ఆదివారం మధ్యాహ్నం పనంతా అయిపోయిందని తీరుబడిగా కూర్చుని టి.వి పెడితే అన్నింటిలో, అయితే వార్తల గోలా లేక పోతే సీరియళ్ల గోల. మనకున్న కష్టాలు చాలక ఇంకా ఈ సీరియల్‌ వాళ్ళ కష్టాలు కూడా ఎందుకూ? సరే సంక్రాంతి వస్తోంది కదా కాస్త ఇల్లు సర్దుకుందాం అని లేచాను. ఎప్పటినుంచో ‘బీరువా సర్దాలి’ అనుకుంటూ వున్నాను. పట్టు చీరల నుండి మొదలుపెడదాం అనుకుని చీరలన్నీ తీసి పక్కనపెడుతుంటే వాటిల్లోంచి జారి పడింది ఒక కవరు.ఎన్నో ఏళ్ళ నుండి నేను వెదుకుతున్న కవరది. ఇన్నాళ్ళకి దొరికింది. వణుకుతున్న చేతులతో దాన్ని తీసుకుని తెరిచి చూసాను. అవును అదే ... ఆ ఉత్తరమే... నేను ఎంతో భద్రంగా దాచుకున్న నా ఉత్తరం. పోయిందని అంత కన్నా ఎక్కువ బాధపడిన ఉత్తరం. ఇలా వాడకుండా మూలపెట్టిన నా పట్టు చీరల మడతల్లో దాగివుంది. ఉన్నఫళాన పనివదిలేసి ఏదో నిధి దొరికినంత అపురూపంగా దాన్ని పట్టుకుని ఇంటి వెనక్కి వెళ్ళి నందివర్ధనం చెట్టుపక్కగా వున్న మెట్లపై కూర్చుని తెరిచాను. అక్షరాల వెంబడి నా కళ్ళుపరుగులు తీస్తుంటే, నా మనస్సు కూడా ముప్పై సంవత్సరాల క్రితం నాటి మా ఊరిని చేరుకుంది.

************

‘‘వసంతా... ఎక్కడున్నావ్‌ త్వరగా రా.... పచ్చడి సీసా పెట్టావా? మురుకులు, అరిసెలు పెట్టావా?’’ మా అత్తయ్య ఒకటే హడావిడి పెట్టేస్తోంది.ఈ రోజు మధ్యాహ్నం బండికి మావారు మద్రాసు వెళ్ళాలి. కొత్తగా వచ్చిన ఫీల్డ్‌ ఆఫీసర్‌ ఉద్యోగానికి ట్రైనింగ్‌ కోసం. నెల రోజులు మద్రాసులోనే ట్రైనింగ్‌ అట. తర్వాత పోస్టింగు. అప్పుడు వచ్చి నన్ను తీస్కుని వెళతారు. ఈయన గారి కోసం నెల రోజులకి సరిపోను చిరుతిండ్లని, పచ్చళ్ళని.. అవనీ, ఇవనీ వారం రోజుల నుండి వంటింటికే అతుక్కుపోయాం. అన్ని వంటలూ మా అత్తయ్య గారి అత్తయ్య అంటే ఈయన గారి బామ్మ డైరెక్షనులో, మా అత్తయ్యగారి పర్యవేక్షణలో జరిగాయి. ఇంట్లో వాళ్ళకి రుచి కోసం కూడా మిగల్చకుండా అన్నీ సర్దించేసింది బామ్మగారు మనవడి కోసం.