సేద్యం పట్ల బాధ్యత ...
 
సేద్యం ఎల్లప్పుడూ సంక్షోభాల మయమే. ప్రకృతి విపత్తుల నుంచి మద్దతు ధర దాకా అనేక సమస్యలు అన్నదాతల ఆత్మహత్యకు కారణమవుతున్నాయి. ఈ ఆత్మహత్యలపై నిరంతరం చర్చ, ప్రతీ ఏటా గణాంకాల వెల్లడి జరుగుతూనే ఉంది. వ్యవసాయ రంగం సంక్షోభాన్ని చాలావరకూ రాజకీయ, పరిపాలనా కోణాల్లో మాత్రమే చూడడం జరుగుతోంది. సంక్షోభానికి కారణాలు, మూలాల్లోకి వెళ్లి చేసిన అన్వేషణ చాలా అరుదు. ఆ అరుదైన అంశాలను సమగ్రంగా చర్చించిన వ్యాసాల సంకలనం ఈ పుస్తకం. 
ఆధునికి సాంకేతిక పరిజ్ఞానం, పారిశ్రామీకరణ పేరుతో చిన్న రైతును వ్యవసాయ రంగానికి దూరం చేసే కుట్రలను ఎత్తి చూపుతూ, ఏ రంగంలోనైనా సంస్కరణలు అనేవి ఆర్థిక ప్రయోజనాలు పరమార్థంగా కాకుండా, మనిషి కోణంగా జరగాల్సిన అవసరాన్ని రచయిత్రి నొక్కి చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడో ముగిసినా, దాని ప్రభావం ఇప్పటికీ వ్యవసాయ రంగంపై ఉన్న తీరును సాక్ష్యాలతో వివరించారు. రైతు ఆత్మహత్యలన్నీ మానవహక్కుల ఉల్లంఘనలేనని స్పష్టం చేశారు. రైతు ఆత్మహత్య తర్వాత ఆ కుటుంబాలు ఏమవుతాయనే వివరణ, ముఖ్యంగా ఒంటరి స్త్రీల ఆవేదనను, వారికి చేయూత నివ్వాల్సిన అవసరాన్ని రచయిత్రి గుర్తుచేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు సాయం అందించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటూ, పౌర సమాజం తన బాధ్యత మర్చిపోవడాన్ని ప్రశ్నించారు. 
ఈ పుస్తకంలో విపత్తులు, సమస్యల గురించిన చర్చే కాకుండా పర్మా కల్చర్‌ వెంకట్‌, విదేశం తిరిగి వచ్చి సొంత ఊరు బాగుకోసం పాటుపడుతున్న పర్చాల కిషన్‌రావు లాంటి వారి విజయగాథలూ మనకు స్ఫూర్తి కలిగిస్తాయి. చిన్నరైతుల కుటుంబాలు కరువు కాటకాలను తట్టుకుని నిలబడాలంటే వ్యవసాయ రంగంలో పశు సంపద పెరగాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. యాదృచ్ఛికంగా ఇప్పటి ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచిస్తున్నాయి. వ్యవసాయం రంగంలోని సమస్యల పట్ల సంపూర్ణ అవగాహనను, అన్నదాత పట్ల మన బాధ్యతను గుర్తుచేసే పుస్తకం ఇది. 
- చందు
రైతు ఆత్మహత్యలు- మనం...?
సజయ 
పేజీలు: 260, వెల : 200
ప్రతులకు : వి.రమేశ్‌ బాబు-
         95055 18441