‘‘శుభోదయం సుబ్బారావు గారు...’’ కరచాలనంచేసి నవ్వుతూ చెప్పారు శ్రీనివాసరావుగారు.‘‘ప్చ్‌...ఏం శుభోదయమో! హాయిగా మనవడు, మనవరాళ్ళతో ఉల్లాసంగా గడపవలసిన వయసులో ఇలా ఒంటరిగా ఉండడం బాధగా ఉందండి’’ నీరసంగా జవాబిచ్చారు సుబ్బారావుగారు.

‘‘అదేమిటి సార్‌.... అలా డీలాపడతారు. మనకేంతక్కువని.! మన వయసువాళ్ళం నలభైమంది ఉన్నాం. ఏ వయసుకాముచ్చట. వయసుమళ్ళినవాళ్ళం అందరం ఒకచోట చేరాం. ‘కృష్ణా రామా..’అంటూ హాయిగా టైం స్పెండ్‌ చేద్దాం’’ అంటూ ‘‘అయినా మీరు ఆ గదిలోంచి బయటికి రండి. అలా చెట్టుక్రింద కూర్చుని మాట్లాడుకుందాం’’ ఆహ్వానించారు శ్రీనివాసరావుగారు.సుబ్బారావుగారు బయటకురాగానే ఇద్దరూ కలిసి చెట్టుక్రింద చేరారు. ‘‘మీరెంతచెప్పినాగానీ, పరాయివాళ్ళు అయినవాళ్ళెలా అవుతారండీ. అసలు సమస్య నా భార్యతోనే వచ్చింది. దానికి కోడలితో రోజూగొడవే. ‘సర్దుకుపోవే’ అని ఎంతచెప్పినా వినేదికాదు. మా అబ్బాయి అటు భార్యకీ, ఇటు తల్లికీ సర్దిచెప్పలేక సతమతమై చివరికి మమ్మల్నితెచ్చి ఇక్కడ పడేశాడు.

నేనిక్కడ మనశ్శాంతితో ఉండలేకపోతున్నాను’’ అంటూ చెట్టుక్రింద బెంచీమీద కూర్చున్నారు సుబ్బారావుగారు.‘‘ఈ ఆశ్రమం కట్టించిన వారికి మనం ముందుగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈ మామిడి చెట్లక్రింద బెంచీమీద కూర్చుని ఇలా కబుర్లు చెప్పుకోగలగడం ఆనందంగాలేదూ. ఉషోదయాన ఈ ఆహ్లాదకరమైన వాతావరణం ఎపార్ట్‌మెంట్లలో ఎక్కడ వస్తుందండీ. నామటుకు నేను మా అబ్బాయివాళ్ళతో పోరిమరీ ఇక్కడచేరాను. నలభైమంది స్నేహితులం రోజూ కలుస్తూ ఉల్లాసంగా కబుర్లు కలబోసుకుంటూంటే దిగులేముంటుంది. మీరు కొత్తగా వచ్చారు కనుక కొంచెం ఫీలవుతున్నారు. నాలుగురోజులు ఇక్కడ వాతావరణానికి అలవాటుపడితే, మీ అబ్బాయివచ్చి తీసుకువెడతానన్న వెళ్ళలేరు. నాతో చేతులు కలపండి. సంతోషంగా శేష జీవితం గడపండి’’ ఉత్సాహపరిచారు శ్రీనివాసరావుగారు.