ్‌పేయి స్వయంగా ప్రకటించడం ఆయన జీవితం తెరచిన పుస్తకం అని చెప్పకనే చెబుతుంది.శక్తిహీనుడని ఆక్షేపణలు ఎదుర్కొన్న ఈ ప్రధానమంత్రే అణుపరీక్షలు జరిపి భారత్‌ను శక్తివంతమైన దేశాల జాబితాలో చేర్చారు వాజ్‌పేయి. రాజకీయ సన్యాసం చేస్తున్న మోదీకి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది ఆయనే.తన కవితాగానంతో వాక్పటిమ, వాక్చాతుర్యంతో అందరినీ అలరించిన వాజ్‌పేయి ప్రస్తుతం ఎవరిన గుర్తించేస్థితిలో లేరు. 2015లో భారత ప్రభుత్వం భారతరత్న ఇచ్చి గౌరవించేనాటికే ఆయన ఈ స్థితిలో ఉన్నారు. బి.జె.పి, జనసంఘ్‌ రెండూ మతత్వపార్టీలుగా ముద్రపినప్పటికీ వాజ్‌పేయిని మాత్రం ముస్లిం దేశాలు సైతం మతత్వవాదిగా భావించలేదు. వార్తాసేకరణలో భాగంగా వాజ్‌పేయిని సన్నిహితంగా పరిశీలించిన విజయ్‌ త్రివేదీ సుదీర్ఘకాలం పదునైన రాజకీయ పాత్రికేయ బాధ్యతలు నిర్వహిస్తున్న రచయిత. ఆయన రాజకీయ జీవితాన్ని, విశిష్ట వ్యక్తిత్వాన్ని నిజాయితీతో గుర్తించి అబ్బురపడి చేసిన రచన యిది.

 

ఓటమిని అంగీకరించను
అటల్‌ బిహారీ వాజ్‌పేయి జీవిత గాథ
హిందీమూలం విజయ్‌ త్రివేది
తెలుగు సేత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌
ధర 399 రూపాయలు
పేజీలు 448
ప్రచురణ ప్రిజమ్‌ బుక్స్‌, హైదరాబాద్‌ ఫోన్‌ 040–2326182, 
బెంగళూరు–70 ఫోన్‌ 080–26714108