కూటికి పేద.గానీ గుణంలో దేవుడంత గొప్పవాడతను. అన్ని రకాలుగానూ కష్టపడేవాడు. చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేశాడు. వకీలు వెనక ఫైళ్ళు మోస్తూ తిరిగేవాడు. నిజాయితీయే ఆయనకు శ్రీరామరక్ష. అందుకే ఓ చిన్న ప్రభుత్వ ఉద్యోగం దొరికిందాయనకి. మానవసేవే మాధవసేవగా జీవించాడు. అందరిచేతా దేవుడు అనిపించుకున్నాడు. మరి అతని కొడుకు మాత్రం ఆ బాపతుకాదు. అతని దారి అడ్డదారి...! అడ్డగోలుదారి!

ఇంటిపన్నులు కట్టించుకునే శివన్నారాయణ సైకిలుమీద వచ్చేవాడు. సన్నగా పొడుగ్గా రివటలాగా ఉండేవాడు. నొక్కుకుపోయిన రబ్బరుబొమ్మ ముఖం, జుత్తుకి ఒత్తుగా నూనె రాసుకుని పైకి దువ్వుకునేవాడు. ఎందుకో నాకు అతన్ని చూడాలనిపించేది. నిజాయితీగా, గట్టిగా మాట్లాడేవాడు. కుండబద్దలు కొట్టేవాడు. అందరిదగ్గర అతడికి ఆ పేరుంది.మా ఇల్లు నాలుగురోడ్ల కూడలిలో ఉంది. మా ఇంటిదగ్గర సైకిలుఆపి ఇంటిపన్నులు వసూలు చేసుకుని వెళ్ళేవాడు.‘‘టైము దాటకుండా, నెలలకు నెలలు గడపకుండా కచ్చితంగా ఇంటిపన్ను కట్టేది నారాయణమ్మ ఒక్కత్తే’’ అని మా అమ్మకి కితాబు ఇచ్చేవాడు. ప్రతిగా మా అమ్మ ఓ నవ్వు నవ్వి, ‘కట్టుకుంటే మాకే భారం తగ్గిపోతుంది కదా’’ అనేది.

‘‘అందరూ అలా ఆలోచించరమ్మా’’ అంటూ రశీదు రాసేవాడు శివన్నారాయణ. ఏభై సంవత్సరాలకింద పన్నులు కదా. ఐదు, పదుల్లోనే ఉండేవి. అవి కట్టడమే గగనమైపోయేది. నవ్వుతూ మాట్లాడేవాడు శివన్నారాయణ. నన్నుచూసి పలకరించేవాడు.‘‘ఏట్రా ఏం చదువుతున్నావు?’’ అని.‘‘రెండో క్లాసు’’ టక్కున సమాధానం చెప్పాను.‘‘మీ నాన్న, నేను స్నేహితులం. నీకు తెలుసా?’’ కళ్ళెగరేస్తూ చెప్పాడు శివన్నారాయణ.‘వాడికేం తెలుసు నారాయణా’’ అమ్మ అంది.‘‘అవును. వాడికేం తెలుసు. ఏదో మాటల్లో అన్నాను. అయితే మీ నాన్నగురించి నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి రా’’ అన్నాడు శివన్నారాయణ.నేను ‘‘చెప్పు, చెప్పొద్దు’’ అనలేదు.

ఏం చెబుతాడో వింటున్నాను. కళ్ళద్దాలు తీసి మడిచి జేబులో పెట్టుకుని, దీర్ఘంగా నిట్టూర్చి’’ మీ నాన్న గురించి మీ అమ్మకి కూడా తెలియదురా. చాలా కష్టపడి ఈ రోజు గవర్నమెంటు ఉద్యోగంలోకి వచ్చాడు రా. తోటలో మొక్కలకి రోజూ రెండుపూట్ల నీళ్ళు పోసేవాడు. కర్రలు కొట్టేవాడు. పొద్దున్న ఐదుగంటలనుంచి రాత్రి పది గంటలదాకా పనిచేసేవాడు. ఆ పని ఈ పని అని లేదు. అన్ని పనులూ చేసేవాడు. వకీలు శంకరంపంతులుగారింట్లో పదిసంవత్సరాలు పనిచేశాడు. కోర్టుకి ఫైళ్లు పట్టుకుని గుర్రబ్బండి వెనక పరుగు తీసేవాడు. వకీలు కూడా ధర్మాత్ముడు. బాగా చూసుకునేవాడు. మీ నాన్నది పెద్ద కుటుంబం. ఇప్పడంటే ఎవరూలేరు. మీ అత్తలకి పెళ్ళిళ్ళు చేశాడు. మీ చిన్నాన్నకి ఉద్యోగం వేయించాడు. అమ్మలేదు. నాన్న రోగిష్టి... చాలా కష్టపడ్డాడు’’ ఇంకా ఏదో చెప్పబోతుంటే మా పక్కింటి డబ్బాడ సుబ్బన్న డబ్బులు పట్టుకుని వచ్చాడు. ఇంటిపన్ను కట్టడానికి. ‘‘రావోయి ప్రవీ! రా రా. ఇన్నాళ్ళకి తీరికయిందా? నీదెంత బకాయి ఉందో తెలుసా’’ అంటూ సుబ్బన్న చేతిలో నోట్లు లాక్కున్నాడు శివన్నారాయణ.