దయ, సత్య, శౌచాలనే మాటలు వింటూ ఉంటాం. మనిషైనవాడికి దయాగుణం, సత్యానికి, స్వచ్ఛ జీవన విధానానికీ కట్టుబడి ఉండటం ప్రాథమిక విషయాలని ఆ మూడు మాటలు వాడటంలోని సారాంశం.
రచయిత సి.యస్‌.రాంబాబు కవిత్వం రాస్తారు. కథలూ రాస్తారు. అడపాదడపా సమీక్షా వ్యాసాలు రాయడం కూడా కద్దు. ఆయన తన ఇరవై కథలను ఎంచి కూర్చుకున్న సంపుటి ఇది. 
గత కొన్నేళ్ళుగా తెలుగు కథా రచనలో ఒక పరిణామం గమనించదగినదిగా కని పిస్తున్నది. అది పాజిటివ్‌ థింకింగ్‌. జీవితంలో మంచి చూడాలి. మంచిని ప్రోత్సహించాలి. మంచి గురించే మాట్లాడాలి. మానవత్వం ప్రధానాంశంగా సమాజంలో పరస్పర సంబం ధాలు అందరికీ మేలుచేసేవిగా పరిణ మించాలి. సూక్ష్మంగా ఇదీ పాజిటివ్‌ థింకింగ్‌ సాహిత్యంలో కోరుకునే విశేషం. 
మనం-స్నేహితులు, మనం-తల్లి దండ్రులు, మనం-పిల్లలు, మనం - ఉద్యోగ సాధకబాధ కాలు, మనం-పరోపకార గుణం, మనం-మన ఆశలు, పరిమితులు, మనం- సంపాదనా సమస్యలు... ఇలా ఈ సమాజ జీవితంలో ‘మనం’ (ఇండివిడ్యుయల్స్‌) కేంద్రంగా సర్వ సామాజికాంశాలూ పరిభ్రమిస్తూ ఉంటాయి. 
రాంబాబు రాసిన ఇరవైకథల నేపథ్యం కూడా ‘మన’మే. మనం తోటివారికి, కుటుం బానికి, మరీ ముఖ్యంగా పేదతనం కారణంగా అవకాశాలు అందిపుచ్చుకోలేనివారికి అండగా ఉండాలనే సున్నితమైన సందేశం ఈ కథ లన్నిటా అంతస్సూత్రంగా కొనసాగుతూ కని పిస్తుంది. వీటిలో చాలా కథల్లో ప్రముఖ పాత్ర ‘నేను’.అంటే ఉత్తమ పురుష. రచయిత ఈ ‘నేను’ ని ఎంచుకోవడంలో కథా రచనలో సాధించిన ప్రత్యేకత ఏమిటంటే, తన సున్నిత మైన మనస్సును తాకిన ఏదో ఒక ఘటనను కథకు ఇతివృత్తంగా కుదుర్చుకోవడం. అలాగే నిత్యం ఒత్తిళ్ళ మధ్య, కుటుంబ సామాజిక అవసరాల మధ్య నలిగే మధ్యతరగతి, మధ్య వయస్కుల ఆరాటాలు కూడా ఈ కథల్లో కనిపిస్తాయి. 
‘‘విజ్ఞుడు, విద్యావంతుడు అయిన ఆధు నిక మానవుడు సాటిమనుషులపట్ల దయ కలిగి ఉండాలి. పక్కవాళ్ళను పట్టించు కోవాలి’’ అనే అంతస్సందేశం ఈ కథల సారాం శంగా చెప్పవచ్చు. ఈ చెప్పడం కోసం రచ యిత రకరకాల అంతరువుల్లో అంశాలు స్పృశిం చారని ‘‘అనిర్వచనం’’, ‘‘ఇరుకు’’, ‘‘కొత్త పరుగు’’, ‘‘పితౄణం’’ ‘‘థాంక్యూ అబూమియా’’ కథలు సాక్ష్యంగా నిలుస్తాయి. వీటికి భిన్నమైన సరదా కథ ‘‘వెంకీ విలాపము’. విశేషించి ఈ కథ లలో కనిపించే మేలిమిగుణం స్ర్తీ పాత్రల హృదయసంస్కార చిత్రణం. పురుషుడు సందేహగ్రస్తుడైన సందర్భాలలో స్ర్తీలు ఉదారంగా పరిష్కారాలు చూపిస్తూ ఉంటారు. 
సున్నితమైన, ఆర్భాటాలులేని కథనంతో మానవ సంబంధాలు ఎలా సాగితే బాగుం టుందో చెప్పే ఈ కథలు ముఖ్యంగా యువ తరం చదవదగినవి. 
-శ్రీకాంతశర్మ 
 
 

పసిడి మనసులు 
కథలసంపుటి 
సి.యస్‌.రాంబాబు 
ధర: 100 రూపాయలు పేజీలు: 168 
ప్రతులకు: పాలపిట్ట బుక్స్‌, 403, విజయ సాయి రెసిడెన్సీ, సలీంనగర్‌,మలక్‌పేట, హైదరాబాద్‌-36