అర్థరాత్రి. తలుపు కిర్రుమన్న చప్పుడు. మెలకువ వచ్చిందామెకు. ఇల్లంతా చూసింది. తల్లి కనిపించలేదు. బయట వాచ్‌మన్‌ గదిలో లైటు వెలుగుతోంది. కానీ వాచ్‌మన్‌ ఊరెళ్ళాడే? పిల్లిలా నడచి కిటికీ దగ్గరకెళ్ళి చూసింది. ఓ అపరిచితుడి భుజంపై తల ఆన్చి మాట్లాడుతోంది ఆమె తల్లి! ఆ‍శ్చర్యపోయిందామె.  తల్లి ప్రవర్తనను అసహ్యించుకుందామె. అసలింతకీ అతడెవరు?

****************************

మంచినిద్ర.ఇంతలో ఏదో అలికిడి!హఠాత్తుగా మేల్కొన్నాను. కళ్ళు చిట్లించి గోడ గడియారం వంక చూశాను. సమయం పన్నెండు దాటింది. నగరమంతటా నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. కిర్రుమని తలుపు తెరుచుకున్న చప్పుడు నాకు మళ్ళీ గుర్తొచ్చింది. అర్థరాత్రి పూట తలుపు తెరిచిందెవరు? ఇంట్లో అమ్మ,నేను తప్ప మగాళ్ళెవరూ లేరు. వాచ్‌మన్‌ సెలవులో ఉన్నాడు. ఇంట్లో మగవాళ్ళెవరూ లేరని పసిగట్టి ఎవరైనా దొంగ లోపలికి దూరాడా?ఈ ఆలోచన రాగానే నా గుండె భయంతో దడదడ కొట్టుకుంది. అంతలోనే ధైర్యం కూడగట్టుకుని మంచందిగి మెల్లగా బెడ్‌రూం తలుపుతెరచి హాల్‌లోకి తొంగిచూశాను. ఎవరూ కనబడలేదు. హాల్లోంచి అమ్మగదిలోకి వెళ్ళాను. మంచంపైన అమ్మ కనిపించలేదు. బాత్రూంలో కూడా లేదు. ఇల్లంతా వెదికినా అమ్మ కనిపించలేదు. అప్పుడే మెయిన్‌డోరు బోల్ట్‌ తీసి ఉండటం కన్పించింది. అమ్మ బయటికెళ్ళిందా? ఈ సమయంలో ఆమెకు బయట ఏం పని? నాకేమీ అర్థం కాలేదు.చప్పుడు కాకుండా మెయిన్‌డోర్‌ తెరచి బయటకొచ్చాను.

ఇంటిముందు గేటు కొద్దిగా తెరచి ఉంది. నాకేమీ అంతుపట్టలేదు. అప్పుడే నా దృష్టి పెరట్లో ఓ మూలున్న వాచ్‌మన్‌ గదిపై పడింది. ఆ గదిలో లైటు వెలుగుతోంది. ‘వాచ్‌మన్‌ లేనప్పుడు అతని గదిలోలైటు ఎందుకు వెలుగుతోంది?’విషయమేమిటో తెల్సుకుందామని పిల్లిలా నడుస్తూ ఆ గది దగ్గరకు చేరుకున్నాను. గదిలోంచి గుసగుసలు వినిపించాయి. చెవులు రిక్కించివిన్నాను. అందులో ఓ గొంతు అమ్మది. మరోగొంతు ఎవరో పురుషుడిది. నాకు ఆశ్చర్యమేసింది. గదిగోడకున్న చిన్నకిటికీలోంచి రహస్యంగా లోపలికి చూశాను.ఆశ్చర్యంతో నా కళ్ళు విచ్చుకున్నాయి. లోపల అమ్మపక్కన ఓ అపరిచితవ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతనికి అమ్మ వయసే ఉంటుంది. ఇద్దరూ చేతిలోచెయ్యేసి ఆత్మీయంగా మాట్లాడుకుంటున్నారు. అమ్మ అతనిభుజంపై తలవాల్చి తన్మయంగా కళ్ళుమూసుకుంటే అతను ప్రేమగా ఆమె తలని నిమురుతున్నాడు. ‘‘లక్ష్మీ, నిన్ను చూడకపోతే క్షణమొకయుగంలా గడుస్తోంది. అందుకే ఈ టైంలో వచ్చాను’’ అన్నాడతను.