‘ఏవండీ! విశ్శు వాళ్ళు విస్కీతో వచ్చారట. వెళదాం పదండి’ అంది మా శ్రీమతి. విశ్శు ఎవరు, విస్కీ ఏమిటి అని అడిగి నలుగురిలో నగుబాటు కాదలచుకోలేదు. ఇంట్లో మేమిద్దరం కాక మా ఇద్దరు పిల్లలున్నారు. కారు తాళాలు పట్టుకొని కదలబోతున్నాను. కదనరంగానికి వెళుతున్నట్లు ‘ఈపాటి దూరానికి కారెందుకు. నడిచి వెళదాం’ అందావిడ. దారల్లా ఆల్కహాలిక్‌ ఆలోచనలే. అసలు విస్కీ కనిపెట్టింది ఎవరు? అందులో స్కాచ్‌ గొప్పది. ఎన్ని రౌండ్లయినా నిదానంగా ఉంటుంది. నిదానం ప్రధానం అన్నది నా పాలసీ. విస్కీ మీద రిస్కీ తీసుకోదలచు కోలేదు. ఎప్పుడూ నిత్యనూతనమే దాని టేస్టు.

పొలాన్ని దున్నుతున్న పోతన్నను చూసి శ్రీనాధుడు ‘హాలికులా’ అన్నాడు ఎద్దేవా చేస్తూ. దానికి రిటార్డు ఇస్తూ ఏడుపు కూడు తినే కన్నా కందమూలాలు తింటూ హాలికులైన నేమీ అన్నాడు పోతనామాత్యుడు. అదే మనమైతే ఆల్కాహాలికులు అని ఉందుము. అయితే వాళ్ళకు ఆంగ్ల భాష రాదు కదా! ప్రాథమిక పాఠశాలలో అప్పటి రాజులు బోధనాభాషగా ఆంగ్లాన్ని ప్రవేశపెట్టనందుకు జాలివేసింది. ఎంతైనా ఇప్పటి ప్రభుత్వానికి విజన్‌ ఉంది. డాలర్లు సంపాదించేందుకు అమెరికా, ఆస్ట్రేలియా వెళ్ళడం, అటునుండి ఖర్చులేకుండా కర్ర పేటికల్లో తిరుగు రవాణా అవ్వడం అంతా ఇంగ్లీషు మహిమేకదా! పరుగెత్తి పెప్సీ తాగే కన్నా నిలబడి నిమ్మరసం తాగడం మేలు అన్నది నా పాలసీ.తొమ్మిది వేల కోట్ల రూపాయిలని విస్కీలాగా దిగమింగి లండన్‌లో లక్షణంగా ఉన్నాడు విజయమాల్యా.

అసలు నాకు గాని పవరు ఉంటే వాడి ఆస్తినంతటినీ జప్తుచేసి పారేసే వాడిని. చాతగాని ప్రభుత్వం.... చాతగాని బ్యాంకులు.ఎలా జప్తు చేసేవాడివి గురవా అని నాలోని ఆత్మారాముడు అడిగాడు.‘సింపుల్‌... వెరీసింపుల్‌.. వాడు తయారుచేసిన విస్కీబాటిల్సుని నా ఫ్రిజ్‌లోపెట్టి ఫ్రీజ్‌ చెయ్య డమే.. ఆ తర్వాత వాటిని లిక్విడేటు చెయ్యడమే... హహ...’ అని వికటాట్టకోసం చెయ్యబోయి ఆగాను. నా మధిరాలోచనలకు బ్రేకువేసిన మా ఆవిడ.‘ఇదే.... విశ్శుగారి ఇల్లు...’ అంది.మా ఆవిడ విశ్శుగారి శ్రీమతితో బెడ్రూంలో సెటిలయిపోయింది. బాడీగార్డు ఉద్యోగం నుండి వాచ్‌మ్యాన్‌ పోస్టులో నేను కుదురుకున్నాను. నిశ్శబ్దాన్ని బద్దలుచేస్తూ వెక్కిళ్లు... ఆపై మా ఆవిడ. ఓదార్పులు వినబడ్డాయి. అప్రయత్నంగా ఒక చెవి అటు పారేసాను. మాటలు వినబడుతున్నాయి. అవునా. అది మా జనని గొంతుకే. ఎందుకంటే నిత్యం నన్ను సాధించినది అదేగా.