ఆమెకు పెళ్లయింది.. తనతోపాటు ఓ పనివాడిని కూడా అత్తారింటికి తెచ్చుకుంది.. భర్తపై గుండె నిండా ప్రేమను పెంచుకుంది.. పిల్లలు పుట్టేందుకు గుళ్లు తిరిగారు.. ఆస్పత్రులు తిరిగారు.. అంతా బాగున్నా సంతానం మాత్రం కలగలేదు.. దేవుడి దయ కోసం ఎదురుచూడసాగారు.. కానీ అంతలోనే అనూహ్య ఘటన జరిగింది. పెళ్లయిన ఆరేళ్లకే రోడ్డు ప్రమాదంలో భర్త మరణించాడు.. పుట్టింటికి తీసుకెళ్తామని తల్లిదండ్రులు వచ్చినా రానన్నదామె. చివరకు ఏం జరిగింది..? అత్తారింటికి వచ్చేటప్పుడు ఆమెతోపాటు ఆ పనివాడు ఎందుకు వచ్చాడు..? ఆమెకు, అతడికి మధ్య సంబంధమేంటి..? తెలియాలంటే ఈ కథ చదవాల్సిందే...
************************ 

ఆఫీసులోని నా సీట్లోకూర్చుని ఫైలుచూస్తున్నప్పుడు ఉన్నట్టుండి జేబులో సెల్‌ఫోన్‌ మోగింది. బయటికి తీసిచూస్తే స్ర్కీన్‌పైన అమ్మ నంబర్‌ కనపడింది. నా మనసు ఏదో కీడు శంకించింది. సెల్‌ ఆన్‌ చెయ్యగానే అమ్మ ఆందోళనగా పలికింది. ‘‘ఒరేయ్‌ రాజేష్‌, నీ వదిన మళ్ళీ ఆత్మహత్యాయత్నం చేసిందిరా. వంటింట్లోకిదూరి తలుపేసుకుని ఒంటికి నిప్పంటించుకోబోయింది. సమయానికి మన రాముడుచూసి అడ్డుకున్నాడు. సావిత్రిచీరకు నిప్పు అంటుకునేలోగా తలుపు గొళ్ళెంవిరగ్గొట్టి లోపలికెళ్ళి ఒంటిమీద నీళ్ళుపోసి ఆర్పేశాడు. తనని అడ్డుకున్నాడనే కోపంతో సావిత్రి అప్పడాలకర్రతో రాముడి నెత్తిమీద బలంగా కొట్టింది. వాడితల చిట్లింది. చాలా రక్తం కారింది. నేను, మీ నాన్న వాణ్ణి దేవి నర్సింగ్‌ హోంకి తీసుకెళుతున్నాం. వాడికి రక్తం ఎక్కించాల్సి వస్తుందేమో. వాడి రక్తం నీ రక్తం ఒకే గ్రూపు కదా.

నువ్వు నేరుగా దేవి నర్సింగ్‌ హోంకొచ్చి నీ రక్తం ఇస్తే బావుంటుంది’’ అమ్మ మాటలు విని జవాబు చెప్పటానికి నాకు నోరుపెగల్లేదు.రెండేళ్ళక్రితం అన్నయ్య హఠాత్తుగా బైకుప్రమాదంలో చనిపోయాడు. అప్పటినుంచే వదిన మతిస్థిమితం కోల్పోయింది. పిచ్చిగా ప్రవర్తిస్తోంది. ఎంతమంది సైకియాట్రిస్టులకు చూపించినా, ఎన్ని కౌన్సెలింగులు చేసినా ఆమెలో మార్పురాలేదు. కొన్నాళ్ళక్రితం రైలుకింద పడాలని ప్రయత్నించింది. అప్పుడుకూడా రాముడే కాపాడాడు. ఇప్పుడుకూడా ఆమెను రక్షించి ఆమెచేతిలో గాయపడ్డాడు.

ఇలా రెండుసార్లు వదినని కాపాడిన రాముడు నిజానికి మా కుటుంబసభ్యుడు కాదు. మా ఇంట్లో పనిచేసే నౌకరు. వదిన మతిస్థిమితం కోల్పోయినప్పటినుంచి ఆమె కదలికల్ని గమనిస్తూ ఆమెను చిన్న పాపలా చూసుకుంటున్నాడు.‘‘ఏరా, నేను చెప్పింది విన్నావా?’’ ఫోన్‌లో అమ్మగొంతు విని ఆలోచనల్లోంచి తేరుకున్నాను.‘‘విన్నానమ్మా, ఆఫీసుకు సెలవుపెట్టి వెంటనే ఆస్పత్రికొచ్చేస్తాను’’ అంటూ ఫోన్‌ కట్‌చేసి లేచాను. ఆఫీసుకు సెలవుపెట్టి ఆగమేఘాలమీద నర్సింగ్‌హోంకి చేరుకున్నాను.