‘‘నీది శాపగ్రస్థ జీవితమయ్యా!.... దీన్నించి బయటపడాలంటే చాలాకష్టం. నేను చెప్పే రెమి డీస్‌ పాటించాలి’’.సిద్ధాంతి గారు చెబుతుంటే, నాకేం ఆశ్చర్యం కలగలేదు.ఎందుకంటే, ఊహ వచ్చినప్పట్నుంచీ అనుభవిస్తున్నదేగా?!‘ఏ రెమిడీలు?’ అని ఆయన్ని అడగలేదు. నిశ్శబ్దంగా బయటకు వచ్చేశాను.

అన్ని జన్మల్లోకి గొప్ప జన్మ మానవ జన్మట.అదేగా ఎత్తింది నేను.ఎత్తింది మానవజన్మే అయినా తతిమా జీవరాశి ఎన్నికష్టాలు పడుతుందో.... అంతకంటే ఎక్కువేపడ్డాను.. పడుతున్నాను.ఎక్కడపడ్డా, పడినచోటే ఉండిపోకుండా.. పడుతూ లేస్తూ ముందుకు సాగుతూనే ఉన్నాను. నా జీవితంలో మొదటిదెబ్బ నా పదేళ్ళ వయస్సులో అమ్మకాలం చేయడం. అప్పుడు నేను ఆరో తరగతిలో ఉన్నాను.నాన్న మరో పెళ్ళి చేసుకున్నారు. పిన్ని సహజంగానే నేనంటే ఇష్టపడేది కాదు. స్కూల్నుంచి వచ్చినంతనే బండెడు చాకిరీ నా మీద పడేది.స్కూల్లో హోం వర్క్‌ చేయడానికి కూడా కుదిరేది కాదు.ఇంట్లో పిన్ని ఇచ్చిన పనంతా చేసినా నాన్నకు నా మీద ఫిర్యాదులు చేసేది. అసలే ఆఫీసు పనితో అలసిపోయిన వచ్చిన నాన్న ఆ విసుగుని కోపంగా మార్చుకొని నా మీద బెల్ట్‌ ఎత్తేవాడు.ఫలితం నా వీపు, కాళ్ళూ చేతులూ వాచిపోయేవి.

ఇలా వారంలో వారం రోజులూ జరుగుతుంటే ఇల్లంటే నరకం అయిపోయింది.కాలక్రమంలో పదో తరగతి పరీక్షలు తరుముకుంటూ వచ్చిపడ్డాయి.నాన్న అన్నది ఒక్కటేమాట.‘టెన్త్‌ అంటే టర్నింగ్‌ పాయింట్‌. పాసయితే సరే, ఫెయిలవ్వావో ఏదో ఒక పనిలో పెట్టేస్తా.. బండెడు సంసారాన్ని పోషిస్తూ, పదేపదే నీతో పరీక్షలు రాయించలేను.’’పిన్నికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు.అంటే నాకు ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్ళు అన్నమాట.పిన్ని బాగా దుబారా మనిషి.నాన్న ఒక్కడి సంపాదనా ఆమె రెండు చేతుల్తో ఖర్చు పెట్టేస్తుంటే, చూస్తూ ఉండడం తప్ప ఎదిరించే శక్తిలేదు.