బాల్యం నుంచీ ఆమెకు జంతు భయమే. ఎప్పుడూ అవే కలలు. అవి నిజమో, ఊహాజనితమోగానీ జంతువులు ఆమెను కబళించాలని చూస్తున్నాయి. ఒకసారి పాము, మరోసారి తోడేలు, ఇంకోసారి ‌హైనా, రక్తపింజర, ఎలుగుబంటి, ఖడ్గమృగం, హిప్పోపోటమస్‌...ఇలా జంతువులు ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. చివరకు ఆ మృగాలబారి నుంచి బయటపడే మార్గం తనే వెతుక్కుంది. ఏమిటామార్గం? వాటినుంచి ఆమె బయటపడగలిగిందా?......

స్వప్న పరుగెడుతోంది.గస పెడుతోంది. ఒళ్ళంతా చెమటలు. కళ్ళల్లో ఆవిర్లు.ఎంత పరుగెత్తినా కీకారణ్యం అంతం కావడం లేదు.వెనుక, క్రూరమృగాలు వెంబడిస్తూనే ఉన్నాయి. వాటి గాండ్రింపులతో అడవంతా ప్రతిధ్వనిస్తోంది.ఆమె కర్ణభేరిలు బద్దలవుతున్నాయి. నిస్సత్తువతో కాళ్లు పారాడలేకపోతున్నాయి.పండుటాకుల కింద అజ్ఞాతంగా ఉన్న ఎదుర్రాయి తగిలి, బోర్లా పడిందామె.

క్షణం ఆలస్యం చేయకుండా ఓ మృగం ఆమె మీదికి ఎగిరి దూకింది.దిగ్గున లేచి కూచుంది స్వప్న. కీకారణ్యం మాయమైంది. జీరోవాట్‌ బల్బు వెలుగు, గోడ గడియారపు సెకన్ల ముల్లు చప్పుడుతప్ప జంతువుల జాడలేదు.తెల్లవారుజాము మూడు దాటుతోంది. లేచి, మంచినీళ్ళు తాగింది. దడ తగ్గలేదు.మంచంమీద బాసికపట్టు వేసుకుని కూచుంది. మెదడులో విస్ఫోటనం విశ్రమించడంలేదు.తనకు ఈ ‘మృగాల బెడద’ ఏమిటో అంతుబట్టడంలేదు.నిజానికి తనకు జంతువులంటే ప్రేమ. మూగజీవులంటే మక్కువ. నాయనమ్మ పంచతంత్రం కథలు చెప్పేది. ఆ కథల్లోని పాత్రలన్నీ జంతువులే. ‘కరటక దమనకులు..’ ఆ పేర్లు పలకడానికి తను ఇబ్బంది పడేది.హైస్కూలు రోజుల్లో హ్యూ లాఫ్టింగ్‌ రాసిన డాక్టర్‌ డూలిటిల్‌ కథలు చదివింది. ఆ డాక్టరుకు జంతువులభాష తెలుసు. ఆయన ఓ పులికి ఆపరేషన్‌ చేస్తుంటే, పోలీసులు రాకుండా ఇతర జంతువులు అడ్డుకునే దృశ్యం మనసుమీద అలా స్థిరనివాసం ఏర్పరచుకుంది. పులులు, సింహాలు, చిరుతలు, మొసళ్ళు కూడా తన స్నేహితుల్లాగా కనిపించేవి.ఆ భావన తారుమారవుతుందని ఎన్నడూ ఊహించలేదు. మెల్లగా ఊహాలోకంలోకి ప్రయాణిస్తోంది.అప్పుడు, తను ఆరో తరగతి. ఓరోజు బాబాయిగారబ్బాయి వచ్చాడు. అతను ఇంజనీరింగ్‌ ఫస్టియర్‌ చదువుతున్నాడు. ‘చెల్లీ, చెల్లీ’ అంటూ భలే ఆడించాడు. ఎత్తుకుని తిప్పాడు. హోమ్‌వర్క్‌ చేయించాడు.ఈ రాత్రికి ‘అన్న దగ్గరే పడుకుంటా’ అని మారాం చేసింది. అమ్మ సరేనంది.