విద్యాభ్యాసం పూర్తిచేసుకుని ఆశ్రమంనుండి బయటకు వచ్చాడతను. కానీ అతడిలో అసంతృప్తి. మానవాతీతశక్తులు సంపాదించలేకపోయాడు. ఆ కోరిక మిగిలిపోయింది. అందుకే అతడు జనంమధ్యకు వెళ్ళకుండా నేరుగా హిమాలయాలకు చేరుకున్నాడు. అక్కడ చాలామంది యోగులను కలుసుకుని మానవాతీతశక్తులుపొందే విద్య నేర్పమని అడిగాడు. అందుకు వాళ్ళేమన్నారు? అతడి కోరిక నెరవేరిందా? లేదా?

ఒకానొకప్పుడు పాంచాలదేశ సరిహద్దులో ఓ భీకరారణ్యం ఉండేది. ఆ అరణ్యం క్రూరజంతువులకూ, విషసర్పాలకూ నెలవుగా ఉండేది. అందువల్ల, సామాన్యప్రజలు ఆ అరణ్యంలోకి వెళ్లడానికి భయపడేవారు. అయినప్పటికీ కొందరు సాహసికులు ఆ అరణ్యంలోనికి వెడుతూనే ఉండేవారు. ఎందుకంటే, ఆ అరణ్యంలో సాందీపకుడనే గొప్పజ్ఞాని ఉన్నాడు. ఆయన అరణ్యంమధ్యంలో ఓ ఆశ్రమం నెలకొల్పి, తనవద్దకు విద్యార్థులైవచ్చిన ప్రతివారికీ జ్ఞానబోధచేస్తూ ఉంటాడు.సాందీపకుడికి తెలియనిశాస్త్రంలేదు. అందుకని ఆయనవద్ద విద్యాభ్యాసం చేయటానికి ఎక్కడెక్కడినుంచో విద్యార్థులువచ్చి శిష్యులుగా జ్ఞాన సముపార్జనచేసి వెళ్లేవారు.సాందీపకుడు తన ఆశ్రమాన్ని జనంమధ్యంలో కాకుండా భీకరారణ్యంలో నెలకొల్పడానికి కారణం ఉంది.  

అందరికీ అనువుగావున్నచోట ఇలాంటి ఆశ్రమం ఉంటే - కొందరు కాలక్షేపానికికూడా అక్కడికి వచ్చిచేరే అవకాశం ఉంది. అదే భీకరారణ్యానికైతే అలా రావడానికి సామాన్యులు భయపడతారు. అసలైన విద్యాభిలాషికి అలాంటి భయం ఉండదు. అటువంటివారికి విద్యాదానం చేయడానికి ఏ గురువుకైనా ఉత్సాహంగా ఉంటుంది. సాందీపకుడు అలాంటి గురువు. అలా ఎందరో ఎంతో కష్టపడి ఆశ్రమం చేరుకుని అక్కడ అనేకవిద్యలు అభ్యసిస్తున్నారు. సాందీపకుడు అందర్నీ సమంగానే చూసేవాడు. కానీ వారిలో ఆయనకి కొందరంటే ఎక్కువ అభిమానం ఉండేది. అందరిలోకీ ప్రియతమశిష్యుడు సుధాముడు. సుధాముడికి ఉన్న విద్యాతృష్ణ ఇంతాఅంతా కాదు. అటుపైన అతడు ఏక సంథాగ్రాహి.

అది చాలదన్నట్లు కృషిలో ఏ లోపమూ చేయడు. అందుకని సుధాముడంటే సాందీపకుడికి - మాటల్లో చెప్పలేనంత ఇష్టం ఉన్నది.సుధాముడు కూడా గురువుకోసం ప్రత్యేకశ్రద్ధ తీసుకునేవాడు. అతడు ప్రతి రోజూ తానొక్కడూ విడిగావెళ్లి, గురువుకోసం విశిష్టమైన కందమూలాలు తెచ్చేవాడు. అతడు తెచ్చినవాటిని గురువు ప్రీతితో ఆరగించేవాడు. ఒక రోజు అదేపనిమీద అడవిలోకి వెళ్లిన సుధాముడికి ఓ విచిత్రవ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి పొడవైనచొక్కా ధరించాడు. ముఖానికిగెడ్డం, మీసం - పొడవాటి గీతల్లా వ్రేలాడుతున్నవి. అతడు ఒక సువర్ణ ఆసనంమీద కూర్చుని ఉన్నాడు. అతడిముందు నగిషీలు చెక్కిన అందమైనబల్ల ఉన్నది. ఆ బల్లమీద ఒక అందమైన బంగారుపళ్లెం ఉన్నది. బల్లపక్కనే ఒక అందమైన యువతి నిలబడి ఉన్నది. ఆమె అతడికి ఆ బంగారుపళ్లెంలో వడ్డన చేస్తున్నది. ఆ విచిత్రవ్యక్తి పంచభక్ష్య పరమాన్నాలతో తృప్తిగా భోజనం చేస్తున్నాడు. ఆ విచిత్రవ్యక్తికి ఎదురుగా ఆప్సరసలాంటి మరోయువతి ఉన్నది. ఆమె చక్కగా నృత్యం చేస్తున్నది. ఆమె నృత్యంచూస్తుంటే నాట్యకళలో ఆరితేరిన యువతిలా అనిపిస్తున్నది.