‘‘వాసుగారూ.... నాకో చిన్న హెల్ప్‌కావాలి’’ అడ్వొకేట్స్‌ చాంబర్‌లో కూర్చుని ఇంకొద్దిసేపటిలో వాదించబోతున్న ఓ కేసుకి సంబంధించిన ఫైల్‌ స్టడీ చేస్తున్న నేను తలెత్తి చూసాను.ఎదురుగా నా కొలీగ్‌ అడ్వొకేట్‌ రవీందర్‌. ‘‘నా కేస్‌ నంబర్‌ 36. బహుశా....! లంచ్‌ తర్వాత రీచ్‌ అవ్వొచ్చు. నాకేమో రెండున్నరకు ఇంపార్టెంట్‌ అప్పాయింట్‌మెంట్‌ ఒకటి ఉంది. కొంచెం నా కేసు మీరు అటెండ్‌ చేస్తారా... ప్లీజ్‌!’’ రిక్వెస్టు చేసాడు. ‘‘చాలా అర్జంటా...?’’ అడిగాను.

అతడు ఇబ్బందిగా నవ్వాడు... ‘‘హ... అర్జంట్‌ ... శ్రీకృష్ణ సదనం ఓల్డేజ్‌హోమ్‌కి వెళ్ళాలి. 2.45కి మంచి ముహర్తమేదో ఉందట. మా సిద్ధాంతిగారు చెప్పారు. మా అమ్మానాన్నలను ఈ రోజు అందులో జాయిన్‌ చేస్తున్నాము’’ మళ్ళీ ఏమనుకున్నాడో... తనే చెప్పాడు.‘‘మొన్నే వెళ్ళి చూసొచ్చాను. ప్రస్తుతం సిటీలో ఉన్న అన్నీ ఓల్డేజ్‌ హోమ్స్‌ కంటే ఇది చాలా మోడర్న్‌. మంచి సర్వీసు. మన ఇంట్లో కన్నా, వాళ్ళు బాగా చూసుకుంటారు. అందులో జాయిన్‌ అయిన వారినందరినీ అడిగాను. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు...!’’ అలా చెప్పడంలో అతని గిల్టీ కాన్షస్‌నెస్‌ తెలుస్తోంది.నేను నవ్వి, ‘‘సరే, మీరు వెళ్ళండి. నేను చూసుకుంటాను’’ అతని ఫైల్‌ తీసుకుంటూ చెప్పాను.వెళ్తూవెళ్తూ... మరో మాట కూడా చెప్పాడు. ‘‘ఆ.... అన్నట్లు, అక్కడ పేషెంట్స్‌ని కూడా తీసు కుంటున్నారు’’ ఈ చివరిమాట ఖచ్చితంగా నా కోసమేనని నాకర్థమైంది.

ఎందుకో ఆ క్షణం... ఓసారి ఇంటికి ఫోన్‌ చేయాలనిపించింది. అవతలి నుండి ప్రియంవద ఫోన్‌ ఎత్తింది. ‘‘ఊ... ఏమంటున్నారమ్మాయ్‌... మీ మామగారూ...? 12.30 అయిపోయింది భోజనం చేసారా ఆయన...?’’ క్యాజువల్‌గా అడిగినట్లు అడిగాను. తన నుండి ఏం జవాబు వస్తుందో... నేనూహించగలను.ఎప్పటిలాగే తను నవ్వింది. ‘‘ఈరోజు కూడా... నా వంటలేవి మావగారికి నచ్చలేదు. దాదాపూ ప్లేట్‌ విసిరేసినంత పనిచేసారు. కొంచెం కర్డ్‌ రైస్‌ మాత్రం తీసుకున్నారు. ఇంతకూ... ఇవ్వాళ ఏదో ఇంపార్టెంట్‌ కేస్‌ హియరింగ్‌ అన్నారు...?’’ టాపిక్‌ మార్చింది. నాన్నగారి ప్రవర్తనకు ప్రియంవద ఎంత బాధపడుతుందో... నాకు తెలుసు. అది తెలియనివ్వకుండా... తనెంత మానేజ్‌ చేసినా... ఆమె గొంతులో ధ్వనించే దుఃఖం నాకర్థమైపోతుంది. ఈ లోపు నా కేస్‌ రీచ్‌ అవుతుండే సరికి తనతో గబగబా ఏవో ఓ రెండు మూడు మాటలు మాట్లాడి, లేచి కోర్టు హాల్‌లోకి నడిచాను.