అతడిది భూస్వామి కుటుంబం. ఆమెది ఓ పేద కూలీ కుటుంబం. అందాలరాశి. ఒక ఫంక్షన్‌లో ఆమెను చూశాడతను. ఆమె చీరకట్టుచూసి ఫిదా అయిపోయాడు. వివరాలు సేకరించాడు. చేసుకుంటే ఈమెనే చేసుకుంటా అని తల్లిదండ్రులకు చెప్పాడు. వాళ్ళూ ఆనందంగా ఒప్పుకున్నారు. అన్నీ కుదిరాయి. అతను గాల్లో తేలిపోతున్నాడు. ఆ అమ్మాయి కూడా ఎంతో చొరవచేసి అతనికి ఫోన్‌ చేసింది. ఇద్దరూ ఒకచోట కలిసి కబుర్లాడుకోవడం మొదలెట్టారు. అప్పుడు.....

**********************

సాయంత్రం ఇంకో అరగంటకు ఆఫీసునుండి బయటపడవచ్చు అనుకుంటుండగా కాశ్యప్‌ సెల్‌కు కాల్‌ వచ్చింది. కొత్త నంబరు.‍‘‘నేను లలితను మాట్లాడుతున్నాను!’’లలిత ఎవరో వెంటనే గుర్తించలేకపోయాడు కాశ్యప్‌.‘నాలుగురోజులక్రితం పెళ్ళిచూపుల్లో చూసిన ఆ అమ్మాయి కాదుగదా...ఆ అమ్మాయిపేరూ లలితే!’అనుమానిస్తూనే ‘‘చెప్పండి!’’ అన్నాడు.‘‘గుర్తుపట్టారా?’’ అన్నది చిన్నగా నవ్వి.‘‘అంటే...మొన్న వచ్చింది మీ ఇంటికే గదా!’’‘‘అవునండీ, నన్ను వివాహం చేసుకునేందుకు మీరు అంగీకారం తెలియజేశారని మీ నాన్నగారు, మా నాన్నగారికి రాత్రి ఫోన్‌ చేశారు!’’‘‘చెప్పండి...చెప్పండి!’’ అన్నాను హుషారుగా కాశ్యప్‌.

కాబోయేభార్యతో మాట్లాడటానికి మించినఆనందం మరేముంటుంది.‘‘సాయంత్రం మనం ఎక్కడైనా కలవగలుగుతామా?’’ అన్నదామె చిన్నకంఠంతో కాస్త తడబడుతూ. ఆడపిల్ల చొరవతీసుకుని అలా అడగటం ఇబ్బందే మరి.‘‘తప్పకుండా...ఎక్కడ కలుద్దామంటారు?’’‘‘ఆఫీసు అవ్వగానే ట్యాంక్‌బండ్‌ మీదకు రండి. నన్నయ్యవిగ్రహం దగ్గర కలుద్దాం!’’ ధైర్యంగా తన మనసులోని మాట చెప్పింది.‘‘తప్పకుండా!’’‘‘థాంక్యూ!’’ ఫోన్‌ ఆఫ్‌ చేసేసింది లలిత.సెల్‌లోనే టైం చూశాడు కాశ్యప్‌. నాలుగున్నర. ఫోన్‌ ఆఫ్‌ చేస్తుండగా ఒక అనుమానమొచ్చింది. ‘ఇప్పుడు లలిత తనని ఎందుకు కలవాలనుకుంటున్నది?’ అని.

లలితను తను ఓ ఫంక్షన్‌లో చూశాడు. మెరిసిపోతున్న ఆ అమ్మాయి అందానికి మొదటిచూపులోనే దాసోహం అన్నాడు. పచ్చటిపసిమి చాయ. సన్నగా పొడుగ్గా బంగారుతీగలా ఉన్నది. పెద్దపెద్ద కళ్ళు. ఒత్తైన తలకట్టు. కళగల ముఖం. ఆ అమ్మాయికి తెలియకుండానే ఆ ఫంక్షన్‌లో సెల్‌ఫోన్‌లో ఫొటోలు కూడా తీసుకున్నాడు.ఆ అమ్మాయి వివరాలు సేకరించమని స్నేహితుల్ని పురమాయించాడు. వారంరోజుల్లో వివరాలు వచ్చేశాయ్‌. బీటెక్‌ చేసి సాఫ్ట్‌వేర్‌లో పని చేస్తోంది. తనకంటే నాలుగేళ్ళు చిన్న.వివరాలుచెప్పి, తను తీసిన ఫొటోలు తల్లికి చూపిస్తూ ‘‘చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను లేదా జీవితాంతం బ్రహ్మచారిగానే ఉంటాను’’ అంటూ వార్నింగ్‌ కూడా ఇచ్చాడు.