మానవీయ కోణంలో...
విరించి అనే కలం పేరుతో కథలు రాసే తల్లాప్రగడ గోపాలకృష్ణ తన 24 కథలతో ఈ సంకలనం వెలువరించారు. కథలను చదివినవారికి ఆయనదాదాపు ప్రతి మానవీయ కోణాన్నీ స్పృశించారనిపిస్తుంది. అటు ఇతివృత్తాలకు సంబంధించి కానీ, ఇటు భాషకు సంబంధించి కానీ ఎటువంటి భేషజాలు, అతిశయాలూ లేక, ఆచరణాత్మకంగా ఉండడంతో కథలన్నీ చదివిస్తాయి. ఇంకా చదవాలనిపిస్తాయి. వృద్ధుల జీవితాలను ఇతివృత్తంగా చేసుకుని ఆయన రాసిన ‘ఆశ్రమ’, ‘శ్రావణ’ వంటి కథనాలు సరికొత్త మానవీయ దృక్పథాన్ని ఆవిష్కరించాయి. ముఖ్యంగా ‘సహనాభవతు’ కథనం అనుమానపు భార్య మనస్తత్వానికి చక్కగా అద్దం పట్టింది. ఈ కథల్లోని ఇతివృత్తాలన్నీ పాఠకులకు కరతలామలకమే అయినప్పటికీ, ఆయన రచనా శైలి ఆ ఇతివృత్తాలకు తాజాదనం తెచ్చిపెట్టింది. కథల్లో సంప్రదాయికతతో పాటు, ఆధునికత కూడా చోటు చేసుకుంటుంది. ఆయన అభ్యుదయ భావాలకు కూడా ‘చాప కింద నీరు’ వంటి కొన్ని కథలు అద్దం పట్టాయి. కుమార్తెను మంచి ఇల్లాలిగా మార్చడానికి ఓ తండ్రి చేసిన ప్రయత్నాన్ని ‘కార్యేషుదాసి’ చక్కగా కళ్లకు కట్టించింది. ఇతివృత్తాలకు తోడు భాష కూడా బాగుండడంతో ఈ కథలు ఇట్టే ఆకట్టుకుంటాయి.
- జి. రాజశుక
సహనాభవతు, విరించి
పేజీలు: 264, వెల: రూ.150, ప్రతులకు: 0866-2436643