కళలను గ్రామీణ స్థాయికి తీసుకెళ్లాలిప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశంరవీంద్రభారతి,హైదరాబాద్: తెలుగు కట్టు, బొట్టు గ్రామాల్లోనే బతికుందని, అలాంటి గ్రామాలకు కళారూపాలను చేర్చాలని ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సోమవారం రవీంద్రభారతిలో ‘జాతీయ నృత్యోత్సవం-2017’ ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బుర్రా వెంకటేశం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వర్సిటీ ఆశించిన స్థాయిలో పేరొందలేదని, దానికి పలు కారణాలు ఉండొచ్చని అన్నారు. త్వరలో తెలుగు వర్సిటీ రూపురేఖలు మారబోతున్నాయని అన్నారు. కళలు, కళారూపాలు గ్రామీణస్థాయికి చేరేలా చర్యలు తీసుకోవాలని, దీనికి ప్రభుత్వం తరపున సహకారం అందజేస్తామని తెలిపారు. విశిష్ట అతిథిగా హాజరైన వర్సిటీ మాజీ వీసీ ఆవుల మంజులత మాట్లాడుతూ సాహిత్యం, లలిత కళలకు తెలుగు వర్సిటీ కేంద్రబిందువని అన్నారు. నాట్యం, జానపద కళారూపాలను జిల్లాస్థాయిల్లో ప్రదర్శింపజేసేలా కృషిచేయాలని సూచించారు. సభకు అధ్యక్షత వహించిన వర్సిటీ వీసీ ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగు వర్సిటీ కొత్తరకమైన ఆలోచనలతో ముందుకెళ్తోందని తెలిపారు. త్వరలోనే కరీంనగర్‌, నల్లగొండ తదితర ప్రాంతాల్లో పీఠాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.