బాల్యంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయిన అనాథ అతడు. అలాంటివాళ్ళందరినీ తరతమ భేదంలేకుండా అక్కనజేర్చుకునే ఏకైక తల్లి ఫ్లాట్‌ఫారమే. అతడికి తల్లీదండ్రీ ఇల్లూ అదే. అతడిని మురిపించి మైమరపించిన ఏకైక స్ర్తీ లావణ్య. దయచేసి నా దగ్గరతప్ప ఇంకెవ్వరిదగ్గరా పడుకోకు అని బతిమాలుతూ ఉండేవాడతను. ఆమె కట్టుబడి అతడికి తోడుగానిలిచిందా? అతడి జీవితం ఎలా తెల్లారింది?

పుష్యమాసపు చలిరాత్రి నగరమంతా నిదరోయేవేళ నాలాంటి అభాగ్యులెందరో పేవ్‌మెంట్ల మీద, బస్‌షెల్టర్లకింద మునగదీసుకుని మూడంకె వేసే ప్రయత్నం చేస్తున్నారు.ఎవరో దయార్ద్రహృదయులు పంచిపెట్టే దుప్పట్లు, శాలువాలు కొన్నిరాత్రులవరకు ఆదు కుంటాయి. ఆ తర్వాత వాటికి రెక్కలొచ్చి మార్కెట్‌లోకి ఎగిరిపోతాయి. అలా ఎగిరేటేప్పుడు ఓ పదో పరకో మా మీద విసిరేసిపోతాయి.ఏం చేస్తాం! మళ్ళీ ఇంకో దయార్ద్ర హృదయుడికోసం ఎదురుచూడటంతప్ప!నన్నుచూసిన వారెవ్వరూ నా దగ్గరికిరారు. నా రూపం అంతభరించలేనిదిగా ఉంటుంది. ఈ విశాలదేశంలో నాలాంటివాళ్లెందరో! మాదో ప్రత్యేక ప్రపంచం. మేంతప్ప మరొకళ్ళు చూడటానికి ఇష్టపడని ప్రపంచం మాది.ఏదో కారు ఆగినచప్పుడు కావటంతో నా ఆలోచనలూ ఆగాయి.

ఎవరో ముగ్గురు వ్యక్తులు దిగారు. వాళ్ళలో ఇద్దరు ఏదో పెద్దబ్యాగ్‌ పట్టుకున్నారు. మూడో ఆయన ముందునడుస్తూ మా వైపే వస్తున్నాడు. కొంపదీసి, ‘ఇక్కడినుంచి పొండిరా’ అనరు కదా!చుట్టూ చూశాను. మొత్తం పదిహేనుమంది ఉన్నాం. అందరూ చలికి గజగజవణికిపోతున్న వారే. కానీ ఎవరూ కళ్ళుతెరచి చూడటంలేదు. మాతో భార్యాభర్తలుకూడా కలిసి అడుక్కుతినే వాళ్ళున్నారు. కేవలం భద్రతకోసం భార్యాభర్తలైనవారున్నారు. వాళ్ళుమాత్రం ఒకరినొకరు కరుచుకుపోయి చలిని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.నా చుట్టూవున్న వీళ్ళందరికీ నేనంటే భయమే! అసహ్యమే! ఏం చేయను! నా అవతారమే అంత.

కొబ్బరినూనెకు నోచుకోని జడలుకట్టినజుట్టు. స్నానంచేసి కొన్నినెలలైపోయింది. ఒళ్లంతా మకిలితో మురికిగా ఉంది. నన్నుచూసి భరించలేక దయతో నాపై బట్టలు విసురుతారు. అలా వచ్చిన ఓ రెండో, మూడు జతలే నాకు సంవత్సరం వరకు!అదిగో ఆ బ్యాగ్‌వాళ్ళు మా దగ్గరకు వచ్చేశారు. ఒంటికన్నుతో ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం చేశాను. నమ్మలేకపోయాను. ఒకొక్కక్క శరీరంమీద ఒక్కొక్క దుప్పటి కప్పుతున్నారు వాళ్ళు!