ఒకానొకప్పుడు వీరసేనుడనే రాజు అడవికి వేటకు వెళ్ళాడు.క్రూరజంతువుల్ని వేటాడి వేటాడి అలసిపోయాడు. అతడికి అంతులేని దాహంవేసింది. సమీపంలో మంచినీటికొలను ఉందేమోనని భటులు చుట్టుపక్కల వెదకిచూశారు కానీ వారికి నీటిజాడే దొరకలేదు. అయినా నిరాశచెందక వెదుకుతుంటే ఓ ముని ఆశ్రమం కనబడింది. ఆశ్రమ ప్రవేశద్వారం దగ్గర ఇద్దరు మునికుమారులు కాపలా ఉన్నారు. భటులువారికి విషయం చెప్పారు.

‘‘ఇప్పుడు మునీశ్వరులవారు తీవ్రమైన తపస్సులో ఉన్నారు. లోపల చీమచిటుక్కుమన్నా వారికి తపోభంగమౌతుంది. కాబట్టి ఎవర్నీ లోపలకు వెళ్లనిచ్చేది లేదు’’ అని మునికుమారులు భటుల్ని వెనక్కి పంపేశారు. వాళ్లు తిరిగివెళ్లి రాజుకు విషయం చెప్పారు. వీరసేనుడు తనే స్వయంగా బయల్దేరి ఆశ్రమానికి చేరుకున్నాడు. మునికుమారుల్ని కలుసుకుని, ‘‘మునికుమారులారా! నేను ఈ దేశపు రాజుని. తీవ్రమైన దాహంతో బాధపడుతున్నాను. సమీపంలో ఎక్కడా మంచినీటి కొలను లేదు. మీ ఆశ్రమంలో తప్పక మంచినీటి సదుపాయం ఉంటుందన్న ఆశతో వచ్చాను. దయతో నన్ను లోపలకు వెళ్లి దప్పిక తీర్చుకోనివ్వండి’’ అని మర్యాదగా అడిగాడు.మునికుమారులు చలించలేదు.

వారు రాజుకు వినయంగా నమస్కరించి, ‘‘మహాప్రభూ! అతిథిమర్యాద ఎటువంటివారికైనా గౌరవాన్నిస్తుంది. కానీ ఇప్పుడు మా గురువర్యులు ఘోరతపస్సులో ఉన్నారు. తగిన కారణముంటే వారికి తపోభంగం చేయొచ్చు. కానీ అందుకు మీ దాహం సరైన కారణం కాదు’’ అన్నారు.‘‘ఈ దేశానికి రాజుని. నాకు దాహం వేస్తే ఆ దాహం తీర్చడం - మీ ఆశ్రమానికి తగిన కారణం కాదా? ఇదేమి సంజాయిషీ?’’ అన్నాడు రాజు చిరుకోపంతో.‘‘ఔను ప్రభూ! మీ దాహం స్వయంకృతాపరాధం. జంతువుల్ని వేటాడాలన్న తమకంలో మీరు పరిసరాలు, పరిస్థితులు చూసుకోలేదు. ఒక దేశానికి మహారాజైన మీరు ఇటువంటి పరిస్థితి వస్తుందని ఊహించి ముందుచూపుతో మంచినీటికి తగిన ఏర్పాటు చేసుకోవలసింది. ఇప్పుడైనా తమరు మాతో మాట్లాడుతున్న తీరునిబట్టి తమ దాహం తీవ్రమైనది కాదని తోస్తోంది. కాసేపు మనసు చిక్కబట్టుకుంటే మీ దాహం దానంతటదే కడుతుంది’’ అన్నారు మునికుమారులు వినయంగా.