ఉద్రిక్తంగా ఉంది కోర్టు బయటంతా. పెద్ద వాహనమెక్కి వెళ్ళిపోతున్నారు ఐజీ, ఎస్పీ, డీఎస్పీ, ఇంకో ఆరుగురు పోలీసులూ. ఇప్పుడు చూడమన్నాడు ఆ కేసు సంగతి, సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ కుమార్‌ వర్మ. రహస్యంగా చేయాలన్నాడు దర్యాప్తు, ‘సీల్డ్‌ కవర్లో హైకోర్టుకి ఇస్తాం తెల్సుగా... జాగ్రత్త!’ అంటూ.

కేసు ఫైళ్ళని చిత్రిక పట్టసాగారు 40 మంది సీబీఐ టీం.‘నార్కో ఎనాలిసిస్‌, పాలీగ్రఫీ టెస్టులు లేవేంటీ....’‘అడ్వాన్స్‌డ్‌ డీఎన్‌ఏ మ్యాపింగ్‌, డిజిటల్‌ ఫుట్‌ ప్రింట్స్‌ కూడా...’‘రిమాండ్‌ ఆర్డర్‌కి వేయమనండి ప్రాసిక్యూటర్నీ...’పాతిక లోపున్న ఐదుగురు రిమాండ్‌ ఖైదీల్ని కస్టడీలోకి తీసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. వాళ్ళతో క్రైం సీన్‌ని రీక్రియేట్‌ చేయడానికి విఫలయత్నం చేశారు.‘ఏంట్రా మీరు, ఇక్కడ యేం చేశారో, ఎలా చేశారో చెప్పరా?’‘చెయ్యలేద్సార్‌ మేమేమీ? అమ్మతోడు!!’ మొత్తుకున్నారు వాళ్ళు.‘తేలుస్తాం...’ అని శాస్త్రీయ పరీక్షలకి తీసికెళ్లారు. మరో వైపు వాళ్ళ ఫోన్‌ కాల్స్‌ రికార్డుల ఆధారంగా ఏ సమయంలో ఎక్కడున్నారో తెలిపే డిజిటల్‌ ఫుట్‌ ఫ్రింట్స్‌ సమీకరించసాగారు.

చనిపోయిన ఆరో నిందితుడి భౌతిక అవశేషాలనీ ఫోరెన్సిక్‌కి పంపారు. నాలుగు నెలలు తీవ్రంగా శ్రమించి సేకరించిన సాక్ష్యాధారాల్ని విశ్లేషించి చూస్తే, షాక్‌ కొట్టినట్టయింది. టీం సభ్యులు షాకులోంచి తేరుకునే లోపే, ఫైళ్ళు తీసుకుని ఢిల్లీ పరుగెత్తాడు సీబీఐ ఎస్పీ...‘అన్‌ బిలీవబుల్‌ సర్‌!’ అన్నాడు ఉద్రేకంగా.ఫ ఫ ఫనిశ్చేష్టుడయ్యాడు సీబీఐ డైరెక్టర్‌ వర్మ. నిందితులు అమాయకులని ఎస్పీ చెప్పడం నమ్మశక్యంగా లేదు.

పోలీసులు ఆరుగుర్ని నిందితులుగా నిర్బంధించి, ఒకణ్ణి లాకప్‌ డెత్‌ చేసిన కేసుని కూడా సీబీఐనే చేపట్టాల్సి వచ్చి - ఐజీ, ఎస్పీ, డీఎస్పీ సహా ఆరుగురు పోలీసుల్ని తీసికెళ్ళి జైల్లో వేయాల్సి వచ్చింది. ఇప్పుడు చూస్తే లాకప్‌ డెత్‌ అయిన సూరజ్‌ కుమార్‌ సహా, నిందితులందరూ అమాయకులని తేలింది? అమాయకుణ్ణి లాకప్‌ డెత్‌ చేసి, జైల్లో కూర్చున్న తొమ్మిది మంది బడా ఛోటా పోలీసు బ్యాచిని చూసి నవ్వాలో ఏడ్వాలో అర్ధం కాలేదు. కేసు తేల్చమని ఐజీ ఆధ్యర్యంలో ‘సిట్‌’ వేస్తే, జైల్లో సిటింగ్‌ వేశారంతా!