కరువు వచ్చి పడింది. తినడానికి తిండి లేదు. తాగడానికి నీళ్ళు లేవు. భార్యతో పాటుగా ఎక్కడోఓ దగ్గరకు వెళ్ళి బతుకుదామంటే...ఊరిలో ఇల్లూ, రెండెకరాల భూమీ ఎవరికి అప్పజెప్పాలి? అప్పజెపితే తిరిగొచ్చే వేళకు ఉంటాయా? అనుమానమే! అందుకే భార్యను ఊరిలోనే ఉండమని చెప్పి, ఉన్నమేరకు ఆమెకు కొంత డబ్బు ముట్టజెప్పి, తాను ఒక్కడే పనికోసం, సంపాదన కోసం బయల్దేరాడు రామయ్య. తూర్పు వైపుగా ప్రయాణించాడు. మూడు రోజులకి ఓ నగరానికిచేరుకున్నాడు. అక్కడ ఓ కామందుని కలిశాడు. తన పరిస్థితీ, తన ఊరి పరిస్థితీ చెప్పాడు.ఏదైనా పని కల్పించమన్నాడు.‘‘ఏం పని చేస్తావు?’’ అడిగాడు కామందు.‘‘ఏ పనైనా చేస్తాను.’’ అన్నాడు రామయ్య.‘‘సరే! నెలకి నాలుగు వెండి వరహాలు చొప్పున, సంవత్సరానికి నలభై ఎనిమిది వెండివరహాలిస్తాను. అయితే నెలా నెలా నీకు వరహాలు ఇవ్వను. సంవత్సరానికి ఒకేసారి ఇస్తాను. ఆ వేతనానికే మూడేళ్ళపాటు నువ్వు పని చెయ్యాలి. మధ్యలో మానేయ కూడదు.?’’ అన్నాడు కామందు.మానేయనన్నాడు రామయ్య. నమ్మకంగా పని చేయసాగాడు. ఓ ఏడాది గడిచింది. చెప్పినట్టుగానే నలభై ఎనిమిది వెండి వరహాలనూ రామయ్య ముందు ఉంచాడు కామందు

.‘‘ఇదిగో, ఏడాదికి నేను నీకు ఇస్తానన్న నలభై ఎనిమిది వెండి వరహాలు.’’డబ్బును ఆనందంగా చూశాడు రామయ్య. చేతులు జాచి అందుకోబోయాడు.‘‘ఆగాగు’’ అన్నాడు కామందు. ఆగిపోయాడు రామయ్య.‘‘ఈ డబ్బును నువ్వు నాకు ఇస్తే నీకో మంచి సలహా ఇస్తాను.’’ అన్నాడు కామందు.‘‘డబ్బు ఇవ్వలేదనుకో! ఈ డబ్బూ ఇవ్వను, పైగా ఈ క్షణమే నిన్ను పనిలోనుంచి కూడా తీసేస్తాను.’’ అన్నాడు అంతలోనే. చేస్తున్న పనితో తన పొట్టయినా నిండుతోంది. ఈ పనీ లేకపోతే బతకడం కష్టం అనుకున్నాడు రామయ్య. కామందు సలహాకి ఒప్పుకున్నాడు.‘‘చెప్పండి.’’ అడిగాడు.‘‘అయితే విను! కొత్తదారి కనిపించిందని, పాతదారిని వదులుకోకు. ఎప్పుడైనా పాతదారిలో ప్రయాణించడమే క్షేమం.’’ అన్నాడు కామందు.రెండో ఏడు గడిచింది. అప్పుడు కూడా కామందు అదే పితలాటకం పెట్టాడు. చెప్పండి అంటే... రెండో సలహా చెప్పాడిలా.‘‘పడుచుపెళ్ళాం, ముసలిమొగుడూ నడుపుతున్న సత్రంలో ఎప్పుడూ బస చెయ్యకు.’’