నాకు బోలెడు ముచ్చట్లు తెలుసును! కొన్ని కొన్ని విషయాలు పెద్దగా తెలియక పోవచ్చుగానీ ఎన్నో తెలుసు!... అనేకసార్లు నాన్నగారే నన్ను అదేమిట్రా; ఇదేమిట్రా అని అడిగి తెలుసుకుంటాడు. ముఖ్యంగా అమ్మకూ, నాన్నకూ చాలా స్వీట్స్‌ పేర్లు అస్సలు తెలియనే తెలియవు. నాకైతే షాపులో ఉండే అన్ని స్వీట్ల పేర్లూ తెలుసును. కావాలంటే వాటి పేర్లన్నీ ఇప్పుడే గడగడా ఒప్పచెప్పెయ్యగలను. అంతేకాకుండా ఏ టీవీ ఛానల్‌లో ఎప్పుడు ఏ ప్రోగ్రాం వస్తుందో నిద్దట్లో అడిగినా చెప్పేస్తాను. అదీ మన మెమొరీ పవరు!

అందాకా ఎందుకు? మొన్న నా అయిదో పుట్టినరోజుకి ఏమేం స్వీట్లు తేవాలో తేల్చుకోలేక అమ్మానాన్నా సతమతమవుతుంటే అంత పెద్ద ప్రాబ్లమ్‌ని అవలీలగా సాల్వ్‌ చేసుకొని, నా స్వీట్లు నేనే సెలెక్ట్‌ చేసుకున్నాను. అంతేనా... - మా క్లాస్‌లో ఎవరి బర్త్‌డే అయినా నేనే బాస్‌ని. అనేకసార్లు నా ఫ్రెండ్స్‌ నా సలహా లేకుండా ఏ పనీ చేయరు. ఒకవేళ పొరపాటున చేశారో అది వట్టి తుస్సే!అయితే నాకు తెలియనిదల్లా ఏమిటంటే నా మనసులో ఉన్న మాట స్పష్టంగా చెప్పగలగడం. చెప్పాలనుకున్నదాన్ని ఎట్లా చెప్పాలో తెలియదు. తెలిసినా అసలు విషయం పొల్లుపోకుండా మాటల్లోకి కుదించడం అస్సలు చేతకాదు.

మనసులో వంద విషయాలు అనుకుంటాను. అందులోంచి పదో పరకో బయటకు చెప్పగలుగుతాను. మళ్ళీ అందులో ఎదుటివారికి అర్థమయ్యేవిధంగా చెప్పగలిగేవి ఒకటో రెండో! మిగతావన్నీ ఒట్టిగా గాలిలోనే తేలిపోతాయి. ఏమనుకొని ఏం మాట్లాడతానో నాకే అర్థం కాదు. ఒకటనుకుంటే ఒకటి మాట్లాడతాను. చెప్పాలనుకున్నది ఒక్కోసారి మహా పసందుగా, చాలాసార్లు పరమ చెత్తగా చెబుతుంటాను. మొత్తానికి చెప్పాలన్న ఆత్రుత ఆరాటం ఉంటాయి. చెప్పేదాంట్లో నిజం కూడా ఉంటుంది. కానీ చెప్పడమే సరిగా రాదు. అదీ నాకు అసలు కష్టం!