ఇంటిముందు ఆగిన ఆటోలోంచి విఐపి బ్యాగ్‌ పట్టుకుని దిగిన తల్లినిచూసి ఆశ్చర్యపోయాడు సూర్యం.ఎదురువెళ్లి చేతిలో బ్యాగ్‌ అందుకుని ‘‘అదేంటమ్మా! కబురూకాకరకాయా లేకుండా, హఠాత్తుగా వచ్చేశావు! ముందుగాచెబితే స్టేషనుకి వచ్చేవాణ్ణికదా!’’ అంటూ ఇంట్లోకి దారితీశాడు.ఆ మాటలు వింటూనే వంటింట్లోంచి బయటకొచ్చి, ‘‘రండత్తయ్యగారు! అక్కడంతా బావున్నారా?’’ అంటూ సుందరి అత్తగారిని పలుకరించింది.

‘‘హల్లో మామ్మా...’’ అంటూ మనవడు, మనవరాలు తలెత్తి పలకరించి, మళ్ళీ సెల్‌ఫోన్‌ ఆటల్లోకి వెళ్ళిపోయారు.అందరితోనూ పలుకరింపులయ్యాక, ‘‘కాఫీ పెట్టు తల్లీ! కాళ్ళు్కడుక్కుని వస్తా!’’ అంటూ సుభద్రమ్మ పెరట్లోకి దారితీసింది.సుభద్రమ్మకి ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురబ్బాయిలు. పెద్దమ్మాయి హై‍స్కూల్‌ చదువు పూర్తయ్యేసరికే సుభద్రమ్మ భర్త పోయారు. ఏ ఆధారం లేకపోయినాసరే, నోటి మంచితనం, భర్తచేసిన మంచిపనులే పెట్టుబడిగా, పిల్లలని పెంచి,పెద్దచేసి యోగ్యులుగా తీర్చిదిద్దింది. ఉద్యోగరీత్యా వేరు వేరు ఊళ్ళలోఅందరూ వాళ్ళ వాళ్ళ జీవితాలలో బాగానే స్థిరపడ్డారు. సుభద్రమ్మ ఏడాది పొడవునా అందరిళ్లూ చుట్టబెట్టుకొస్తుంది. అందరూ ఆవిడను బాగా చూసుకుంటారు.

‘‘నీకు ఎక్కడ బాగుంటే, అక్కడే స్థిరంగా ఉండొచ్చుకదమ్మా! మేమే అక్కడికి వచ్చి నిన్ను చూస్తూ ఉంటాం!’’ అని పిల్లలందరు అంటూ ఉంటారు.‘‘రెక్క ఆడుతున్నంతవరకు ఇలా చాంద్రాయణం చేస్తుంటానర్రా! మంచంపట్టకుండా వెళ్ళిపోతే, మీరూ, నేనూ ఇద్దరం అదృష్టవంతులమే! లేదా అప్పుడే ఎక్కడో అక్కడ మంచం వేద్దురుగానీ’’ అంటూ నవ్వుతూ అనేది.సుభద్రమ్మకి ఫోన్లు చెయ్యడం ఇష్టం ఉండదు. ఏమైనా విషయాలుంటే ఉత్తరం రాస్తుంది. ఎవరిదగ్గరకైనా వెళ్ళాలంటే వాళ్ళకి ఓ వారం ముందుగానే ‘‘తనేను ఫలానా తేదీన, ఫలానా బండికి వస్తున్నా’’ అంటూ ఓ ఉత్తరం రాసి పడేస్తుంది. అలాంటిది ఏ ఉత్తరం రాయకుండా వచ్చిందంటే ఆశ్చర్యంగా ఉంది సూర్యానికి. అలా అని సూటిగా అడగాలంటే అతడికి భయమే!