రాత్రి 10:30 నిమిషాలు. బెడ్రూంలో సూరిబాబు భార్య, కొడుకు నిద్రలోకి జారుకుంటున్నారు. బెడ్‌ ల్యాంప్‌ కూడా వారికి జోలపాడుతున్నట్లు మత్తుగావెలుగుతోంది. ఇంతలో... హాల్లో లైటు ఆరిపోయింది. ఒక మనిషి భారంగా అడుగులు వేస్తూ బెడ్రూంలోకి అడుగుపెట్టాడు. గరగరా ఫ్యాన్‌ తిరుగుతున్న చప్పుడులో కూడా, అతను వెక్కివెక్కి ఏడుస్తున్న శబ్దం వినిపిస్తోంది. అలా ఏడుస్తూనే మంచం మీదకి ఒరిగిపోయాడు. అతనే సూరిబాబు!

చెట్టంత మొగుడు వెక్కివెక్కి ఏడుస్తుంటే సూరిబాబు భార్య కంగారుపడలేదు సరికదా ... ‘ఉష్షో’ అంటూ అటు తిరిగి పడుకుంది. ఆవిడకి ఇదంతా మామూలైపోయిందయ్యే! సూరిబాబు ఆఫీసు నుంచి రాగానే చటుక్కున తయారైపోయి ప్రవచనాలు వింటూ కూర్చోవడం. అవి వింటూ వింటూ వెక్కివెక్కి ఏడవడం, ప్రవచనం పూర్తయ్యాక అలా ఏడుస్తూనే వచ్చి మంచం మీదకి వాలిపోవడం ... ఆమెకి మామూలైపోయింది.‘ఎందుకలా చంటిపిల్లాడిలా ఏడుస్తారు?’ అంటే ‘ఇది ఏడుపు కాదు. స్వామీజీ ప్రవచనాలు విన్న నా హృదయం ద్రవించిపోతుంది. కంఠం పూడుకుపోతుంది. ఈ పాడు సంసారాన్ని వదిలేసి ఏ హిమాల యాలకో వెళ్లిపోవాలనిపిస్తుంది ...’ అంటూ ఊదరగొట్టేస్తాడు. పోనీ ఏదీ మాట్లాడకుండా ఊరుకుందామా అంటే, ఆ రోజు ప్రవచనంలో విన్న విషయాలన్నీ పొద్దుపోయేదాకా వినిపిస్తాడు.

ఆధ్యాత్మికత అనే సముద్రంలో తను ఎంత లోలోతుల్లో ఈత కొడుతున్నాడో రుజువు చేసే ప్రయత్నం చేస్తాడు.ఆవేళ కూడా అతను తన జ్ఞానాన్ని ఆమెతో పంచుకునే ప్రయత్నం మొదలుపెట్టాడు. ‘‘ఇవాళ స్వామీజీ ఏం చెప్పారో తెలుసా .. ఎంతటి ఆత్మీయులైనా సరే, చావు తర్వాత మన వెన్నంటి వచ్చేందుకు ఇష్టప డరట. నువ్వే చెప్పు ... నేను నరకానికి వెళ్లాల్సి వస్తే, నువ్వు కూడా నాతోపాటు వస్తావా?’’ అని భార్యకి సవాలు విసిరాడు సూరిబాబు.‘‘నేను రాను. నాకు బోల్డు పనులున్నాయి. కావాలంటే మీరు వెళ్లండి. అయినా మీతో కాపురాన్ని మించిన నరకం ఏముంటుంది?’’ అని నిష్టూరాలాడింది.‘‘హుమ్‌ .. చూశావా. ఇలాంటి జవాబులే వస్తాయని స్వామీజీ చెప్పారు. చీటీపాట ఉంది, ఇడ్లీ పిండి పులిసిపోతుంది, జాకెట్టు గుడ్డ టైలర్‌ దగ్గరే ఉండిపోయింది ... లాంటి సాకులన్నీ చెప్పి ఎవ్వరూ మనకి తోడు రారని చెప్పనే చెప్పారు’’ అంటూ వగచాడు.