వాళ్ళిద్దరూ స్నేహితులు . వ్యాపార భాగస్వాములు . కార్తికేయ కంపెనీకోసం ఒళ్ళొంచి కష్టపడతాడు. అవినాష్‌ మాత్రం అమ్మాయిలతో పారిస్‌లోనో మరోచోటో ఎంజాయ్‌ చేస్తూ ఉంటాడు. ఆడిటర్‌కి రిటర్న్స్‌ ఫైల్‌ చేసేటప్పుడు ఇద్దరికీ సమానవాటా పంచాడు కార్తికేయ. అక్కడ మొదలైంది అసలు సమస్య. చినికి చినికి గాలివానగా మారింది . చివరకు ఆ స్నేహితులు విడిపోయారా ? లేక కథ సుఖాంతమైందా ?

‘‘ఇది చాలా దారుణం సర్‌...’’ అంది సంజన.‘‘ఏది...’’ అడిగాడు కార్తికేయ.‘‘కంపెనీలో శ్రమ అంతా మీది...లాభాల్లో అతనికి సమాన వాటా’’‘‘జస్ట్‌ షట్‌... అప్‌..’’ చిరుకోపం ప్రదర్శించాడు కార్తికేయ.‘‘నేను మేమ్‌తో ‘డిస్కస్‌’ చేస్తాను..’’ మొండిగా అంది సంజన.‘‘గెటవుట్‌ ఫ్రమ్‌ హియర్‌..’’ ఈసారి కాస్త కోపంగానే అన్నాడు.‘‘మీ ఉప్పు తినేప్పుడు ‘నిజాలు’ చెప్పడం నా ధర్మం, గోటుహెల్‌..’’ అంతే కోపంతో ఆడిట్‌ చేసిన ఫైల్‌ ‘బాస్‌’ టేబుల్‌ మీద విసురుగా పెట్టి వెళ్ళింది సంజన.‘‘క్రేజీ’’ అనుకున్నాడు’’ ఫైల్‌వైపు చూస్తూ.అతడి పార్టనర్‌ అవినాష్‌ గుర్తొచ్చాడు.‘‘వీడు ఇప్పుడు ఏ ప్యారిస్‌పిల్ల కౌగిట్లోనో, జపాన్‌లో ‘కాసినోవా’ లోనో ఉండి ఉంటాడు. ఫోన్‌ లిఫ్ట్‌చేయడు వెధవ’’ ముద్దుగా విసుక్కున్నాడు.

టేబుల్‌మీద సంజన పెట్టిన ‘ఫైల్‌’ వైపు చూశాడు.ఐ.టి. రిటర్న్స్‌ కోసం ‘కంపెనీ’ ఆదాయం సమానంగా పంపిణీ చేస్తూ తయారుచేసిన ఫైల్‌. ‘నాటీ గర్ల్‌’ అనుకున్నాడు. తను కాస్త ఎక్కువ చొరవ తీసుకుంటుంది. దానికి కారణం కూడా తనే.కంపెనీని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో తన విషయంలో కూడా అంతే కేరింగ్‌గా ఉంటుంది. కాసేపు ఎదురు చూశాడు. నాలుగవుతోంది. సంజన రాలేదు. తిట్టానని అలిగిందా?తనకు అన్నీ సమయానికి సమకూర్చిపెడుతూ ఉంటుంది.‘స్నాక్స్‌’లో మొలకెత్తిన గింజలు పంపుతుందా? లేక తనే స్వయంగా తెస్తుందా?గడియారం వైపు చూశాడు. మూడు యాభై తొమ్మిది.‘టంచన్‌’గా బెల్‌ కొట్టినట్టు, మొలకెత్తిన గింజలు ఒక ట్రేలో తెచ్చింది.ప్రక్కన మరో రెండు బిస్కట్స్‌ కూడా ఉన్నాయ్‌.‘‘షి ఈజ్‌ మోస్ట్‌ ప్రొఫెషనల్‌’...బట్‌ ఆల్‌ సో లవ్లీ’’ కార్తీకేయ పెదవులపై చిరునవ్వు.