Noorkatla Kathaluకనిపించని మచ్చలురచనః వసుంధరఒకానొక గ్రామంలో సత్యశీలుడనే గృహస్థుకి ముగ్గురు కొడుకులు. పెద్దవాళ్లు వివాహాలు చేసుకుని సుఖంగా ఉన్నారు. చివరివాడైన సందీపుడికి పదహారో ఏట వళ్లంతా మచ్చలు వచ్చాయి. తండ్రి అతణ్ణి వైద్యుడికి చూపిస్తే వైద్యుడు ఏవో మందులు ఇచ్చాడు. కానీ, సంవత్సరాలు గడిచినా అతడికా మచ్చలు పోలేదు.వంటిమీద మచ్చలున్నాయని పదిమందిలోకీ వెళ్లడానికి ఇబ్బంది పడేవాడు సందీపుడు. అతడి మనసుకు కష్టం కలుగుతుందని ఇంట్లోవాళ్లు ఆ మచ్చల మాటెత్తకుండా ఎంతో జాగ్రత్తగా మసలుకునేవారు. అయినప్పటికీ, సందీపుడికి జీవితమంటే విరక్తి కలిగి చచ్చిపోదామని కొన్నిప్రయత్నాలు చేశాడు. కానీ, అన్నిసార్లూ ఏదో తెలియని శక్తి అతణ్ణి కాపాడింది.సందీపుడి ఆత్మహత్యా ప్రయత్నాలు తల్లిదండ్రుల్ని కలవరపెట్టాయి. 'నీ వంటిమీద మచ్చలు నీ అందాన్ని పాడుచేసాయి తప్పితే వాటివల్ల ఎవరికీ హాని లేదు. నీకున్నది అంటువ్యాధి కూడా కాదు. ఆ మచ్చల మాట మర్చిపోయి, నీ తెలివితేటలు ఉపయోగించి సుఖంగా బ్రతకాలి. కావాలనుకున్నా చావు నీ దరికి చేరలేదు. అంటే ప్రపంచానికి నీ వల్ల ఏదో పెద్ద ప్రయోజనం ఉంది. అది సాధించాలనుకోవాలి తప్పితే జీవితంమీద విరక్తి కూడదు' అని వాళ్లు కొడుక్కి హితబోధ చేశారు. కానీ అతడికి జీవితంపై విరక్తి తగ్గలేదు.సత్యశీలుడీ విషయమై బాగా ఆలోచించగా- పట్నంలోని తన బంధువు రుచికుడి కొడుకు చంద్రకాంతుడికీ ఇలాగే వంటినిండా మచ్చలున్నాయని గుర్తుకొచ్చింది. కానీ ఆ కుర్రాడా మచ్చల్ని పట్టించు కోకుండా హాయిగా వ్యాపారం చేసుకుంటున్నాడు. సందీపుడు కొన్నాళ్లపాటు చంద్రకాంతుడితో గడపడం మంచిదని సత్యశీలుడికి తోచింది. 'పట్నంలో ఉండే మన చంద్రకాంతుడికీ చిన్నపట్నించీ వంటిమీద మచ్చలున్నాయి. అందుకు వాడు ఇటీవల ఓ కొత్త వైద్యుణ్ణి ఆశ్రయించాడని తెలిసింది. నువ్వక్కడికెళ్లి వాడితో కొన్నాళ్లుండి ఆ వైద్యమేమిటో తెలుసుకో. నచ్చితే నువ్వూ ఆ వైద్యమే చేయించుకో' అని కొడుక్కి చెప్పాడతడు.సరేనని సందీపుడు ఇల్లొదిలి పట్నం బయల్దేరాడు. అక్కణ్ణించి పట్నానికి రెండు దారులు. ఒకటి సుగమమైన చుట్టు దారి. రెండవది ప్రమాదకరమైన అడివిలోంచీ దగ్గర దారి. అసలే జీవితాశ లేని సందీపుడు అడివిదారినే ఎంచుకుని పట్నానికి బయల్దేరాడు. కొత్త కావడంవల్ల కొంత దూరం నడిచేక దారి తప్పాడు. ఎంత నడిచినా దారి తరగడం లేదు. నడిచి నడిచి అలసిపోయి, చివరికి ఓ కొలను దగ్గిర చతికిలబడ్డాడు. కాసేపటికే అతడికి వళ్లు తెలియని నిద్ర పట్టింది. ఆ నిద్రలో సందీపుడికి ఓ కల వచ్చింది. ఆ కలలో ఒక దేవతా పురుషుడు కనిపించి, 'సందీపా, నీ అదృష్టం కొద్దీ ఇక్కడికొచ్చావు. ఈ కొలనులో స్నానం చేశావంటే నీ వంటిమీది మచ్చలిక నీ కంటికి కనిపించవు' అని చెప్పి అదృశ్యమైపోయాడు.